ఏ సంస్కృతి నుంచి వెలసిన కమలాలు మీరు.. కేటీఆర్ పై బి.నరసింగరావు ఫైర్
posted on Jun 14, 2023 6:55AM
చీమలు పెట్టిన పుట్టల్లోకి పాములు చేరాయా? ఆ పాములే.. ఆ చీమలను నిర్ధాక్షణ్యంగా కాటేస్తున్నాయా?. పాము కాటున పడిన చీమలు.. చిక్కి శల్యమై తెరమరుగైపోగా.. మిగిలి ఉన్న చీమలు.. పాములు బుసలు కొడుతోన్న ఆహంకారాన్ని కలిసికట్టుగా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాయా? అనే ఓ చర్చ అయితే తెలంగాణ గడ్డపై ఇప్పుడిప్పుడే ఊపిరిలూదుకొంటోంది. అదీ కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. దశాబ్ది ఉత్సవాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్న వేళ... ఈ చర్చ ఊపందుకోవడాన్ని తెలంగాణ సమాజం ముక్త కంఠంతో స్వాగతిస్తోంది. చలిచీమల చేత చిక్కి అన్న సుమతీ శతకంలోని పద్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
తాజాగా తెలంగాణ పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌పై ప్రముఖ దర్శకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, జాతీయ, అంతర్జాతీయ సినిమా పురస్కార గ్రహీత బి. నర్సింగరావు నిప్పులు చెరుగుతూ రాసిన బహిరంగ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సదరు లేఖ.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడమే కాదు.. హాట్‌టాపిక్‌గా మారి.. తెలంగాణ సమాజంలో ప్రకంపనలు రేపుతోంది. అంతే కాదు సదరు బహిరంగ లేఖలో నర్సింగరావు.. చాలా పదునైన పదాలు వాడారు. అంటే... రాజ్యం ఏలుడు కాదు.. విజ్జత ఉండాలి.
కేటీఆర్.. నీ గతమేందో మరిచినవా? అపాయింట్‌మెంట్ అడిగితే 40 రోజులుగా ఇవ్వవా?, అత్యంత ఉన్నత వ్యక్తులను అణచివేస్తారా?, నీ రెండు లక్షల కోట్ల అభివృద్ధి.. నాకు రెండు చిల్లి గవ్వలు కూడా కావు, ఏ సంస్కృతి నుంచి వెలిసిన కమలాలు మీరు అంటూ నిప్పులు చెరిగారు.
అయితే నర్సింగరావు ఏ అంశాలపై చర్చించేందుకు కేటీఆర్ అపాయింట్‌మెంట్ కోరారో? ఆయనను కలిసేందుకు నిరాకరించారో? అనేది మాత్రం తెలియరాలేదు. కానీ ఈ అంశం మాత్రం ప్రస్తుతం తెలంగాణ సమాజంలో పొగలు సెగలు కక్కుతూ.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అసలు నర్సింగరావు రాసిన లేఖలో ఏముందంటే.. వాడు నచ్చాడా కేటీఆర్ నీకు.. నేను నచ్చలేదా.. ఏ రకంగా నిన్ను అంచనా వేయవచ్చు... 40 రోజుల నుంచి ప్రతీ రెండు రోజులకు ఒకసారి నిన్ను అపాయింట్‌మెంట్ అడిగితే నువ్వు నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వవా.. నీ రెండు లక్షల కోట్ల అభివృద్ధి నాకు రెండు చిల్లి గవ్వలు కూడా కావు అని పేర్కొన్నారు. అత్యంత ఉన్నత వ్యక్తులను అత్యంత హీనంగా అణచివేయడం ఎంత నీచమో ఒకసారి ఆలోచించు.. అంత గొప్ప హీనులు నీ సలహాదారులు... అంత గొప్ప ఏలిక నీది.. ఏ సంస్కృతి నుంచి వెలిసిన కమలాలు మీరు మీ గత జాడలు(అడుగుల) అనవాళ్లు మరిచారా.. ఇవన్నీ రేపు బహిరంగంగా మాట్లాడుకుందామంటూ ముగించారు.
అయితే తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొన్ని దశాబ్దాల కిత్రమే ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, కవిగా బి. నర్సింగరావుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలు మా భూమి, దాసి, రంగుల కల, మట్టి మనుషులు తదితర చిత్రాలు.. దేశ విదేశాల్లో ప్రదర్శించబడి.. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలను సైతం ఆయన అందుకొన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో సైతం ఆయన క్రియాశీలంగా వ్యవహరించారు.
ఆ క్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఆ రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా ఆయన అత్యంత కీలకంగా వ్యవహరించారు. అందుకోసం కేసీఆర్ సర్కారుతో కలిసి అడుగులు వేశారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వ పెద్దల ప్రయారిటీలు మారడంతో.. ఉద్యమకారులకు ప్రగతి భవన్ ద్వారాలు తెరుచుకోవడం బంద్ అయింది. అదే సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించిన.. ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను హేళన చేసిన ఆంధ్ర ప్రాంత నటులు, దర్శకులు, సినీ ప్రముఖులకు మాత్రం ప్రగతిభవన్‌లో ఎర్ర తీవాచి పరిచి మరీ స్వాగతం పలికారు... పలుకుతున్నారు. అందుకు ఇటీవల టాలీవుడ్ ప్రముఖ హీరో శర్వనంద్ వివాహ రిసెప్షన్‌కు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను స్వయంగా కలిసి.. ఆహ్వానించారు. ఈ రిసెప్షన్‌కు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత... పలువురు హీరోలతో కేసీఆర్, కేటీఆర్.. సమావేశమవుతోన్నారు. వారికి అపాయింట్‌మెంట్లు సైతం ఇస్తున్నారు. కానీ తెలంగాణ ఉద్యమం లో కీలకంగా వ్యవహరించిన వారికీ, ఉద్యమంతో నేరుగా సంబంధం ఉన్నవారిని కేసీఆర్ ఫ్యామిలీ సాధ్యమైనంత దూరం పెడుతూ వస్తున్నదని ఇప్పటికే ఓ భావన తెలంగాణ సమాజంలో బలంగా వేళ్లూనుకొంది. అంతేకాదు కేసీఆర్ ప్రస్తుత కేబినెట్‌లో.. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వారు ఎంత మంది ఉన్నారంటే.. ఒక్క సారి ఆలోచించాల్సిందే. ఇక కేసీఆర్‌తోపాటు.. తెలంగాణ ఉద్యమంలో కలిసి పని చేసిన.. ఈటల రాజేందర్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో.. ఏ పార్టీలో ఉన్నారో అందరికీ తెలిసిందే. అలాగే ప్రొపెసర్ కోదండ రామ్.. ఎక్కడ ఉన్నారు. అదే విధంగా ప్రత్యేక తెలంగాణ కోసం.. తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి.... దేవుడిచ్చిన అన్న అంటూ నాటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను పొగిడిన విజయశాంతి అలియాస్ రాములమ్ము.. ప్రస్తుతం ఏ పార్టీ జెండా మోస్తోందోనన్న విషయం విదితమే.
అలాగే తెలంగాణ ఉద్యమంతో సంబంధమున్న మృతుల కుటుంబాలకు న్యాయం జరిగిందా? అర్హులైన యువతకు ప్రభుత్వ కొలువులు వచ్చాయా?, ఆన్నదాతల ఆక్రందనలు ఆగాయా? రైతుల ఆత్మహత్యలకు పుల్‌స్టాప్ పడిందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. కొత్త పరిపాలన, కొత్త పథకాలతో అంతా కొత్త శోభ సంతరించుకొందా? లేక... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలన సాగినట్లే.. ఆట ఒకటే కానీ.. ఆటగాళ్లు మాత్రమే మారారా? అంటే అవుననే సమాధానం అయితే తెలంగాణ సమాజంలో ఓ వెల్లువలా వెల్లువెత్తుతోంది. ఇంకా చెప్పాలంటే పాత సీసాలో కొత్త సారా అన్నట్లుగా ఉందని ఇప్పటికే తెలంగాణ సమాజం ఒక్కటై స్పష్టం చేస్తోంది. అంతేకాదు ఉద్యమ సమయంలో నక్సలైట్ల అజెండా మాది అని ప్రకటించిన నాటి కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్దించి.. తెలంగాణ గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడిన తర్వాత.. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో జరుగుతోన్న అన్యాయాలను ఎవరైనా ప్రశ్నించినా.. అలాగే లోపాలను ఎత్తి చూపినా. వారి పరిస్థితి ఏమిటన్నది తెలంగాణ సమాజం ప్రత్యక్షంగా చూస్తోంది.