నల్లొండలో బీఆర్ఎస్ కార్యాలయం కూల్చివేతకు హైకోర్టు ఆదేశాలు
posted on Sep 18, 2024 2:53PM
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నల్గొండలోని ఆ పార్టీ కార్యాలయాన్ని పక్షం రోజుల్లో కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతే కాకుండా అక్రమంగా ఎలాంటి అనుమతులూ లేకుండా భవనాన్ని నిర్మించిన బీఆర్ఎస్ పార్టీకి లక్ష రూపాయలు జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
అధికారంలో ఉండగా ఎలాంటి అనుమతులూ లేకుండా బీఆర్ఎస్ పార్టీ నల్లొండలో కార్యాలయాన్ని నిర్మించింది. బీఆర్ఎస్ అధికారంలో కొనసాగినంత కాలం అనుమతులు లేని నిర్మాణం అంటూ అభ్యంతరం చెప్పే సాహసం కూడా చేయలేకపోయారు. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తరువాత అనుమతులు లేని నిర్మాణాన్ని కూల్చివేయాలని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మునిసిపల్ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. అయితే మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గట్టిగా అడ్డుపడ్డారు. ఎవరైనా కార్యాలయం జోలికి వస్తే అంతు చూస్తానంటూ బెదరించారు. దీంతో భవనం కూల్చివేత విషయంలో అధికారులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు.
ఈ తరుణంలో నల్లొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి అనుమతులు లేని కారణంగా దానిని డిమాలిష్ చేయాలని డీటీపీసీ ఆదేశాలు జారీ చేయడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. భవనాన్ని కూల్చకుండా రెగ్యులరైజ్ చేయాలని మునిసిపల్ అధికారులను ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు అనుమతులు లేకుండా భవన నిర్మాణం ఎలా చేశారని సూటిగా ప్రశ్నించి, ఇప్పుడు రెగ్యులరైజ్ చేయమనడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నల్గొండలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది. అంతే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి అక్రమంగా నిర్మాణం చేసినందుకు లక్ష రూపాయలు జరిమానా విధించింది.