పరీక్షకి భయపడితే బట్టతల వచ్చేసింది!
posted on Aug 4, 2016 10:24AM
మన రోజువారీ జీవితాల మీద ఒత్తిడి చూపే ప్రభావం అంతా ఇంతా కాదని అందరికీ తెలిసిందే! ఒత్తిడి మన ఆలోచనా విధానమే కావచ్చు. కానీ అది మన ఆరోగ్యం మీద చూపే ప్రభావం దారుణంగా ఉంటుంది. అజీర్ణం దగ్గర్నుంచీ గుండెపోటు వరకూ ఒత్తిడి ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో రోజూ చదువుతూనే ఉన్నాము. కానీ ఈ వారం అంతర్జాతీయ పత్రికలలో వచ్చిన ఓ వార్త ఒత్తిడి గురించి మరింత భయాన్ని రాజేసింది. అదేమిటంటే...
కేటీ అన్నా మూర్ అనే 20 ఏళ్ల యువతి ఇంగ్లండులోని బోర్నెమోత్ విశ్వవిద్యాలయంలో చదువుతోంది. కేటీకి, పట్టులా ఒత్తుగా ఉండే తన పొడవాటి జుట్టంటే మహా ఇష్టంగా ఉండేది. అలాంటిది ఒక రోజున తలస్నానం చేస్తుండగా, గుప్పిళ్ల నిండా జుట్టు చేతికంది రావడం చూసి నిర్ఘాంతపోయింది కేటీ. అలా అడపాదడపా ఊడటం మొదలుపెట్టిన జుత్తు, రోజులు గడిచేకొద్దీ విపరీతంగా రాలిపోయింది. ఒక రెండు వారాలు గడిచేసరికి దాదాపు 70 శాతం జుట్టు రాలిపోయింది.
కేటీ తన అరకొర జుట్టుతో తరగతులకు వెళ్లడానికి కూడా సిగ్గుపడిపోయింది. ఇక తన గదిని ఖాళీ చేసి తండ్రి దగ్గరకు వెళ్లిపోయింది. కేటీ సమస్యను విన్న వైద్యులు ఎన్ని పరీక్షలు చేసినా ఉపయోగం లేకపోయింది. చివరికి తేలిందేమంటే... మరో రెండు నెలలలో విశ్వవిద్యాలయంలో జరగబోతున్న పరీక్షల విషయంలో ఒత్తిడికి లోనవ్వడం వల్ల కేటీ జుత్తు అలా రాలిపోయిందట. పైగా మిగిలిన కాస్త జుత్తు కూడా ఊడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించి పంపారు వైద్యులు.ఇంతకీ కేటీకి వచ్చిన రుగ్మత పేరు- ‘అలోపేసియా అరేటా’! శరీరం తన సొంత కణాలనే శత్రువులుగా భావించి, వాటి మీద దాడి చేయడంలో (autoimmune disease) ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. సాధారణంగా జన్యువుల కారణంగా వచ్చే ఈ ‘అలోపేసియా అరేటా’ కొన్ని సందర్భాలలో తీవ్రమైన ఒత్తిడి వల్ల కూడా ఏర్పడవచ్చని చెప్పుకొచ్చారు. అందుకు కేటీ ఉదంతమే ఒక ఉదాహరణ.
సాధారణంగా ఈ వ్యాధికి గురైనవారిలో ఓ నెల నుంచి సంవత్సరం లోపల మళ్లీ జుట్టు వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే అలా జుట్టు మళ్లీ పెరగడానికి స్టెరాయిడ్లను వాడాల్సి రావచ్చు. పైగా ఒకసారి ఈ రుగ్మత వచ్చి మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నవారిలో మళ్లీ మళ్లీ వ్యాధి తిరగబెట్టే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే కేటీ ఇక మరో గత్యంతరం లేక ఓ విగ్గుని కొనుక్కోవాలని అనుకుంటోంది. ఆ విగ్గు కొనుక్కోవడం కోసం తనకు సాయం చేయండంటూ ఆన్‌లైన్‌లో (https://www.gofundme.com/katieswig) అభ్యర్థిస్తోంది.
అదండీ విషయం! ఒత్తడి ఎంత పని చేస్తుందో మనకి మరోసారి తెలిసివచ్చింది కదా! అందుకే మన జీవితాలలోకి ఒత్తిడి ప్రవేశించకుండా జాగ్రత్తపడదాం. బతుకు అనే ఈ సముద్రాన్ని అలవోకగా దాటేందుకు ప్రయత్నిద్దాం.
- నిర్జర.