అనిల్ సిన్హా సీబీఐ ప్రతిష్టను పునరుద్ధరిస్తారా?
posted on Dec 3, 2014 7:02AM
.jpg)
సీబీఐ సంస్థకే మచ్చ తెచ్చిన దాని డైరెక్టర్ రంజిత్ సిన్హా పదవీ కాలం ముగియడంతో ఆయన నిన్న పదవీ విరమణ చేసారు. ప్రధాని నరేంద్ర మోడీ, లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లిఖార్జున్ ఖార్గే మరియు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హెచ్. యల్. దత్తులతో కూడిన అపాయింట్ మెంట్స్ కమిటీ నిన్న డిల్లీలో సమావేశమయ్యి, 1979 బీహార్ ఐ.పి.యస్ క్యాడర్ కు చెందిన అనిల్ కుమార్ సిన్హాను సీబీఐ డైరెక్టర్ గా నియమించింది. ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తారు.
ఆయన సీబీఐలో చేరక మునుపు బీహార్ రాష్ట్రంలో ఏ.డి.జి. (లా అండ్ ఆర్డర్) మరియు అదే హోదాలో విజిలన్స్ శాఖలలో పనిచేసారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2000సం.లో విశిష్ట సేవా పతకం, 2006 సం.లో రాష్ట్రపతి చేతుల మీదుగా పొలీస్ పతకం అందుకొన్నారు. ఆ తరువాత కేంద్రంలో విజిలన్స్ శాఖలో అదనపు కార్యదర్శిగా సేవలందించారు. మే, 2013సం.లో ఆయన సీబీఐలో చేరి అనేక కీలకమయిన కేసులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు సీబీఐ పగ్గాలు పూర్తిగా ఆయన చేతికే వచ్చాయి.
ఇదివరకు సీబీఐ డైరెక్టర్ గా పనిచేసిన రంజిత్ సిన్హా యూపీఏ ప్రభుత్వం చేతిలో పావుగా మారి అనేక కేసులను నీరుగార్చే ప్రయత్నం చేసినందుకు సుప్రీంకోర్టు చేత అనేక సార్లు మొట్టికాయలు తిన్నసంగతి అందరికీ తెలుసు. సాధారణంగా అటువంటి కీలక పదవులలో పనిచేసిన వారెవరయినా పదవీ విరమణ చేస్తున్నప్పుడు, తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించినందుకు తృప్తిగా ఉందని చెప్పుకోవడం అందరూ వింటారు. కానీ ఆయన మాత్రం తన బాధ్యతలను సమర్ధంగా నిర్వహించలేకపోయానని చెప్పుకోవలసి రావడమే, ఆయన పనితీరుకు అద్దం పడుతోంది.
ఇప్పుడు ఆయన స్థానంలో బాధ్యతలు చేప్పట్టబోతున్న అనిల్ కుమార్ సిన్హా కూడా బీహార్ రాష్ట్రానికి చెందిన వారే. కనుక సహజంగానే అందరూ ఆయన పనితీరు ఏవిధంగా ఉండబోతోందనే ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కనీసం ఆయనైనా రంజిత్ సిన్హా హయంలో మసకబారిన సీబీఐ ప్రతిష్టను పునరుద్దరించగలుగుతారో లేదో కాలమే చెపుతుంది.