నాకు లేని బైకు ఎవ్వరికి ఉండకూడదని ఏం చేశాడంటే..?

మనకు లేనిది ఇతరులకు ఉంటే ఎవరికైనా ఈర్ష్య, అసూయ కలగడం సహజం. బయటకి ఎలా ఉన్న లోలోపల మాత్రం ఉడికిపోవడం మానవ సహజం. అయితే అలా ఆ ఉడుకుమోతుతనాన్ని లోపల దాచుకోలేకపోవడం ఢిల్లీ పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ మధ్య బైకులు తగలబడిపోతున్నాయి. దీనిపై పోలీసులకు లెక్కలేనన్ని ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి.  పోలీసులు ఎంతగా ప్రయత్నించినా ఈ కేసులో చిక్కుముడి వీడటం లేదు.

 

ఈ నేపథ్యంలో మే 28న ఎప్పటిలాగే ఒక బైకు తగులబడుతోంది. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నంచారు. ఇందులో విచిత్రమేంటంటే ఆ బైకుకు నిప్పు పెట్టిన వ్యక్తి కూడా ఆ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడం. ఆ దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.  తన పేరు సునీల్ కిశోర్ అని, తనకు బైకులంటే చాలా ఇష్టమని చెప్పాడు. అయితే రోజు కూలిగా పనిచేసే తనకు బైకులు కొనే స్తోమత లేదని అందుకే బైకులు దొంగతనం చేయాలనుకున్నట్టు తెలిపాడు. కాని దొంగతనం చేసిన తర్వాత దొరికిపోతానేమోనన్న భయంతో తనకు లేని బైకులు ఎవ్వరికి ఉండకూడదని వాటిని తగులబెడుతున్నాని చెప్పాడు. దీంతో నిర్ఘాంఘపోవడం పోలీసులవంతైంది.