ద‌ళిత బంధుపై ఫోకస్.. 18న క‌లెక్ట‌ర్ల‌తో సీఎం స‌మావేశం.. 

జనాల నుంచి విమర్శలు, విపక్షాల ఆరోపణలపై సీఎం కేసీఆర్ దిగొచ్చారు. దళిత బంధు పథకం అమలుపై ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ నెల 18వ తేదీన జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మావేశం కానున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి రాష్ట్ర మంత్రులు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, సీనియ‌ర్ అధికారులు పాల్గొన‌నున్నారు. ద‌ళిత బంధుతో పాటు ఇత‌ర అంశాల‌పై సీఎం చ‌ర్చించ‌నున్నారు. ఇప్ప‌టికే హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు యాదాద్రి జిల్లాలోని  ముఖ్యమంత్రి దత్తత గ్రామం వాసాల‌మ‌ర్రిలో ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లైంది. 

అయితే నవంబర్ తర్వాత రాష్ట్రమంతా దళిత బంధు అమలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. కాని నవంబర్ 4 పోయి నెలన్నర కావస్తున్నా దళిత బంధు ఊసే ఎత్తడం లేదు. లేదు దళిత బంధు పథకాన్ని కేసీఆర్ అటకెక్కించారనే ఆరోపణలు వచ్చాయి. కేవలం హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే  ఆ పథకాన్ని తీసుకొచ్చారని, అందుకే ఇప్పుడు మాట్లాడటం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. దళిత సంఘాలు కూడా సర్కార్ తీరుపై ఆగ్రహంగా ఉన్నాయి. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూ పంపిణి లాగే దళిత బంధు స్కీమ్ నిలిచిపోతుందనే అనుమనాలు వ్యక్తం చేశారు. అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తుండటంతో దళిత బంధు పథకం అమలుపై కేసీఆర్ ఫోకస్ చేశారని తెలుస్తోంది. 

మరోవైపు   టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల సమావేశం ఈ నెల 17న జరుగనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో సమావేశం జరుగతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో 12 స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. అలాగే పార్టీ నిర్మాణానికి తీసుకోవాలసిన చర్యలను సీఎం వివరించే అవకాశం ఉంది.