సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే! సీబీఐ విచారణకు బాబు డిమాండ్
posted on Nov 12, 2020 2:36PM
జగన్ రాక్షసత్వం, అసమర్థకు అమయాక కుటుంబాలు బలైపోతున్నాయని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీలో కలకలం రేపుతున్న నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై మరోసారి తీవ్రంగా స్పందించారు చంద్రబాబు. వేధింపులకు గురిచేసి అబ్గుల్ సలాం కుటుంబాన్ని బలితీసుకున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సీబీఐ విచారణకు ఆదేశించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ప్రభుత్వ ఉదాసీనతే ప్రజల్లో అభద్రతను పెంచుతోందన్నారు. రాష్ట్రంలో ఏ కుటుంబానికి భద్రత లేదని విమర్శించారు చంద్రబాబు.
కోర్టు చివాట్లు పెట్టినప్పుడైనా డీజీపీ మారి ఉంటే.. అబ్దుల్ సలాం కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని చంద్రబాబు అన్నారు. సలాం కేసులో రైల్వే పోలీసులు కేసు నమోదు చేస్తే.. స్థానిక పోలీసులు తెలియనట్లు నటించారని చంద్రబాబు మండిపడ్డారు. సలాం కుటుంబసభ్యులు వీడియో విడుదల చేసే వరకూ..వాస్తవాలు బయటకు రాలేదన్నారు. తాను ట్వీట్ పెట్టాక పోలీసులు స్పందించారన్నారు. టీడీపీ న్యాయవాది వల్లే బెయిల్ వచ్చిందంటూ ప్రభుత్వం కొత్త నాటకం ఆడుతోందన్నారు. న్యాయవాదుల వల్ల బెయిల్‌లు వస్తాయా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అచ్చెన్న, కొల్లు రవీంద్ర, రాజధాని రైతులపై ఎలాంటి కేసులు పెట్టారని నిలదీశారు. పనికిమాలిన రాజకీయాలు చేస్తూ ఎవర్ని మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.