బొత్స బిగ్ గేమ్‌.. జ‌గ‌న్ అనుమాన‌మే నిజ‌మౌతోందా?

ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి  ఎవ‌రు ఎప్పుడు ఎలా గుడ్ బై చెబుతారో తెలియ‌ని ప‌రిస్థితి. రాత్రికి రాత్రే వైసీపీ నేత‌లు కూట‌మి పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. అయితే  తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ, శాసనమండలిలో ఆ పార్టీ పక్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా పార్టీ వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతున్నది.  వైసీపీలో బొత్స కీల‌క హోదాలో ఉన్న‌ప్ప‌టికీ రాబోయే కాలంలో పార్టీ మ‌నుగ‌డ క‌ష్టం అన్న భావనలో ఆయన ఉన్నారని వైసీపీ వర్గీయులే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో  వైసీపీలోనే కొనసాగుతూ ఇబ్బంది ప‌డ‌టంకం,  ఆ పార్టీకి గుడ్ బై చెప్ప‌డ‌మే మంచిద‌న్న ఆలోచ‌న‌కు బొత్స‌, ఆయ‌న వ‌ర్గీయులు వ‌చ్చిన‌ట్లు వైసీపీలోనే టాక్  న‌డుస్తోంది. అయితే  జ‌గ‌న్ రెడ్డికి ఈ విష‌యం ముందే తెలిసిందని కూడా అంటున్నారు. బొత్స స‌త్య‌నారాయ‌ణ జ‌న‌సేన ముఖ్య‌నేత‌ల‌తో ట‌చ్ లో ఉన్నారనీ, ఇటీవ‌లి కాలంలో ప‌లు సార్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ తోనూ ఫోన్లో  సంభాషించారనీ వైసీపీ నిఘావ‌ ర్గాలు జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే బొత్స పార్టీ వీడ‌కుండా జ‌గ‌న్ అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని అంటున్నారు. అయినా, తాజాగా.. బొత్స స‌త్య‌నారాయ‌ణ అసెంబ్లీ ప్రాంగ‌ణంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌ర‌చాల‌నం చేసి, ఆలింగ‌నం చేసుకోవ‌టంతో బొత్స నేడో రేపో వైసీపీకి గుడ్ బై చెప్పేయడం ఖాయమని వైసీపీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు.  

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు వైసీపీకి క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాకూడా ఇవ్వ‌లేదు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పాటు కేవ‌లం 11 మంది మాత్ర‌మే ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు. దీంతో అసెంబ్లీకి వెళ్లేందుకు జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో చంద్ర‌బాబును అసెంబ్లీలో వైసీపీ స‌భ్యులు దారుణంగా అవ‌మానించారు. చంద్ర‌బాబును దూషించిన ప్ర‌తీ సందర్భంలోనూ స‌భ‌లో నే ఉన్న అప్పటి ముఖ్యమంత్రి  జ‌గ‌న్ న‌వ్వుతూ క‌నిపించాడు. ఈ క్ర‌మంలో క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేకుండా స‌భ‌కు వెడితే  తెలుగుదేశం స‌భ్యులు త‌న‌ను అవ‌మానించ‌డం ఖాయ‌మ‌ని భావించి జ‌గ‌న్  అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. తనకు తోడుగా తన పార్టీకి చెందిన మిగిలిన ప‌ది మంది ఎమ్మెల్యేలనూ కూడా స‌భ‌కు వెళ్ల‌నీయకుండా అసెంబ్లీ స‌మావేశాల‌ను బాయ్ కాట్ చేస్తున్నట్లు   జ‌గ‌న్ ప్ర‌క‌టించాడు. మ‌రోవైపు శాస‌న మండ‌లిలో వైసీపీకి మెజార్టీ ఉంది. దీంతో శాస‌న మండ‌లికి వైసీపీ స‌భ్యులు హాజ‌ర‌వుతున్నారు. మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌గా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ ఉన్నారు. బొత్స మండ‌లిలో హూందాగా వ్య‌వ‌హ‌రిస్తూ మంత్రుల‌కు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ప‌లు సంద‌ర్భాల్లో మంత్రుల‌కు, బొత్స‌కు మ‌ధ్య మాట‌ల యుద్ధంకూడా జ‌రుగుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ హైలెట్ అవుతున్నారు. ఇలాంటి త‌రుణంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత ప‌త్రిక‌లో మొద‌టి పేజీలో బొత్స స్పీచ్ ను హైలెట్ చేస్తార‌ని వైసీపీ శ్రేణులేకాక‌.. ప్ర‌తీ ఒక్క‌రూ భావించారు. అలా భావించడం సహజం కూడా.  కానీ, జ‌గ‌న్ సొంత ప‌త్రిక‌లో శాస‌న మండ‌లిలో బొత్స ప్రసంగాన్ని, ఆయ‌న మంత్రుల‌ను ప్ర‌శ్నించిన తీరును మొద‌టి పేజీలో హైలెట్ చేయ‌కుండా లోప‌లి పేజీల్లో ప్ర‌చురిస్తుండటం పట్ల  వైసీపీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. ఈ విష‌యంలో  బొత్స కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు వైసీపీ వ‌ర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం. ఈ క్ర‌మంలో బొత్స స‌త్య‌నారాయ‌ణ అసెంబ్లీ ఆవ‌ర‌ణలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అభిమావాదం చేయ‌డం, వారిద్ద‌రూ ఆత్మీయంగా ఆలింగ‌నం చేసుకోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

వైసీపీ ఘోర ఓట‌మి త‌రువాత బొత్స స‌త్య‌నారాయ‌ణ జ‌న‌సేన పార్టీలోకి వెళ్తున్నార‌ని విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. ఆ ప్ర‌చారాన్ని బొత్స కూడా ఖండించ‌ లేదు. అప్ప‌టికే ఆయ‌న త‌మ్ముడు ల‌క్ష్మ‌ణ్ జ‌న‌సేన పార్టీలోకి వెళ్లాడు. అయిన‌ప్ప‌టికీ, బొత్స ఫ్యామిలీలో ఎలాంటి రాజ‌కీయ, ఆర్థిక‌ప‌ర‌మైన విబేధాలు రాలేదు. తమ్ముడు జ‌న‌సేన‌లో ఉంటున్నా బొత్స ఫ్యామిలీ క‌లిసే ఉంటున్నది. బొత్స డైరెక్ష‌న్ లోనే ల‌క్ష్మ‌ణ్ జ‌న‌సేన పార్టీలోకి వెళ్లార‌ని అప్ప‌ట్లో రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌రువాత కుటుంబ స‌భ్యులు వైసీపీని వీడి జ‌న‌సేన పార్టీలోకి వెళ్లాల‌ని బొత్స‌పై ఒత్తిడి తెచ్చార‌ని.. జ‌న‌సేన నేత‌లు సైతం ఆయ‌న‌కు ఆహ్వానాలు పంపించిన‌ట్లు కూడా టాక్ న‌డిచింది. సీనియ‌ర్ నేత‌, కాపు సామాజిక‌వ‌ర్గం పెద్ద‌గా భావించే బొత్స స‌త్య‌నారాయ‌ణ లాంటి వారు పార్టీని వీడితే ఇబ్బంది ఎదుర‌వుతుంద‌ని భావించిన జ‌గ‌న్ .. బొత్స‌ను విజ‌య‌న‌గ‌రం స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా బ‌రిలో నిలిపాడు. స్థానికంగా వైసీపీకి బ‌లం ఉండ‌టం, తెలుగుదేశం కూటమి ఆ ఎన్నికకు దూరంగా ఉండటంతో  బొత్స ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. అయితే, అంత‌కు ముందే లేళ్ల అప్పిరెడ్డిని మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ నియ‌మించారు. అధినేత నిర్ణ‌యంపై అప్పుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డంతో, అప్పిరెడ్డికి స‌ర్దిచెప్పి బొత్స‌ను మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ చేశార‌ని వైసీపీ వ‌ర్గీయుల్లో అప్ప‌ట్లో చ‌ర్చ జ‌రిగింది. దీనికితోడు బొత్స‌కు జ‌గ‌న్ ప్రాధాన్య‌త‌నిస్తూ పార్టీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించాడు. త‌ద్వారా బొత్స స‌త్య‌నారాయ‌ణ పార్టీ వీడ‌కుండా జ‌గ‌న్ జాగ్ర‌త్త‌ప‌డుతూ వ‌స్తున్నారు. 

బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు పార్టీలో పెద్ద‌పీట వేసిన‌ప్ప‌టికీ ఆయ‌న పార్టీ వీడతారన్న అనుమానం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలో ఏదో ఒక‌మూల  ఉంద‌ని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. పార్టీలో ఎవ‌రికీ ఇవ్వ‌ని ప్రాధాన్య‌త బొత్స‌కు ఇస్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న పార్టీ మారే ఆలోచ‌న‌లో ఉన్నారని తనకు అనుమానంగా ఉంద‌ని పార్టీ ముఖ్య‌నేత‌ల వ‌ద్ద జ‌గ‌న్ పేర్కొన్న‌ట్లు తెలిసింది. తాజాగా జ‌గ‌న్ అనుమానం నిజ‌మౌతందని వైసీపీ వర్గాలలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ప్రాంగ‌ణంలో బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒకరినొక‌రు ఆలింగ‌నం చేసుకున్నారు. ప‌వ‌న్ అసెంబ్లీ హాల్ లోప‌లి నుంచి బ‌యట‌కు వ‌చ్చే స‌మ‌యంలో అసెంబ్లీ ప్రాంగ‌ణంలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఇత‌ర వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను చూసి పెద్దిరెడ్డి, ఇత‌ర వైసీపీ నేత‌లు అక్క‌డి నుంచి ప‌క్క‌కు వెళ్లిపోయారు. బొత్స మాత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఎదురెళ్లి న‌మ‌స్కారం చేసి పలకరించారు. అక్కడితో ఆగకుండా  పవన్ ను అభినందించి, ఆయనను ఆత్మీయంగా హత్తుకున్నారు. ఇదే ఇప్పుడు జగన్ అనుమానం నిజం చేస్తూ బొత్స వైసీపీకి గుడ్ బై చెప్పేసి జనసేన కండువా కప్పుకుంటారన్న వాదనకు తెరలేపింది.

అయితే ఈ విషయంలో ఇప్పటి వరకూ జగన్ స్పందించలేదు.  ఇప్పటికిప్పుడు ఏమీ మాట్లాడకుండా, ఆ తరువాత నెమ్మది నమ్మదిగా బొత్సకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తూ ఆయనకు పొమ్మన లేక పొగపెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తారా అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా చర్చ జరుగుతోంది. అయితే బొత్స త్వరలో ఒక రాజకీయ నిర్ణం తీసుకుంటారనీ, ఆ నిర్ణయంతో జగన్ షాక్ అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.