అందర్నీ ఆశ్చర్యపరిచిన మీనాక్షి నటరాజన్ ఔన్నత్యం

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి హోదాలో మీనాక్షి నటరాజన్ తొలిసారి తెలంగాణలో అడుగుపెట్టారు. రైలు మార్గం ద్వారా ప్రయాణమై వచ్చిన ఆమె  శుక్రవారం (ఫిబ్రవరి 28) ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఆమెకు టీపీసీసీ చీఫ్  మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయనతో పాటు ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, ఫహీం, రాచమల్లు సిద్ధేశ్వర్ ఇతర కాంగ్రెస్ నాయకులు మీనాక్షికి స్వాగతం పలికారు. అయితే మీనాక్షి నటరాజన్ సింప్లిసిటీ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. హంగు ఆర్భాటాలకు తాను దూరం అని రాష్ట్ర నేతలకు మీనాక్షి నటరాజన్ ఇప్పటికే సమాచారం ఇచ్చారు. చెప్పినట్లుగానే ఆమె సాధారణ రీతిలో హైదరాబాద్ కు రావడం ఆసక్తిగా మారింది.

 ఢిల్లీ దూతగా వస్తున్న మీనాక్షి నటరాజన్ ఫ్లైట్ లో కాకుండా రైలులో రావడం తన లగేజీ బ్యాగ్ ను తనే మోసుకుంటూ తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన నేతలతో ముచ్చటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గల్లీ స్థాయి లీడర్లే హంగు ఆర్భాటాలతో హడావుడి చేస్తున్న ఈ రోజుల్లో రాహుల్ గాంధీ టీమ్ లో కీలక సభ్యురాలు, మాజీ ఎంపీ, తెలంగాణలో అధికార పార్టీకి ఇన్ చార్జిగా ఉంటూ మీనాక్షి నటరాజన్ మాత్రం తాను చెప్పినట్లుగా ఆర్భాటాలకు దూరంగా సాధారణంగానే తన పర్యటన కొనసాగిస్తుండటంతో మేడం సింప్లిసిటీ ఇటు పార్టీలో అటు సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది.

ఇక తన పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు, గోడ పత్రికలు ఏర్పాటు చేయవద్దని తనకు ఏసీ రూమ్ లు, హోటల్స్ వద్దని రాష్ట్ర నేతలకు ఆమె ఇప్పటికే సమాచారం ఇచ్చారు. ఈ టూర్ లో భాగంగా ప్రభుత్వ అతిథి గృహం దిల్ కుష్ గెస్ట్ హౌస్ లో బస చేస్తున్నారు. ఇక హైదరాబాద్ కు వచ్చిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను దిల్ కుష్ గెస్ట్ హౌస్ లో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu