అసలైన వైద్యుడు- బిధాన్‌ చంద్ర

 

మదర్స్ డే, ఫాదర్స్‌ డే నుంచి టైలర్స్ డే వరకూ చాలా రోజుల గురించి విన్నాం. పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి అయిన ఈ సంప్రదాయాలను సుబ్బరంగా మనమూ ఆచరించేస్తున్నాము. కానీ మన దేశంలో వైద్యులకి ప్రత్యేకించి ఒక రోజు ఉందని తెలుసుకోవడం, దాని వెనుక ఉన్న మహానుభావుడి గురించి చదువుకోవడం ఒక కొత్త అనుభవం!

 

బిధాన్‌చంద్ర రాయ్: స్వాతంత్ర్య సమరయోధునిగా, పశ్చిమబెంగాల్‌ రెండో ముఖ్యమంత్రిగా... అన్నింటికీ మించి అద్భుతమైన వైద్యునిగా బిధాన్‌చంద్ర రాయ్‌ది మన దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. జులై 1,1882న జన్మించిన రాయ్‌, 1962లో అదే జులై 1వ తేదీన పరమపదించారు. ఆయన గౌరవార్థమే భారతీయులు జులై1ని వైద్యుల దినోత్సవంగా జరుపుకొంటున్నారు. బీహార్లోని పాట్నాలో జన్మించిన బిధాన్‌చంద్ర బాల్యం ఏమంత రంగులమయం కాదు. ఐదుగురు సంతానంలో బిధాన్‌చంద్ర ఆఖరివాడు. పైగా అతనికి 14 ఏళ్లే వచ్చేసరికి తల్లి కూడా చనిపోయింది. ఇక వైద్య శాస్త్రంలో ఉన్నతచదువులు చదువుదామని కలకత్తాకి చేరుకున్నాడో లేదో, తండ్రిని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇంటి నుంచి పైసా డబ్బు రాకపోవడంతో బిపిన్‌ ఉపకారవేతనాల మీద ఆకలిని తీర్చుకుంటూ, లైబ్రరీలోని పుస్తకాలను చదువుకుంటూనే వైద్యపట్టాని సాధించాడు.

 

లండన్‌లోనూ తప్పని కష్టాలు:   కలకత్తాలో వైద్యవిద్యని ముగించుకున్నాక బిధాన్‌చంద్ర అతి తక్కువ ఫీజులతో రోగులకు సేవ చేయడం మొదలుపెట్టాడు. ఆ తరువాత కొన్నాళ్లకి లండన్‌కి వెళ్లి వైద్యంలో F.R.C.S పట్టాని పొందుదామని బయల్దేరాడు. కానీ భారతీయుడు అన్న ఒకే ఒక్క కారణంగా అతడిని పదే పదే ఛీకొట్టారు లండన్‌లోని అధికారులు. అయినా పట్టువిడవకుండా F.R.C.Sని పూర్తిచేసుకుని మాతృదేశానికి తిరిగివచ్చాడు. ఇక అప్పటి నుంచి అతనిలోని వైద్యుడు విజృంభించాడు. టి.బి రోగుల కోసం, కేన్సర్‌ బాధితుల కోసం, ఆడవారి కోసం ప్రత్యేకమైన ఆసుపత్రులను ప్రారంభించాడు. ఒక పక్క వైద్యం, మరో పక్క విద్యార్థులకి ఉపన్యాసాలతో జీవితాన్ని కొనసాగించాడు.

 

స్వాతంత్ర పోరాటంలో... వైద్య వృత్తిలో క్షణం తీరిక లేనప్పటికీ, తన సామాజిక బాధ్యతను మర్చిపోలేదు బిధాన్‌. కాంగ్రెస్‌లో చేరి సహాయ నిరాకరణ వంటి అనేక ఉద్యమాలలో పాల్గొన్నాడు. ఫలితంగా కొన్నాళ్లు జైలుశిక్షను కూడా అనుభవించాడు. జైలు నుంచి వచ్చిన తరువాత కూడా రాజకీయాలలో చురుగ్గా పాల్గొనేవారు. అలా కలకత్తాకు మేయర్‌గా సైతం ఎన్నికయ్యారు బిధాన్‌. ఆ సమయంలోనే కలకత్తావాసులకు ఉచిత విద్య, వైద్యం వంటి మౌలిక వసతులను అందించేందుకు కృషి చేశారు. ఒకానొక సందర్భంలో గాంధీకి సైతం వ్యక్తిగత వైద్యునిగా బాధ్యతలు నిర్వహించారు.

 

బెంగాల్ ముఖ్యమంత్రిగా: 1948లో గాంధీజీ అభ్యర్థన మేరకు బెంగాల్‌ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు బిధాన్‌చంద్ర. ఆ తరువాత తన మరణం వరకూ అంటే 1962 వరకూ 14 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని అధ్బుతంగా పాలించారు. బెంగాల్‌ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోవడం, నిరుద్యోగం, పేదరికం, మతఘర్షణలు వంటి అనేక సమస్యలు సద్దుమణిగిపోయేలా చేశారు. బెంగాల్‌ ఆర్థికరంగంలో దూసుకుపోయేలా దుర్గాపూర్, కళ్యాణి వంటి ఆధునిక నగరాలను నిర్మించారు.

 

ముఖ్యమంత్రిగా ఎంత తీరికలేకుండా ఉన్నప్పటికీ తాను ఒక వైద్యుడినన్న విషయాన్ని మాత్రం బిధాన్‌ మర్చిపోలేదు. వైద్యానికి సంబంధించి స్మారకోపన్యాసాలు ఇచ్చేవారు. పేదలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకునేవారు. ఆఖరికి తన మరణం తరువాత, తన ఇంటిని కూడా ఒక వైద్యశాలగా తీర్చిదిద్దమని వీలునామా రాశారు. తన అపారప్రతిభకు, కార్యదక్షతకు గుర్తింపుగా 1961లో భారతరత్నని సాధించారు బిధాన్‌. మరి అలాంటి వ్యక్తి జీవితమే ఆదర్శంగా ‘వైద్యుల దినోత్సవం’ జరుపుకోవడంలో తప్పేముంది!

 

- నిర్జర.