చంద్రబాబును ఇరుకునపెడుతున్నారా!
posted on Aug 10, 2015 3:03PM
రాష్ట్ర విభజన జరిగి ఏపీ రాష్ట్రం ఆర్ధికంగా వెనుకబడటంతో ఎలాగైనా దానిని అభివృద్ధి చేయాలనే ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు పార్టీ నేతలే తలనొప్పిగా తయారయ్యారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబుకు అండగా నిలిచి రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోవాల్సింది పోయి.. వారు చేసే వ్యాఖ్యలవల్ల చంద్రబాబును ఇరుకునపెడుతున్నారు. మొన్నటికి మొన్న గోదావరి పుష్కరాల వల్ల జరిగిన తొక్కిసలాటలో చాలా మంది ప్రాణాలు కోల్పారు. ఇదే అదనుచూసుకొని ప్రతిపక్షనేతలు అందుకు కారణం చంద్రబాబు అంటూ విమర్శల మీద విమర్శలు చేశారు. దీనిమీద నేషనల్ మీడియాలో చర్చ జరిగినప్పుడు పార్టీ నేతలు సరైన సమాధానం కూడా చెప్పలేక చెమటలు కక్కారు. దీంతో చంద్రబాబు నేతలమీద అసంతృప్తి చెంది ఇక నుండి ఆంగ్ల మీడియాతో మాట్లాడే బాధ్యతను గల్లా జయదేవ్ కు అప్పగించారు.
ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి కూడా అదే జరుగుతుంది. ఒకవైపు కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. దీంతో ఎప్పటినుండో ఆశలు పెట్టుకొని ఎదురుచూస్తున్న ఏపీ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినంత పనిచేసింది. అయితే కేంద్రం చెప్పినా కూడా చంద్రబాబు సహా పలువురు ప్రత్యేకహోదా గురించి మళ్లీ ప్రయత్నిస్తామని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేంతవరకూ పోరాడతామని.. ఎలాగైనా ప్రత్యేక హోదా సాధిస్తామని చెపుతుంటే అదే పార్టీ నేత అయిన జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా రాదు అని చెప్పడం.. రాయపాటి కూడా మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా గురించి ఇంకేం చేయాలి బట్టలు ఊడదీసుకొని తిరగాలా అనడం ఇవన్నీ పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలే. ఒకే పార్టీలో ఉండి పార్టీకి విరుద్ధంగా వారు చేసే వ్యాఖ్యలు అటు పార్టీనే కాదు.. చంద్రబాబును కూడా ఇరుకునపెడుతున్నాయి. తాము చేసే వ్యాఖ్యలు ప్రతిపక్ష పార్టీలకు ఆయుధాలుగా మారుతాయి అన్న ఆలోచన కూడా లేకుండా వారు మాట్లాడటం గమనార్హం. కాబట్టి ఇప్పటికైనా తెదేపా నేతలందరూ ఒకే మాట మీద ఉండి ప్రత్యేక హోదా సాధించుకుంటే మంచిది. లేకపోతే ఇలాంటి విరుద్దమైన వ్యాఖ్యలవల్ల ఇతర పార్టీలు రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది.