వైసీపీ పతనమే బీజేపీ లక్ష్యం!?

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి పార్టీల విషయంలో జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తుంటారు. భారతీయ జనతా పార్టీ నేతలను తమలపాకుతోను, తెలుగుదేశం, జనసేన పార్టీలను తలుపు చెక్కతోను పరామర్శిస్తుంటారు. బిజెపి పట్ల మెతక ధోరణితో ఉంటే మంచిదని భావిస్తుంటారు. కానీ, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కీలక నేత మాత్రం తమ అసలు లక్ష్యం ఏమిటో చాలా స్పష్టంగా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పతనాన్ని తమ పార్టీనే శాసిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీని ఖాళీ చేయడం, ఆ పార్టీ ఓటు బ్యాంకును 20 శాతానికి తగ్గించడం లక్ష్యాలని.. ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తావిస్తోంది.

పురందేశ్వరికి ముందు రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడుగా పనిచేసిన సోము వీర్రాజు, అప్పట్లో దూకుడుగా మాట్లాడగల కమలం నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే తమ పార్టీ బలంగా తయారు కావడానికి ఒంటరిగా రాష్ట్రవ్యాప్తంగా పోటీచేయడం బెటర్ అని నమ్మిన వాళ్లలో ఆయన ఒకరు. తెలుగుదేశంతో జట్టు కట్టిన తర్వాత, ఎన్నికల పర్వంలో ముక్తసరిగా వ్యవహరించారు. కానీ, ఎన్నికల్లో విజయం తర్వాత ఎమ్మెల్సీ అవకాశాలు దక్కినప్పుడు అనూహ్యంగా ఆయన పదవి దక్కించుకున్నారు. ఇప్పుడిక కమలదళంలో కీలక నేతగా తమ పార్టీ లక్ష్యాలు ఏమిటో ఘాటుగానే వివరిస్తున్నారు. 

విశాఖపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. వైసీపీని ఖాళీ చేసేయడమేనని, ఆ పార్టీకి రాష్ట్రంలో 20 శాతం ఓటు బ్యాంకు కూడా లేకుండా చేస్తాం అని సోము వీర్రాజు ప్రకటించారు. అసెంబ్లీకి గైర్హాజరవుతున్న జగన్ తీరును ఆయన రెండునాల్కల ధోరణిగా సోము వీర్రాజుఎద్దేవా చేయడం విశేషం. 2014 లో ప్రతిపక్ష నేత హోదా ఉన్నప్పటికీ అసెంబ్లీకి జగన్ రాలేదని, ఇప్పుడు హోదా కావాలనే సాకుతో మళ్లీ ఎగ్గొట్టారని.. ఇది విడ్డూరంగా ఉన్నదని ఆయన గేలి చేస్తున్నారు. 

జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలతో విరుచుకుపడడం కమలదళంలో సోము వీర్రాజుతో ఆగడం లేదు. జగన్ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేనంత నాశనం రాష్ట్రానికి చేశారని, ఎందుకూ పనికి రాని భూములను సెంటు స్థలం పేరుతో పేదలకు పంచి వారిని వంచించారని విష్ణుకుమార్ రాజు ఆరోపిస్తున్నారు. 

మొత్తానికి రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద డైరెక్ట్ ఎటాక్ కు దిగుతున్నది.  వైసీపీని ఖాళీ చేయడం అనేది కూటమి లక్ష్యం అని సోము ప్రకటించినప్పటికీ.. బిజెపి ఆ ఎజెండాతో ఉన్నదని అర్థం అవుతోంది. ఆ నడుమ విశాఖ వైసీపీ నేత అడారి ఆనంద్ బిజెపిలోనే చేరారు. విజయసాయిరెడ్డి కూడా బిజెపిలో చేరుతారనే  వదంతులున్నాయి. ముందు ముందు ఇంకా పలువురు వైసీపీ నేతలకు బిజెపి ఎర వేస్తున్నదేమోనని సోము మాటలను బట్టి పలువురు అనుకుంటున్నారు.