తాజ్ మహల్ శివుడి గుడి.. హిందూ గర్ల్ ని టచ్ చేస్తే ఫసక్!!
posted on Jan 28, 2019 1:50PM
ఒకప్పుడు.. కులాలు, మతాలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేయడమే రాజకీయం అన్నట్లు ఉండేది. కానిప్పుడు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు రాజేసేదే రాజకీయం అన్నట్లు తయారైంది. దానికి కారణం కొందరి నేతల తీరు. అలాంటి నేతల్లో కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఒకరు. కర్ణాటకలోని కొడుగు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో అనంత్ కుమార్ హెగ్డే మాట్లాడుతూ.. మనం మన సమాజంలో మతం గురించి ఆలోచించాలి, జాతి గురించి ఆలోచించాలని అన్నారు. సమాజంలో ఇతర మతస్తులు ఒక హిందూ యువతిని లేదా మహిళను టచ్ చేస్తే ఆ చెయ్యిని ఏం చెయ్యాలో మాకు బాగా తెలుసు అంటూ అనంత్ కుమార్ హెగ్డే ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు.
అంతటితో ఆగితే ఆయన అనంత్ కుమార్ హెగ్డే ఎందుకవుతారు. పనిలోపనిగా తాజ్ మహల్ గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. తాజ్ మహల్ ను కట్టింది ముస్లీంలు కాదని, ఈ విషయం చరిత్ర చెబుతోందని ఆరోపించారు. షాజహన్ తన ఆత్మకథలో తాజ్ మహల్ ను తాను రాజా జయసింహా నుంచి తీసుకున్నానని రాసుకున్నారని అనంత్ కుమార్ చెప్పారు. తాజ్ మహల్ రాజా పరమతీర్థ నిర్మించిన శివుడి దేవాలయం అని, తేజో మహల్ అని అనంత్ కుమార్ అన్నారు. తేజో మహల్ నేడు తాజ్ మహల్ అయ్యిందని వ్యాఖ్యానించారు. మరి మంత్రి గారి వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతాయో ఏంటో చూడాలి.