ప్రపంచ నేతలంతా పెన్నులతో.. వీళ్లు గన్నులతో! తాలిబన్లతో గండమేనా? 

ప్రజాస్వామ్య పరిపుష్టికి ప్రపంచ దేశాలన్నీ ఇతోధికంగా తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఉరుములతో కూడిన పిడుగులాగా ఆఫ్ఘనిస్థాన్లో తుపాకుల రాజ్యం వచ్చేసింది. 20 ఏళ్ల క్రితమే తాలిబాన్లను కాబూల్ నుంచి తన్ని తరిమేశాక.. అమెరికా ఆఫ్ఘనిస్థాన్ నుంచి వ్యూహాత్మకంగా ఖాళీ చేశాక.. మళ్లీ పాత మోతలే వినిపిస్తున్నాయి. ఆధునిక యుగంలో పరిపాలనంతా ఏసీ ఆఫీసుల్లో ఆకుపచ్చ సిరా పెన్నులతో జరుగుతుండగా... ఆఫ్ఘన్లో మాత్రం తాలిబాన్లతో గన్నులతో జరుగుతుందంటున్నారు విశ్లేషకులు. తాలిబాన్ల రాజ్యం ఎలా ఉంటుందో ఇప్పటికే రుచిచూసిన అక్కడి ప్రజలు.. బతుకు జీవుడా అనుకుంటూ బలుసాకు వెదుక్కుంటూ చెట్టుకొకరు, పుట్టకొకరు వెళ్తున్నారు. ఇదే విషయం ప్రపంచ మేధావులను, రచయితలను కలచివేస్తోంది. 

కాబూల్లోని అధ్యక్ష భవనం నుంచి అష్రఫ్ ఘనీ రహస్య మార్గం గుండా వెళ్లిపోయాడో లేదో.. ఇటు తాలిబాన్లు అదే అధ్యక్ష భవనంలో తిష్టవేశాయి. ఏమాత్రం ఆధునిక పోకడ ఆనవాళ్లు తెలియని తాలిబాన్లు అధ్యక్ష భవనాన్ని అంగడి సరుకులా మార్చేశారు. ఖరీదైన కుర్చీల్లో కాళ్లు బారచాపుకుని ఒకరు, అదే కుర్చీల్లో కాళ్లు, తుపాకులు పెట్టుకొని ఒకరు, ముందు టేబుళ్ల మీద మద్య-మాంసాలు, బిస్లరీ వాటర్ బాటిళ్లు పెట్టుకొని.. ఓ పద్ధతీ పాడూ లేకుండా ఆహారం తింటున్న విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ విజువల్స్ చూస్తే అత్యంత జుగుప్స కలుగుతోందంటున్నారు. అడవి నుంచి వచ్చిన కోతిమూక ఊరి మీద పడితే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉందన్న కామెంట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. 

మదరసాల్లో చదువుకున్న ఇస్లాం ఛాందసవాదపు చదువులే తప్ప ఆధునిక పరిపాలనకు సంబంధించిన ఏమాత్రం వ్యవహార జ్ఞానం గానీ, కనీస అనుభవం గానీ లేని కుర్రకారుకు తుపాకులు ఇచ్చి కాబూల్ వీధుల్లోకి వదలడం అక్కడి ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. వారి పరిపాలన ఎంత ఆటవికంగా ఉంటుందో ఊహించుకొని సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటివరకూ స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లి ఉద్యోగార్హత పొందిన అనేక మంది మహిళలకు కనీస రక్షణ లేకుండాపోయింది. ఏ చిన్న నేరం చేసినా కాలో, చెయ్యో తీసెయ్యడం, నడిబజారులోనే పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారెయ్యడం వంటి శిక్షలు ఆ ప్రజలకు గతానుభవాలే. 

అందుకు తగినట్టుగానే తాలిబాన్లు కాబూల్ ను వశం చేసుకున్నారో లేదో... వీధుల్లో ఉన్న మహిళల సాధికారతను తెలిపే అడ్వర్టయిజ్ మెంట్లు, పరిపాలనకు సంబంధించిన వాల్ పోస్టర్లు, వివిధ కంపెనీల సైన్ బోర్డులు.. ఇలా గోడల మీద ఉన్న మహిళల ఫొటోలన్నింటినీ తొలగిస్తున్నారు. ఆ ఫొటో ఒకదాన్ని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ ట్విట్టర్లో పోస్టు చేశారు. మహిళలను కేవలం పడక సౌఖ్యం ఇచ్చే వస్తువుగా, పిల్లల్ని కనే యంత్రంగా చూడటమే ఇస్లాంలోని కీలకాంశమని, దాన్నే తాలిబాన్లు అమలు చేస్తున్నారని విమర్శించారు.

ఆడవాళ్లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న తాలిబాన్లు అదే మహిళలతో శారీరక వాంఛలు తీర్చుకునేందుకు మాత్రం విపరీతంగా పోడీపడతారు. ఇరాన్, సిరియాల్లో ఐసిస్ టెర్రరిస్టులు యువతుల్ని బంధించి వారిని పొందడం కోసం టెర్రరిస్టులకు వివిధ రకాల పోటీలు పెట్టేవారు. వారిని అనుభవించాక చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపించారు. వారి చెర నుంచి బయటపడ్డ కొందరు యువతులు ఇప్పటికీ మానసిక జబ్బుల నుంచి బయట పడలేకపోతున్నారు. ఈ విషయాలే ఇప్పుడు అంతర్జాతీయ సమాజం గుర్తు చేసుకుంటోంది. అయితే అత్యంత శక్తిమంతమైన అమెరికా దళాలు, నాటో దళాలే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయాక ఈ ఉగ్రమూకలకు ఇక పట్టపగ్గాలు ఉంటాయా.. అన్న అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.