జగన్ బెయిలు రద్దు.. సీబీఐ స్టాండ్ మారిందా?

జగన్ బెయిలు రద్దు పిటిష్ విషయంలో సీబీఐ తన స్టాండ్ మార్చుకుంటుందా? అలా మార్చుకుంటే జగన్ జైలుకు వెళ్లక తప్పదా అంటే పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్ బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఆ రోజు విచారణ జరిగింది. రఘురామకృష్ణం రాజు సుప్రీంలో రెండు పిటిషన్లు దాఖలు చేశారు.

ఒకటి జగన్ బెయిలు రద్దు చేయాలన్నది కాగా, రెండోది జగన్ అక్రమాస్తుల కేసు విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలని. ఈ కేసుల విచారణ నుంచి జస్టిస్ సంజీవ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అంటూ వైదొలిగారు. దీంతో కేసు విచారణ వాయిదా పడింది. ఈ కేసు మరో బెంచ్ ముందు డిసెంబర్ 2న విచారణకు రానుంది.  అయితే ఆసక్తికర పరిణామమేంటంటే.. సీబీఐ తరఫున ఈ కేసులో వాదనలు వినిపించాల్సిన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెయిలు రద్దు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం అడిగారు. అలా అడగడమే సీబీఐ జగన్ బెయిలు రద్దు విషయంలో ఇంత వరకూ మెయిన్ టైన్ చేస్తూ వస్తున్న స్టాండ్ ను మార్చుకుంటుందా అన్న అనుమానాలకు తావిస్తోంది. 

ఎందుకంటే జగన్ సీఎంగా ఉన్నంత కాలం ఆయన బెయిలు విషయంలో సీబీఐ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు.   అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. జగన్ సీఎం కాదు. కేవలం పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే మాత్రమే. దీంతో ఇప్పటి వరకూ జగన్ బెయిలు విషయంలో అభ్యంతరాలు చెప్పని సీబీఐ ఇప్పుడు వైఖరి మార్చుకుని ఆయన బెయిలు రద్దు కోరే అవకాశం ఉంది. అలా కాకపోతే కనీసం కేసు రోజువారీ విచారణ కోరే అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఏది జరిగినా జగన్ ఇబ్బందుల్లో పడక తప్పదు.  

గతంలో జగన్ బెయిలు విషయంలో సీబీఐ ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన దేశం విడిచి పారిపోరన్న గ్యారంటీ , బెయిలు షరతులు ఉల్లంఘించరన్న నమ్మకం ఉండేది. అయితే జగన్ ఇప్పుడు అధికారంలో లేరు. అందుకే మారిన పరిస్థితుల్లో సీబీఐ కూడా తన స్టాన్స్ మార్చుకునే అవకాశం ఉంది. అందుకే జగన్ కు ఇబ్బందులు తప్పవన్న భావన న్యాయవర్గాలలో ఎదురౌతోంది. జగన్ బెయిలు రద్దైనా, కేసుల విచారణను రోజువారీ చేపట్టాలని నిర్ణయించినా జగన్ జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడినట్లేనని పరిశీలకులు అంటున్నారు.