బాబు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు.. అందుకే కోడెల ఇలా.. వైసిపి ఫైర్
posted on Sep 17, 2019 2:15PM
టీడీపీ సీనియర్ నేత, ఎపి మాజీ స్పీకర్ కోడెల నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే కోడెల ఆత్మహత్యకు జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాబు చేస్తున్న విమర్శల పై ఎపి ప్రభుత్వ చీఫ్ విఫ్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అడ్డగోలుగా వైసీపీపై బురద చల్లుతున్నారని, అసలు బాబుకు సేవ చేసే గుణం ఉందా? అని ఘాటుగా ప్రశ్నించారు. చంద్రబాబు బతికున్నవాళ్లను హింసిస్తారనీ, చనిపోయాక మాత్రం శవరాజకీయం చేస్తారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఇప్పుడు కోడెల మరణం తరువాత చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీకాంత్ఆ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తనను ఎలా వేధించాడో అయన మామగారైన ఎన్టీఆరే స్వయంగా చెప్పారని ఈ సందర్బంగా గుర్తుచేశారు. టీడీపీ నేత హరికృష్ణ చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు శవరాజకీయం చేశారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. గత మూడు నెలలుగా కోడెల చంద్రబాబు అపాయింట్మెంట్ కోరినప్పటికీ ఎందుకు ఇవ్వలేదని శ్రీకాంత్ రెడ్డి బాబును ప్రశ్నించారు. రెండు వారాల క్రితమే కోడెల నిద్రమాత్రలు మింగినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారనీ, మరి ఆ సమయంలోనైనా చంద్రబాబు ఆయన్ను పరామర్శించారా? అని ప్రశ్నించారు. అంతే కాకుండా సత్తెనపల్లిలో కోడెల వ్యతిరేక వర్గాన్ని టీడీపీ అధినేత ప్రోత్సహించారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయం కోడెలను మానసికంగా ఇబ్బంది పెట్టిందని, అలాగే 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కోడెల క్యారెక్టర్ ను కించపర్చింది చంద్రబాబేనని దుయ్యబట్టారు. వైఎస్ రాజారెడ్డి, నారాయణరెడ్డిలను చంపిన హంతకులను ఇంట్లో పెట్టుకున్న చరిత్ర కూడా చంద్రబాబుదేనని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.