మరో బాంబు పేల్చిన సుబ్రహ్మణ్యస్వామి... పిచ్చి మాటలు వద్దంటున్న సోనియా..
posted on May 31, 2016 2:59PM
బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి కాంగ్రెస్ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అంటే చాలా ఇష్టం. అందునా ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం అంటే ఇంకా ఇష్టం. అందుకే వారి కుటుంబ సభ్యులపై ఎప్పుడూ ఏదో ఆరోపణలు చేస్తూనే ఉంటారు. అలాగే ఈసారి కూడా మరో బాంబు పేల్చారు. అయితే ఈసారి సోనియా గాంధీ అల్లుడుపై ఆరోపణలు గుప్పించారు. సోనియా గాంధీ అల్లుడు, వివాదాస్పద వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా... బ్రిటన్ పౌరసత్వం కోసం భారీ ఎత్తున నిధులు వెచ్చించారని.. త్వరితగతిన బ్రిటన్ పౌరసత్వం పొందేందుకే వాద్రా ఈ నిధులు వెచ్చించారని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ కూడా రాశారు, పౌరసత్వం రాగానే బ్రిటన్ చెక్కేసేందుకు వాద్రా సన్నాహాలు చేసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో వాద్రాపై నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు.
మరోవైపు ఈ ఆరోపణలపై సోనియా గాంధీ స్పందించి బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. "ప్రతి రోజూ ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు. ఇదో అలవాటైపోయింది. ఏవైనా ఆధారాలుంటే, విచారణ జరిపి ఆరోపణలను రుజువు చేసి చూపండి. పిచ్చి మాటలు ఎందుకు?" అని ఆమె అన్నారు. ఇండియాలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలన్న అజెండాతో సాగుతున్న బీజేపీ ఈ తరహా కుట్రలు చేస్తోందని ఆమె ఆరోపించారు. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని, మోదీ కేవలం ప్రధానమంత్రే తప్ప, షహన్ షా (రాజు) కాదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.