తెలుగు రాష్ట్రాలలో బీజేపీ త్రిముఖ వ్యూహం
posted on Jun 13, 2023 4:17PM
కర్నాటక ఎన్నికలు బీజేపీకి కొత్త పాఠాలు నేర్పించాయి. పెళ్లికి, తద్దినానికి ఒకే మంత్రం పఠించే బీజేపీకి కర్నాటక ఫలతాలు చేదు జ్ణాపకాలను మిగిల్చాయి. దీంతో ఉత్తరాది వ్యూహాలు దక్షిణాదిలో వర్కౌట్ కావని అర్ధం చేసుకున్న బీజేపీ ఇప్పుడు కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. తెలంగాణ బీజేపీ రథ సారథి బండి సంజయ్ పార్టీ బండిని స్పీడుగా తోలుతున్నాడని అధిష్ఠానం భావిస్తూ వచ్చింది. తీరా ఇప్పుడు చూస్తే అదంతా డొల్లేనని తేలిపోయింది.
అధిష్ఠానం పెట్టిన చీవాట్లతో బండి చప్పుడు చేయకుండా కూర్చున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ది కూడా పులేషం అని తేలిపోవడం, ఎంఐఎంతో సంబంధాలు క్రమంగా దెబ్బతినడంతో బీజేపీ ఈ సారి టీడీపీతో కలిసి వ్యూహరచనకు దిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. అక్కడ నాయకులు ఎక్కువ కావడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలంగాణలో నలుగురు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారన్న తృప్తి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ తృప్తి కూడా లేకపోవడంతో అన్ని సమస్యలకూ పరిష్కారంగా తెలుగుదేశం పార్టీని బీజేపీ ఎంచుకుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు చేసింది. బీజేపీకి దగ్గరగా మసలుతున్న జనసేన ఈ విషయంపై ఇంత వరకూ స్పందించ లేదు. ఆంధ్రకంటే ఆర్నెళ్లు ముందుగా జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని బీజేపీ, టీడీపీలు భావిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇరు పార్టీలూ ఈ అంశంపై ఇంత వరకూ ప్రకటన విడుదల చేయలేదు. మరో వూపు 460 లోక్ సభ స్థానాల గెలుపును టార్గోట్ చేస్తూ నితీష్ కుమార్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ, జాతీయ పార్టీలను ఏకం చేస్తున్నారు. ఆ కూటమిలో టీడీపీ, బీఆర్ఎస్ ఉంటాయా లేదా అనేది ఇంకా తేలలేదు. మరో వైపు 2024 ఎన్నికలలో 460 సీట్లను గెలవాల్సిందేనంటూ మోడీ ఇచ్చిన ఆదేశాలపై బీజేపీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. ఇప్పటికి ఉన్న సమాచారాన్ని బట్టి 250 స్థానాలలో బీజేపీ విజయం సాధించగలదని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. మిగిలిన 210 స్థానాల సాధించి మోడీ కళ్లలో ఆనందం చూడడానికి అమిత్ షా, నడ్డాలు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో మంతనాలు జరుపుతున్నారు. తమిళనాడులో డీఎంకే మినహా అన్ని పార్టీలు, కర్నాటకలో జేడీఎస్, ఆంధ్రాలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీ, తెలంగాణలో టీడీపీలతో సన్నిహితంగా ఉండాలని బీజేపీ భావిస్తోంది. కేరళలో సింగిల్ డిజిట్ స్థానాలు వస్తాయని బీజేపీ నమ్మకంతో ఉంది.
దక్షిణాదిలో కర్నాటక నుంచి పాతిక మంది, తెలంగాణ నుండి నలుగురు సభ్యులు లోక్ సభకు ఎన్నిక కాగా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో బీజేపీ ఖాతా తెరవలేకపోయింది. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న బీజేపీకి చంద్రబాబునాయుడు ఆపద్బాంధవుడిగా కనిపించారు. అమిత్, షా నడ్డాలు కూడబలుక్కొని టీడీపీ అధినేతను ఢిల్లీకి పిలిపించుకుని వ్యూహరచనకు శ్రీకారం చుట్టారు. దక్షిణాదిలో బీజేపీ పట్ల ఉన్న ఆదరణ సరిగ్గా అంచనా వేయగలిగిన చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వ్యూహాన్ని పదునుపెట్టే పనిలో ఉన్నారని పరిశీలకులు భావిస్తున్నారు.