వాహనదారులకు ఒడిషా షాక్.. "నో హెల్మెట్..నో పెట్రోల్ "..!

హెల్మెట్ పెట్టుకోండి..సీటు బెల్ట్ కట్టుకోండి..అని బుద్ధిగా చెబితే ఎవరు వింటారు. అలా చెప్పి..చెప్పి విసిగిపోయారేమో ఒడిషా పోలీసులకు చిర్రెత్తుక్కొచ్చింది. అందుకే ఇకపై కఠినంగానే వెళ్లాలనే నిర్ణయించుకున్నారు. రాజధాని భువనేశ్వర్‌లో వచ్చేనెల 15 నుంచి ద్విచక్ర వాహనాలు వినియోగించే వారు హెల్మెట్ లేకుండా బంక్‌కు వెళ్లి పెట్రోల్ పొందాలనుకుంటే..అక్కడి సిబ్బంది వారికి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే సమాధానాన్ని చెప్పనున్నారు. ఈ మేరకు  ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు వాహనదారులకు, పెట్రోల్ బంక్‌లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ద్విచక్రవాహనాలు అమ్మేటప్పుడే వాటితో పాటుగా హెల్మెట్‌ను కూడా తప్పనిసరిగా అమ్మాలని కూడా అక్కడి  వాహన విక్రయదారులను ఆదేశించారు.