పెద్దిరెడ్డికి అవమానం.. జగన్ నైజమే అంత అంటున్న వైసీపీయులు!

సీనియర్ నేత పెద్దిరెడ్డిని జగన్ రెడ్డి హ్యూమలేట్ చేశారు. ఆయన స్థాయికి అతి చిన్న పదవి అయిన పీఏసీ సభ్యుడి పదవికి పోటీ చేయమని చెప్పి ఆయన పత్తా లేకుండా పోయారు. కనీసం ఓటింగ్ కు కూడా రాలేదు. ఆయన రాలేదని మిగతా ఎమ్మెల్యేలు కూడా రాలేదు. పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే పదో వంతు సభ్యుల మద్దతు ఉండాలి. అంత బలం వైసీపీకి లేకనే జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష  నేతహోదా కూడా రాలేదు.

పీఏసీ సభ్యుడిగా ఎన్నికవ్వడానికి అవసరమైన బలం  వైసీపీకి లేదు.  అయినా జగన్ పెద్దిరెడ్డిని పోటీ చేయమన్నారు. కానీ ఓటింగ్ ప్రారంభం కాక ముందే తాము బాయ్ కాట్ చేస్తున్నట్లుగా వైసీపీ ప్రకటించింది. దీనికి కారణం ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఓటింగ్ కు రాకపోవడమే. స్వయంగా పార్టీ అధినేత జగన్ ఓటింగ్ కు రాకుండా అంసెబ్లీ ప్రారంభమయ్యే సమయానికి బెంగళూరు వెళ్లిపోయారు. దీంతో మరికొంత మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.

జగన్ ను నమ్మి ఆయనతో నడిచిన వారికి అవమానాలు ఎదురు కావడం సాధారణమే. అలా జగన్ పంచన చేరి అవమానాలకు గురైన వారిలో సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేదు. నమ్మిన బంట్లుగా పని చేసిన వారికి కూడా జగన్ పూచిక పుల్ల విలువ ఇవ్వరు. ఇప్పుడు అలా అవమాన భారంతో తలదించుకునే పరిస్థితి పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురైంది. అందలం ఎక్కిస్తున్నానంటూ చెప్పి చివరికి పాతాళంలోకి తొక్కేయడం జగన్ కు అలవాటేనన్న సంగతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో మరో సారికి రుజువైంది. 

ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత జగన్ కు, ఆయన పార్టీకీ అడుగడుగునా అడ్డంకులే ఎదురౌతున్నాయి. జగన్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులంతా కేసుల భయంతో వణికి పోతున్నారు. కొందరు అరెస్టై జైలులో ఉంటే, మరి కొందరు నోటీసులు అందుకుని పోలీసు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఇంకొందరు ఆచూకీ లేకుండా పరారీలో ఉన్నారు. ఇక పార్టీ నుంచి ఇప్పటికే ద్వితీయ శ్రేణి నేతలు బయటకు వెళ్లిపోయారు. తాజాగా సిట్టింగ్ ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసేశారు. ఇహనో ఇప్పుడో మీడియా ముందుకు వచ్చి తాను పార్టీ వీడడానికి కారణాలు చెప్పనున్నారు. ఓ వైపు పార్టీ ఖాళీ అవుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నా, జగన్ తన నైజాన్ని ఇసుమంతైనా మార్చుకోవడం లేదు. తాను భ్రమల్లో బతకడమే కాకుండా, తన పార్టీ నేతలు, శ్రేణులూ కూడా భ్రమల్లోనే బతకాలని శాసిస్తున్నారు. అంతే కాకుండా ఆ భ్రమలే నిజమని జనాన్ని నమ్మించడానికి తనను నమ్ముకుని వెంట నడుస్తున్న నేతలను నిలువునా ముంచేస్తున్నారు. 

తాజాగా అసెంబ్లీలో వైసీపీకి కనీస బలం లేకపోయినా, పీఏసీకి పోటీ పడ్డారు. కేబినెట్ హోదా ఉన్న పదవి అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అరచేతిలో వైకుంఠం చూపి నామినేషన్ దాఖలు చేయించారు. ఆ నామినేషన్ దాఖలు సమయంలోనూ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేత హై డ్రామా ఆడించారు. కనీస బలం లేని జగన్ తన పార్టీ తరఫున సీనియర్ నేతను నిలబెట్టి చివరి నిముషంలో ఓటింగ్ కు గైర్హాజరై హ్యాండిచ్చారు. ఓటింగ్ బహిష్కరణ ప్రకటన కంటే ముందే ఆయన బెంగళూరుకు చెక్కేశారు. దీంతో గత్యంతరం లేక నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పెద్దిరెడ్డిపై అన్న ఆరోపణల సంగతి పక్కన పెడితే ఆయన సీనియారిటీని కూడా ఖాతరు చేయకుండా జగన్ ఆయన పట్ల వ్యవహరించిన తీరు పట్ల వైసీపీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. నిజానికి  పీఏసీ ఛైర్మన్‌ పదవి పెద్దిరెడ్డి స్టేచర్ కు చాలా చాలా చిన్నది. అయితే ఆ చిన్న పదవినే ఎరగా చూపి జగన్ పెద్దిరెడ్డికి ఏదో పెద్ద ఫేవర్ చేస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారు. అంతా చేసి చివరకు అవమానించారు. జగన్ స్వయంగా ముఖం చాటేసి బెంగళూరు చెక్కేయడంతో పెద్దిరెడ్డి ఇక  అనివార్యంగా బహిష్కరణ ప్రకటన చేయాల్సి వచ్చింది.   పార్టీకి ఉన్న 18 ఓట్ల కంటే  కూడా పెద్దిరెడ్డికి తక్కువ ఓటు పడే పరిస్థితి ఉండటం కంటే అవమానం ఏముంటుంది? ఇప్పుడు ఉన్న 18 మంది ఎమ్మెల్యేలలో కొందరు ఇప్పటికే పార్టీకి, పార్టీ కార్యక్రమాలకే కాకుండా జగన్ కు కూడా దూరం జరిగారు.  ఇప్పుడు పెద్దిరెడ్డి ఎపిసోడ్ తో మరింత మంది ఎమ్మెల్యేలు జగన్ పై విశ్వాసం కోల్పోయి దూరం జరగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.