కేసీఆర్ కి జానా సవాలు విసిరారు సరే కానీ...
posted on Nov 26, 2015 7:09PM
.jpg)
కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఒక సవాలు విసిరారు. కేసీఆర్ చెపుతున్నట్లుగా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో పంటలకు వచ్చే ఏడాది నుండి వరుసగా మూడేళ్ళపాటు నీళ్ళు ఇచ్చినట్లయితే తను స్వయంగా తెరాస ప్రభుత్వ గొప్పదనం గురించి ఊరూరు తిరిగి ప్రచారం చేస్తానని అన్నారు. మూడేళ్ళు కాదు...వచ్చే ఐదేళ్ళలో అయినా పంటలకు నీళ్ళు ఇవ్వగలమని ఏదయినా ఒక అంతర్జాతీయ సంస్థతో చెప్పించినా తను మాటకి కట్టుబడి తెరాస కార్యకర్తలా తెరాస తరపున ప్రచారం చేయడానికి సిద్దమని జానారెడ్డి అన్నారు.
జానారెడ్డి తెరాసకు చాలా గొప్ప సవాలే విసిరానని ఆయన భావిస్తుండవచ్చును. కానీ గత పదేళ్లుగా సమైక్య రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణాలో ఆ మూడు జిల్లాలలో సాగునీటి సౌకర్యం కల్పించడానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వలననే ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించినదని ఆయనే స్వయంగా చాటి చెప్పుకొన్నట్లయింది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత కష్టపడినా మరో ఐదేళ్ళ వరకు ఆ మూడు జిల్లాలలో పంటలకు నీళ్ళు అందించడం సాధ్యం కాదని ఆయన అంత ఖచ్చితం చెపుతున్నారంటే ఆ మూడు జిల్లాలలో వ్యవసాయ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం అవుతోంది.
దానికి కాంగ్రెస్ ప్రభుత్వం అందులో పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన జానారెడ్డి కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. ఆ మూడు జిల్లాలలో పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయని తెలిసి ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ సమస్యను పరిష్కరించేందుకు ఎటువంటి ప్రయత్నం చేయనప్పటికీ, ఇప్పుడు తెరాస ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంటే, జానారెడ్డి దానికి సహకరించవలసింది పోయి ఈవిధంగా సవాళ్ళు విసరడం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. కానీ తెరాస పార్టీలో చేరాలని ఆయన చాలా కాలంగా తహతహలాడుతున్నారు కనుక కేసీఆర్ పట్టుదల గురించి బాగా తెలిసిన ఆయన ఈ విధంగానయినా తెరాసలో చేరాలని ప్రయత్నిస్తున్నారేమో? అనే అనుమానం కలుగుతోంది.