60 వేల కోట్ల రూపాయ‌ల‌తో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు!

ఒకప్పుడు మూసీ నీరు.. సాగు, తాగు, పాడి, మత్స్య అవసరాలకు ఉపయోగపడేది. దాంతో హైదరాబాద్ సహా ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రయోజనం కలిగేది. అంత గొప్ప చరిత్ర కల్గిన మూసీ, నేడు కాలుష్యమయంగా మారి దుర్గంధం వెదజల్లుతోంది.  దేశంలోనే అత్యంత కాలుష్య నదుల్లో ఒకటిగా  మారింది.  మూసీని ప్రక్షాళన చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలోనే పుట్టి, తెలంగాణలోనే ప్రవహించి, తెలంగాణలోనే ముగుస్తున్న మూసీని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప‌ర్యావ‌ర‌ణ వేత్తలు ప‌దే ప‌దే గుర్తు చేస్తున్నారు.  

హైదరాబాద్ లో డెవలప్ మెంట్ పేరుతో చేస్తున్న విధ్వంసమే ఈ పరిస్థితికి కారణమని ప‌ర్యావ‌ర‌ణ వేత్త వేత్త డా. లుబ్నా సార్వత్  ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  మూసీ నదికి ఉన్న బోలెడు ఇన్ లెట్స్ ద్వారా కలుషిత నీళ్లు కలుస్తున్నాయి. హుస్సేన్ సాగర్ నుంచి మూసాపేట వరకు చాలా చోట్ల నుంచి వచ్చే వ్యర్థ జలాలు మూసీలో కలుస్తున్నాయి.  జీహెచ్ఎంసీ పరిధి దాదాపు 650 చదరపు కిలోమీటర్లు ఉండగా.. హుస్సేన్ సాగర్ క్యాచ్ మెంట్ ఏరియానే 267 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇలా నగరంలోని పలు చోట్ల నుంచి వ్యర్థాలు, కలుషిత నీళ్లు వివిధ ఇన్ లెట్ల ద్వారా మూసీలో కలుస్తున్నాయి.  హైటెక్ సిటీ నుంచి వచ్చే మురుగు నీరు కూడా మూసీలో కలుస్తుంది. 

వర్షపు నీటిని తీసుకెళ్లాల్సిన చానళ్లన్నీ మురుగు నీరు, వ్యర్థాలను తీసుకుని చెరువుల్లో కలుస్తున్నాయి. అక్కడ నుంచి అవన్నీ మూసీలో చేరుతున్నాయి. ఎక్కడ వస్తున్న వ్యర్థాలు, మురుగు నీటిని అక్కడికక్కడ సమర్థంగా నిర్వహించడమే దీనికి ఏకైక పరిష్కారమని ప‌ర్యావ‌ర‌ణ వేత్త వేత్త డా. లుబ్నా సార్వత్ చెబుతున్నారు. 

మూసీలోకి నీటిని తీసుకొచ్చే మార్గాలెన్ని ఉన్నాయి? నీటి నిల్వకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మూసీ ఫ్లడ్‌ లెవల్‌ ఎంతుంది? వరద ప్రభావిత ప్రాంతాలెన్ని?’’.  మూసీ అభివృద్ధికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఎంత భూమి అవసరం అవుతుంది? పరిహారం చెల్లించాల్సి వచ్చే నివాస ప్రాంతాలెన్ని ఉన్నాయి? అనే అంశాల‌పై రేవంత్ ప్ర‌భుత్వం స్ట‌డీ చేస్తోంది. మూసీ ప్రక్షాళనతోపాటు.. తొలి దశ అభివృద్ధి పనులకు సుమారు రూ.10 వేల కోట్ల బడ్జెట్‌ అవసరం అవుతుందనే ప్రాథమిక అంచనాలను అధికారులు సీఎం ముందు పెట్టారు. 

మొత్తం 60 వేల కోట్ల రూపాయ‌ల‌తో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును మొదలుపెట్టడానికి రేవంత్ స‌ర్కార్ సిద్ధమవుతోంది.  ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే మూసీలో ప్రతిరోజూ నీటి ప్రవాహం ఉండాలి. అందు కోసం గజ్వేల్  నియోజకవర్గంలోని  కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా 15 టీఎంసీల తాగునీటిని హైదరాబాద్​కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో 10 టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకు సంపూర్ణంగా తీర్చడంతోపాటు , 5 టీఎంసీల నీటిని మురికికూపంగా మారిన మూసీనది ప్రక్షాళనకు ఉపయోగించబోతున్నారు., దానికి 4 వేల కోట్లకు పైగా వ్యయమయ్యే ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేశారు. దీనికి హడ్కో  దాదాపు ఆమోద ముద్ర వేయబోతుందని పురపాలక అధికారులు చెబుతున్నారు. ఏడాదిన్నరలో ప్రాజెక్టును పూర్తిచేయాలన్నది జలమండలి లక్ష్యమని అధికారులు తెలిపారు.

మూసీ నది అనంతగిరి వికారాబాద్ పర్వతాల్లో పుట్టింది.  హైదరాబాద్​ నగరం గుండా ప్రవహిస్తూ వాడేపల్లి మిర్యాలగూడ వద్ద కృష్ణాలో కలుస్తున్నది. హైదరాబాద్ లో 1908 సెప్టెంబర్ 28 న వచ్చిన పెద్ద వరద కారణంగా దాదాపు 15,000 మంది చనిపోయారు. 80,000 మంది నిరాశ్రయులయ్యారు. అప్పట్లో దీన్ని ఒక పెద్ద విపత్తుగా పరిగణించారు.   ప్రముఖ ఇంజినీరు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి నైజాం కోరిక మేరకు వరద బాధల నుంచి తప్పించాలని ఆనాడు మూసీనదిపై గండిపేట వద్ద ఉస్మాన్ సాగర్​ రిజర్వాయరును 1920లో,  మూసీ నది ఉపనది అయిన ఈసీ నదిపై హిమాయత్ సాగర్​ 1927 రిజర్వాయర్ ను,  రెండు జలాశయాలను నిర్మించి హైదరాబాద్  ప్రజలకు  తాగునీటి,  మురుగు నీరు వ్యవస్థను ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం కనుగొన్నారు. 
 
1997లో  నందనవనం పేరుతో మూసీ సుందరీకరణ కోసం ఉమ్మడి ఏపీ  ప్రభుత్వ కాలంలో..  కులీ కుతుబ్​షా అర్బన్ డెవలప్​మెంట్​అథారిటీ ఒక పథకం రూపొందించింది.  అనంతరం  వాటరు బోర్డు  అబెట్​మెంట్​ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ మూసీ రివర్  పేరుతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో  రూ. 405 కోట్లు నిధులు  ఖర్చు చేశారు . కాలుష్య నియంత్రణకు గ్రేటర్​ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్  రూ .50 కోట్లతో రబ్బరు డ్యామ్ నిర్మించారు. కానీ, నిరుపయోగమైనది.   మూసీ యథావిధిగా దుర్వాసన కలుషితమైన నీరుతోనే కనబడుతున్నది. కలుషితమైన నీటితో పండించిన వ్యవసాయోత్పత్తులు కూడా పూర్తిగా రసాయనాలతో కూడి ఉన్నాయని ఒక స్టడీలో ఉస్మానియా యూనివర్సిటీ తెలిపింది.  పలు సంస్థలు, ఎన్ జీఆర్ఐ శాస్త్రవేత్తలు చేసిన పరీక్షలో  మూసీ పరీవాహకం భూగర్భ జలాలు కాలుష్యంతో నిండిపోయినట్లు తేలింది. 

- ఎం.కె. ఫ‌జ‌ల్‌