ఏలూరులో దూసుకుపోతున్న కూటమి!

ఏలూరు లోక్ సభ నియోజకవర్గంలోనూ, ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ తెలుగుదేశం కూటమి దూసుకుపోతున్నది. ఏలూరు లోక్ సభ స్థానంతో పాటు ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మంట్లన్నిటిలోనూ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అధికార వైసీపీ నుంచి ఎదురౌతున్న సవాళ్లు, విమర్శల ప్రభావం ఇసుమంతైనా కూటమి అభ్యర్థులపై కనిపించడం లేదు. ఏలూరు లోక్ సభ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి పుట్టా మహేక్ కుమార్ యాదవ్ తన నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కూడా విస్తృతంగా పర్యటిస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. 

 తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఏలూరు లోక్ సభ, దాని పరిధిలోని అసెంబ్లీ స్దానాలపై ప్రత్యేక దృష్టి సారించారు. లోక్ సభ స్థానంతో పాటు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలలోనూ కూటమి అభ్యర్థులే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కూటమి శ్రేణుల్లో విశ్వాసం నింపడమే కాకుండా, అసెంబ్లీ నియోజకవర్గాలలో అక్కడక్కడా తలెత్తిన అసమ్మతిని కూడా బుజ్జగించి కూటమి అభ్యర్థుల విజయం కోసం సమష్టిగా పని చేసేలా దిశానిర్దేశం చేశారు.  

ఏలూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని నూజువీడు అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం మాజీ కన్వీనర్ ముద్రబోయిన వెంకటేశ్వరరావు అసమ్మతి రాగం ఆలపించారు. అయితే వెంటనే ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు, తెలుగుదేశం ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు వెంటనే రంగంలోకి దిగారు. ముద్రబోయనను సముదాయించి, కూటమి అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొనేందుకు ఒప్పించారు. అలాగే దెందులూరు నుంచి తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ను నిలబెట్టే విషయంలో తెలుగుదేశం అధినేత వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరు ఆ నియోజకవర్గంలో చింతమనేని విజయాన్ని ఇప్పటికే ఖరారు చేసింది. అలాగే పొత్తులో భాగంగా ఏలూరు లోక్ సభ పరిధిలోని   పోలవరం, ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గాలలో పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాకే కైకలూరు నియోజకవర్గం బీజేపీకి కేటాయించారు.

ఈ మూడు నియోజకవర్గాలలోనూ కూడా కూటమి శ్రేణులు ఐక్యంగా కదం తొక్కుతున్నారు. మొత్తం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం జోరు స్పష్టంగా కనిపిస్తుంటే. అధికార వైసీపీలో మాత్రం జోష్ కానరావడం లేదు.