మునుగోడులో ఇప్పటికి ఓటరే రాజు

వేగంగా మారిపోతున్న రాజకీయ పరిస్థితులు రాజకీయపార్టీల్లోని చిన్న నాయకులకు, ఇటు ఓటరుకిలానే సందిగ్ధంలో పడేస్తున్నాయి. పార్టీ అధినేత మాటే వేదంగా అనుసరించి అడుగు ముందుకెయ్యాలి. జెండాలు పట్టుకుతిరగాలి, భారీ ప్రచారాల్లో పాల్గొనాలి, నాయకునితో శభాష్ అనిపించుకోవాలి. తన ప్రాంతంలో ఓటర్లను తన పార్టీకే వేసేలే చేయాలి, వారి మనోగతం తెలుసుకుని వారి సమస్యల్ని పెద్ద నాయకుల చెవికి చేరవేసి వాటిలో కనీసం ఓకటి  రెండింటిని పరిష్కరించే మార్గాలు ఆలోచించాలి. మధ్యాన్నం తిండిమాట ఎలా ఉన్నా, ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటూ నాయకుని వెంటే తిరుగుతూ ఉత్సాహంగానే ఉండితీరాలి.  ఏమాత్రం నీరసించినా నాయకుడు అంగీకరించడదు.  తన ప్రాంతీ యులకు తాను పెద్ద పెద్ద నాయకులతో చేతులు కలిపి నవ్వుతూ కనపడాలి, పాదయాత్రలు, రోడ్డుషో ల్లో హడావుడి చేయాలి అప్పుడే తనకూ కాస్తంత పరువు నిలబడుతుంది. వీటితో పాటు వారిని బూత్ వరకూ లాక్కురావడం, ఓటు తన పార్టీ గుర్తుకే వేసేట్టు చేయడంలో కాయకష్టం చేయాల్సిందే. 

ప్రస్తుతం మునుగోడు ఎన్నికలకు ప్రతీ పార్టీ  వీరాభి మాని, పార్టీ అధినేత ఆదేశాలమేరకే ఏది చేసినా.  అయితే ఓటరు తన మాట వింటాడన్న నమ్మకం లేదు. ప్రస్తుతం పార్టీల నాయకులు, తమ సీనియర్లను, ఇతర ప్రాంతాల నుంచి సీనియర్లను కూడా మునుగోడుకి దింపి ప్రచారం మరింత ముమ్మరం చేస్తున్నపుడు, ఓటరుకు బహిర్గతంగా, రహస్యంగానూ బహుమతుల పేరుతో అనేకా కానుకలు, డబ్బు ఏర్పాటు చేస్తున్న తరుణంలో ప్రాంతీయ చిన్న నాయకుల మాట వినాలని లేదు. పెద్ద నాయకులే, పెద్ద పెద్ద కార్లలో వచ్చి తన చిన్న యింటి ముందు దిగి మరీ తన పేరు తెలుసుకుని పిలిచి పలకరిస్తున్నారు. అలాంటపుడు ఓటరే రాజు అనే భావన కొండంత గర్వాన్నీ ఇస్తుందిగదా. 

పార్టీలన్నీ ఇలా సినిమాటిక్ గా తమను ప్రేమిస్తున్న తరుణంలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఓటరు ఎందుకు ఉంటారు? ఓటరు మీద పెద్ద స్టడీ చేయాల్సిన పనిని కేవలం నోటుతో, నోటి మాటతోనే అవ్వగొట్టే యత్నాలు పార్టీల నాయకులు చేస్తున్నారు. దేనికయినా ఖర్చులుంటాయి, ఖర్చులో ఖర్చు ఇదొకటి అనుకుంటున్నారు. కానీ  ఓటరు అలా అలా ఆలోచించడం లేదు. తమకు పనీ పాట లేని సమయంలోనూ నెలంతా కష్టపడినా సంపాదించేదానికంటే కూడా ఎక్కువ సొమ్ము ఓకే అనే మాటతో, ప్రామిస్తో వచ్చి పడుతుంటే కాదనలేరు. పైగా వచ్చిన వారికి అవసరం, తనకు కాదు, తాను డిమాండ్ చేయవచ్చు. పరిస్థితులు తర్వాత ఎలా ఉన్నా ప్రస్తుతం పై చేయిగానే వ్యవహరించాలన్న సూత్రాన్ని ఓటర్లు బాగా అలవర్చుకున్నారు. కట్టలు కట్టలు కార్లలో, టూవీలర్లలో వెళ్లేవారి దగ్గర పట్టుకుంటున్నామని పోలీసులు తెగ సంబరపడుతున్నారేగాని మునుగోడులో ఓటరు, పార్టీ ప్రాంతీయ నాయకుల మధ్య లోపాయకారి ఒప్పందాలు జరిగిపోతున్నాయి. 

ఓటరుకి ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, టీ ఆర్ ఎస్.. ఏదయినా ఒకటే. వారికి  ఓటు కావాలి... వీరికి వాహన సౌకర్యం, డబ్బు కావాలి. ఇద్దరి మధ్య సఖ్యత కుదరాలే గాని ఓట్లు వద్దన్నకొద్దీ పడతాయి.. వారికి వద్దన్నకొద్దీ డబ్బు మూటలు అందుతాయి. ఎవరు ఎన్ని లెక్కలు కట్టినా, ఓటరు తన మనసులో మాట మూటల మాటున దాచే ఉంచాడు. బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్లేంతవరకూ ఈ వైభోగం  పార్టీలవారు అందించకా తప్పదు. ఆనక ఎవరు దేనికి వేసిందీ దేవుడెరుక.  అసలు గుట్టు ఓటరు ఛస్తే చెప్పడు. కొందరి విషయంలో నమ్మకంగా పార్టీల వారు నిర్ధారించుకోవడమే తప్ప అందరి విషయంలో బహుకష్ట్ హై. మరి పార్టీల సిద్ధాంతాలు, ప్రచారాలు, వ్యాఖ్యానాల ప్రభావం పరిస్థితి ఏమిటన్నదానికి సమాధానం శూన్యమే అవుతుంది. అంతా నటన. ఎన్నికల నటన. కేవలం ఓటరును ఆకట్టకోవడానికి అనేకానేక వేష ధారణలు తప్పని నటన. కేవలం అభ్యర్ధి నిలువెత్తు బొమ్మను అడ్డుపెట్టుకుని రంగంలోకి దిగడమే పార్టీల పని.. గెలిపించడం, ఓడించడం, తటస్థంగా ఉండాలని ఆలోచించి వంటింట్లోనే ఉండిపోవడం అంతా ఓటరు మాయా జాలం. చివరికి అలసిసొలసి, నిమ్మరసంతో  జెండాలు మూల పడేసి ప్రాంతీయ నాయకులు సేద తీరడం తప్ప వారికి ప్రత్యేకించి ఒరిగేది ఎప్పుడూ ఏమీ ఉండదు. కానీ పార్టీ  సీనియర్లు, ప్రచార ఆార్భాటాలు మళ్లీ మళ్లీ  ఆకట్టుకుంటూనే ఉంటాయి..2024 వరకూ.