లోకేశ్ తేల్చేశారు.. ఇక తగ్గేదేలే అంటున్న తెలుగుదేశం శ్రేణులు!
posted on Nov 23, 2024 11:32AM
జగన్ అధికారంలో కొనసాగిన ఐదేళ్లూ సోషల్ మీడియాలోనూ, మీడియా సమావేశాల్లోనూ ప్రత్యర్థి పార్టీ నేతలపై, ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్, ఆ పార్టీ నేతలు, అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అసభ్య, అనుచిత వ్యాఖ్యలతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ , వారి కుటుంబాల్లోని ఆడవారిపైనా ఇష్టమొచ్చినట్లుగా అసభ్య పోస్టులు పెట్టి రాక్షసానందం పొందారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అలాంటి వారిని ప్రోత్సహిస్తూ వచ్చారు. దీంతో గత ఐదేళ్లు వైసీపీ సోషల్ మీడియా బూతులకు కేంద్రంగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. గడిచిన ఐదేళ్లు, ప్రస్తుతం సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫొటోలతో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టి చట్టపరంగా శిక్షిస్తున్నారు. వీరిలో సినిమా ఇండస్ట్రీకి చెందిన శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మతో పాటు పోసాని కృష్ణమురళి మీడియా సమావేశాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను అసభ్యకర పదజాలంతో దూషిస్తూ అసత్య ఆరోపణలు చేశారు. దీంతో ప్రస్తుతం వీరి ముగ్గురిపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. వీరిలో రాంగోపాల్ వర్మ ఇప్పటికే పోలీసుల నుంచి నోటీసులు అందుకున్నారు.
శ్రీరెడ్డి, రాంగోపాల్ వర్మ, పోసాని మురళి కృష్ణలపై కేసులు నమోదు కావడంతో వారు భయంతో వణికి పోతున్నారు. వైసీపీ అధికారంలోఉన్న సమయంలో అడ్డూఅదుపు లేకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ పై ఇష్టానుసారంగా, వారి వ్యక్తత్వాన్ని హననం చేసే విధంగా విమర్శలు చేసి విర్రవీగిన వీరు ఇప్పుడు ఇప్పుడు కాళ్లబేరానికి వస్తున్నారు. ఇప్పటికే శ్రీరెడ్డి సారీ చెబుతూ లేఖ విడుదల చేశారు. నన్ను వదిలేయండి.. నేను ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు చేయను లోకేశ్ అన్నా అంటూ నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. తాను చేసింది తప్పేనని.. తనను క్షమించాలంటూ వేడుకున్నారు. మరోవైపు పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఇక నుండి తాను చనిపోయే వరకు రాజకీయాల గురించి మాట్లాడనని పేర్కొన్నారు. ఏ రాజకీయ నాయకుడి గురించీ మాట్లాడనని, చంద్రబాబు అంటే తనకు ఇష్టమని, లోకేశ్ పై గౌరవం ఉందనీ.. అవకాశం వస్తే పవన్ కల్యాణ్ సినిమాలో నటిస్తాననీ పోసాని మీడియా ముఖంగా ప్రకటించాడు. మరోవైపు రాంగోపాల్ వర్మకు పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని ఆదేశించారు. ఈనెల 19న ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉండగా డుమ్మాకొట్టాడు. అదేక్రమంలో పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని భయంగా ఉందంటూ యాంటిసిపేటరీ బెయిలు కోసం కోర్టును ఆశ్రయించాడు. ప్రస్తుతం కోర్టులో ఆయన బెయిలు పిటిషన్ విచారణ వాయిదా పడింది. మరోవైపు.. ఈనెల 19న విచారణకు హాజరుకాకపోవటంతో రెండో సారికూడా రాంగోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
రాంగోపాల్ వర్మ, శ్రీరెడ్డి, పోసాని కృష్ణ మురళి ముగ్గురు ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసుల నుంచి తప్పించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ వద్దకు తాము తప్పుచేశాము.. క్షమించండి అంటూ రాయబేరాలు కూడా నెరపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా నారా లోకేశ్ పేరును ప్రస్తావిస్తూ శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళిలు క్షమించమని కోరి కాళ్ల బారానికి వచ్చారు. ఈ క్రమంలో వారి కన్నీటికి లోకేశ్ ఎక్కడ కరిగిపోయి వదిలేస్తారోనని తెలుగుదేశం, జనసేన శ్రేణులలో ఆందోళన వ్యక్తం వ్యక్తమైంది. ఆ ముగ్గురిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని వారు లోకేశ్ ను కోరుతున్నారు. వారి డ్రామాలకు కరిగిపోవద్దని, కుక్క తోక వంకర అన్నట్లుగా వారి బుద్ధి మారదని లోకేశ్ గ్రహించాలని కోరుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీరెడ్డి, పోసాని కృష్ణ మురళి వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. గత ఐదేళ్లు తెలుగుదేశం శ్రేణులను పోలీసులు అక్రమ కేసులతో ఎంత వేధించినా కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారని, వైసీపీ అసభ్య పోస్టులపై ఇప్పుడు పోలీసులు చిన్న నోటీసులు ఇస్తున్నా ఆ పార్టీ నేతలు రాజకీయ సన్యాసం అంటున్నానీ పేర్కొన్న లోకేష్.. నాడు తెలుగుదేశం శ్రేణులు తప్పుచేయ లేదు కాబట్టే అక్రమ కేసుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ పోరాటం చేశారు. వైసీపీ శ్రేణులు తప్పుచేసి అడ్డంగా దొరికారు కాబట్టే సారీలు, రాజకీయ సన్యాసాలు అంటున్నారని లోకేశ్ పేర్కొన్నారు. అయితే, ప్రభుత్వం తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలదని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని లోకేశ్ స్పష్టం చేయడం ద్వారా ఎవరినీ వదిలేదే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.
ఈ సందర్భంగా ఆయన శ్రీరెడ్డి చెప్పిన సారీని, పోసాని కృష్ణమురళి రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ పేర్కొన్న వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించి, వారు తమను వదిలిపెట్టండి మహప్రభో అఅంటూ చేసిన విజ్ఞప్తులను ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోబోమని లోకేశ్ క్లారటీ ఇచ్చేశారని భావించవచ్చు. శ్రీరెడ్డి, పోసాని, రాంగోపాల్ వర్మ దాదాపు కాళ్లబేరానికి రావడంతో.. వారిని ఎక్కడ వదిలేస్తారోనని తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఒకింత గాభరాపడ్డాయి. లోకేశ్ తాజా క్లారిటీ తో .. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వేదికగా, మీడియా వేదికగా రెచ్చిపోయిన వారికి జైలు కూడు తప్పదన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.