టాయిలెట్లు కట్టలేని సీఎం.. కిల్లర్ బస్.. జనంలోకి కేసీఆర్.. టాప్ న్యూస్@7PM

రాజధాని అమరావతి రైతులకు ఊరట లభించింది. తిరుపతిలో తలపెట్టిన అమరావతి పరిరక్షణ సమితి బహిరంగ సభకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 6 గంటల లోపు సభను నిర్వహించుకోవాలని ఆదేశించింది. కోవిడ్ ప్రోటోకాల్ ను పాటించాలని ధర్మానసం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 17న తిరుపతిలో సభ నిర్వహించనున్నారు అమరావతి రైతులు. 
----
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 3 టాయిలెట్లు కట్టలేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. 3 రాజధానులు కడతారా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు సమక్షంలో రిటైర్డ్ ఐపీఎస్ శేక్షావలి, నూర్ భాషా వర్గ నేతలు టీడీపీలో చేరారు. మైనారిటీల అభివృద్ధికి టీడీపీ ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రపతిగా కలాంను చేసిన సందర్భం ఎక్కువ తృప్తి నిచ్చిందని స్పష్టం చేశారు. 
-----
రాష్ట్రంలోని సామాన్యుడు రాజధానిలో ఉండలేని పరిస్థితిని గత ప్రభుత్వ నాయకులు తీసుకొచ్చారని హోం మంత్రి సుచరిత అన్నారు. వైసీపీకి 2019లో అధికారం ఇచ్చారనన్నారు. ప్రజలకు మంచి చేయడం చూసి టీడీపీ తట్టుకోలేపోతుందన్నారు. సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆమె అన్నారు. కుప్పం ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
------
ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ చర్చలు కొనసాగుతున్నాయి. అయితే చర్చలు జరుగుతున్న తీరుపై ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. చర్చల్లో పనికిరాని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఐకాస నేతలు బండి శ్రీనివాస్, బొప్పరాజు వెంకటేశ్వర్లుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.చర్చల్లా కాకుండా చిట్‌చాట్‌లా జరుగుతోందని సూర్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. 
---
పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడింది. బస్సు డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు మృతి చెందగా... మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. 
------
ఈ నెల 18వ తేదీన జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మావేశం కానున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రిగే ఈ స‌మావేశానికి రాష్ట్ర మంత్రులు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, సీనియ‌ర్ అధికారులు పాల్గొన‌నున్నారు. ద‌ళిత బంధుతో పాటు ఇత‌ర అంశాల‌పై సీఎం చ‌ర్చించ‌నున్నారు. ఇప్ప‌టికే హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంతో పాటు వాసాల‌మ‌ర్రిలో ద‌ళిత బంధు ప‌థ‌కం అమ‌లైంది. 
--------
తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారు కోవిడ్ పరీక్షల రిపోర్టులు వచ్చిన తర్వాతే బయటకు రావాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్ గుర్తించామని... వారితో కాంటాక్ట్ లోకి వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నామని అంజనీ కుమార్ తెలిపారు
------
తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి, చికిత్స పొందుతున్న భారత వాయు సేన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బుధవారం ప్రాణాలు కోల్పోయారు. దీంతో  ఆర్మీ హెలికాప్టర్‌  ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 14కు చేరింది. కెప్టెన్ వరుణ్ సింగ్ మరణ వార్తను ఐఏఎఫ్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అమరుడైనందుకు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. 
-------
తన కస్టమర్లకు స్వల్ప ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో. 100 ఎంబీ డేటాను 1 రూపాయికి అందిస్తున్నట్టు జియో ప్రకటించింది. అంటే 1 జీబీ డేటా 10 రూపాయలకు వస్తుందన్నమాట. జియో తీసుకున్న తాజా నిర్ణయం ఇతర టెలికాం కంపెనీలకు షాకిస్తోంది. అంతేకాదు 28 రోజుల వాలిడిటీని 30 రోజులకు పెంచుతున్నట్టు జియో ప్రకటించింది.
------
కెప్టెన్సీ నుంచి తప్పించడంపై తొలిసారి స్పందించాడు విరాట్ కోహ్లీ. తనను కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు కేవలం గంటన్నర ముందే చెప్పారని చెప్పాడు. టెస్ట్ జట్టు ఎంపిక సమయంలోనే సెలెక్టర్లు   వన్డే కెప్టెన్సీపై తనతో మాట్లాడారని చెప్పారు కోహ్లీ. అయితే  తనతో టెస్టు జట్టు గురించి చీఫ్ సెలెక్టర్ మాట్లాడారని.. అంతా అయిపోయాక.. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఐదుగురు సెలెక్టర్లు నిర్ణయించారని చెప్పారని తెలిపారు.
--