శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు
posted on Feb 10, 2025 11:13AM

ఈ ఏడాది శ్రీశైలం బ్రహ్మోత్సవాలలో శ్రీ భమరాంబికా సమేత మల్లి కార్జున స్వామి వారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఈ నెల 19న మొదలై మార్చి 1న ముగుస్తాయి. అత్యంత వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. ఆ సందర్భంగా స్వామి, వారికి, అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మామూలుగా అయితే శ్రీ భ్రమరాంబికా సమేత మళ్లికార్జున స్వామి వారికి బ్రహ్మెత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఎవరైనా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది మాత్రం స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించనుండటం విశేషం.
కాగా మహా శివరాత్రి ఏర్పాట్ల పరిశీలనుకు రాష్ట్ర మంత్రుల బృందం సోమవారం(ఫిబ్రవరి 10) శ్రీశైలంలో పర్యటించింది. మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్ లు ఈ మంత్రుల బృందంలో ఉన్నారు. శ్రీశైలం ను ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు స్వయంగా హాజరై పట్టు వస్త్రాలు సమర్పించాలని నిర్ణయించుకున్నారు. ఇక శ్రీశైలంలో అభివృద్ధి కార్యక్రమాలు, పర్యాటకులు, భక్తులకు వసతులు మెరుగుపరిచేందుకు దశలవారీగా చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.