కేసీఆర్ అభద్రతాభావంతో ఉన్నారా?
posted on Feb 4, 2015 9:25AM
.jpg)
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల సమయానికి రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 154కి పెరుగుతాయని అందులో కనీసం 134 సీట్లు తెరాసయే గెలుచుకొంటుందని జోస్యం చెప్పారు. తెలంగాణాలో తెరాసకు వేరే ప్రత్యామ్నాయం లేదని కుండ బ్రద్దలుకొట్టినట్లు ప్రకటించారు.
తెరాస పార్టీ ఏకంగా 134 సీట్లు గెలుచుకోగలదని ఆయనకి అంత విశ్వాసం ఉన్నపుడు ఇతర పార్టీల నేతలని, యం.యల్యే.లని పార్టీలోకి ఆకర్షించేందుకు అంత ముమ్మరంగా ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు? చంద్రబాబు నాయుడు ఒక్కరోజు వరంగల్ పర్యటించేందుకు వస్తుంటే తెరాస మంత్రులు అంత తీవ్రంగా ఎందుకు ప్రతిస్పందిస్తున్నట్లు? వైకాపా నేత షర్మిల రాష్ట్రంలో పరామర్శ యాత్రలు చేస్తుంటే బొత్తిగా పట్టించుకోని తెరాస నేతలు, చంద్రబాబు నాయుడు పర్యటిస్తారంటే మాత్రం ఎందుకు కంగారు పడుతున్నారు? అని ప్రశ్నించుకొంటే కేవలం అభద్రతాభావం వల్లనేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ కి వచ్చినప్పుడు తన పార్టీ నేతలకు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొంటే ఈ అనుమానం నిజమనేననిపిస్తుంది. తెరాస పార్టీ కేవలం ఒకరిద్దరు నేతల వ్యక్తిగత బలంపైన, తెలంగాణా సెంటిమెంటుపైనే ప్రధానంగా ఆధారపడి నిలబడి ఉందని, ఆ పార్టీకి సరయిన పునాదులు లేవని ఆయన అన్నారు. ఒకవేళ గ్రామ స్థాయి నుండి తెరాస పార్టీని బలంగా నిర్మించుకొని ఉంటే, కేసీఆర్ ఈవిధంగా ఇతర పార్టీలను చూసి అభద్రతాభావానికి గురి అవనవసరం లేదు. ఇతర పార్టీల నేతలకు గాలం వేయవలసిన అవసరం అంతకంటే ఉండదు. ఇదంతా కేసీఆర్ కి తెలియదనుకోలేము. తెలిసినా ఆయన తన పంధాలోనే ముందుకు సాగుతున్నారంటే ఆయనలో అభద్రతాభావమే అందుకు కారణమని చెప్పవచ్చును.
ఆ కారణంగానే ఆయన అప్పుడప్పుడు హోమాలు, యాగాలు చేస్తుంటారు. ఆ కారణంగానే దేవుళ్ళకు మొక్కులు చెల్లించుకోవాలనుకొంటున్నారు. ఆ కారణంగానే ఆయన ఇప్పుడు మళ్ళీ వాస్తును ఆశ్రయిస్తున్నారు. మనసులో ఇన్ని భయాలు పెట్టుకొని పైకి మాత్రం నూటికి నూటొక్క మార్కులు నాకే అనుకొంటే దాని వలన తెరాసయే నష్టపోతుంది తప్ప ప్రతిపక్షాలు కాదు.