వైసీపీకి ఎమ్మెల్సీ జయమంగళం గుడ్ బై

వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ పార్టీకి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. పార్టీకీ, ఎమ్మెల్సీ పదవికీ కూడా రాజీనామా చేస్తూ తన రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు పంపారు. కైకలూరుకు చెందిన జయమంగళం వెంకటరమణ గత ఎన్నికలకు ముందు  తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్యెల్సీగా ఎన్నికయ్యారు.

ఆ తరువాత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో అప్పటి నుంచీ సైలెంటైపోయారు. వైసీపీ కార్యక్రమాలలో ఎక్కడా కనిపించలేదు. గత కొంత కాలంగా జయమంగళం వైసీపీకి రాజీనామా చేస్తారన్న వార్తలు వినవస్తున్నాయి. తాజాగా ఆ వార్తలు వాస్తవమేనని తేలుస్తు జయమంగళం వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేశారు. దాంతో పాటే తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. 

వాస్తవానికి ఎన్నికలలో ఓటమి తరువాత నుంచి వైసీపీ నేతలలో అసహనం, రాజకీయ భవిష్యత్ పట్ల ఆందోళన, జగన్ తీరు పట్ల, ఆయన ఏకపక్ష నిర్ణయాల పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఆ ప్రచారానికి బలం చేకూర్చే విధంగానే జయమంగళం రాజీనామా చేశారు. ముందు ముందు మరింత మంది వైసీసీ ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు జగన్ కు, వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.