బీఆర్ఎస్ బీజేపీ జుగల్ బందీ.. కాంగ్రెస్ ఆరోపణలు నిజమేనా?

ఇప్పుడనేమిటి? గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచీ కూడా బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఏదో రహస్య బంధం ఉందన్న ఆరోపణలు, అనుమానాలూ వ్యక్తం అవుతూనే ఉన్నాయి. అసలు ఆ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీలు పరాజయం పాలై, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తెరవెనుక ఈ రెండు పార్టీల సంబంధాలే కారణమని కూడా అంటారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా నిలువరించడానికే.. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని జనం భావించేలా రెండు పార్టీలూ బయటకు విమర్శల యుద్ధం చేసుకుని అంతర్గతంగా మాత్రం పరస్పర సహకారం అందించుకున్నారని కాంగ్రెస్ అప్పట్లో విమర్శించిన సంగతి తెలిసిందే.

నిజానిజాల సంగతి పక్కన పెడితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రాపంకం కోసం పాకులాడుతోందని కాంగ్రెస్ తాజాగా విమర్శలు గుప్పిస్తోంది. అందుకే అయిపోయిన పెళ్లికి బాజాలు అన్నట్లుగా ఎప్పుడో రెండు నెలల కిందటే బీఆర్ఎస్ విమర్శలు గుప్పించి, ఆందోళనలు చేసి.. వాటిలో పస లేదని గ్రహించి వదిలేసిన అమృత్ పథకంపై ఆరోపణలకు మళ్లీ దుమ్ము దులిపి కేంద్రానికి ఫిర్యాదు చేసిందని కాంగ్రెస్ ఎద్దేవా చేస్తోంది. ఫిర్యాదు మిషతో హస్తిన వెళ్లి అక్కడ కేంద్ర పెద్దలను మంచి చేసుకుని ఫార్ములా ఇ రేస్ కేసు నుంచి బయటపడాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తోంది.

అమృత్ టెండర్లపై కేటీఆర్ గతంలోనే ఆరోపనలు గుప్పించారు. విచారణ జరిపించాలని బీజేపీకి సవాల్ విసిరారు. ఏ ప్రయోజనం లేక ఆ అంశాన్ని మూలన పడేశారు. ఇప్పుడు హఠాత్తుగా కేటీఆర్ నాడు చేసిన ఆరోపణలను మళ్లీ ఫిర్యాదు రూపంలో చేస్తాను అప్పాయింట్ మెంట్ ఇవ్వండి అని అడిగీ అడగకుండానే కేంద్ర మంత్రి అప్పాయింట్ మెంట్ ఇచ్చేశారు. వచ్చి ఫిర్యాదు చేసుకోండి అంటూ రెడ్ కార్పెట్ పరిచారు. దీంతో కేంద్ర మంత్రితో భేటీ అయి ఫిర్యాదు చేసిన కేటీఆర్ హస్తినలోనే మీడియా సమావేశం పెట్టారు. సహజంగానే కాంగ్రెస్ పార్టీపైనా, రేవంత్ సర్కార్ పైనా విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ హైకమాండ్ కు తెలంగాణ రాష్ట్రం ఏటీఎమ్ గా మారిందని ప్రధాని మోడీ ఆరోపణలనే వల్లె వెశారు. 

కేటీఆర్ ఆరోపణలపై కాంగ్రెస్ కూడా దీటుగానే స్పందించింది. కేటీఆర్ హస్తిన వెళ్లి ఫిర్యాదు చేయడం అన్నది బీజేపీ ప్లాన్ ప్రకారమే జరిగిందని ఎదురుదాడికి దిగింది. మహా రాష్ట్ర ఎన్నికలలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న బీజేపీ.. కాంగ్రెస్ పై ఆరోపణలు గుప్పించినా ఫలితం లేకపోవడంతో బీఆర్ఎస్ ను ఆశ్రయించిందని అంటున్నారు. మహా ఎన్నికలలో తమకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ పార్టీ హైకమాండ్ కనుసన్నలలో నడుస్తాయనీ, రాష్ట్ర ప్రయోజనాల కంటే హైకమాండ్ పెద్దల మొప్పు కోసమే పని చేస్తాయనేలా విమర్శలు గుప్పిస్తే మహారాష్ట్రలో కాంగ్రెస్ కు ప్రస్తుతం కనిపిస్తున్న పాజిటివ్ వైబ్ తగ్గుతుందని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది.

అందుకే కేటీఆర్ ను హస్తినకు రప్పించుకుని మరీ అమృత్ టెండర్లపై ఫిర్యాదు స్వీకరించిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. క్విడ్ ప్రోకో చందంగా కేటీఆర్ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తే, ఆరోపణలు గుప్పిస్తే ఫార్ములా ఈ రేస్ కేసు నుంచి ఆయనను బయటపడేస్తామని బీజేపీ పెద్దలు బేరాలాడుతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కేసీఆర్ ను విచారించడానికి అనుమతి ఇవ్వడంలో జాప్యం చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతోంది.  మొత్తం మీద బీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య స్నేహంపై అనుమానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.