ఉడాన్ యాత్రి కేఫ్.. విమానాశ్రయంలో కాఫీ ధర ఎంతో తెలుసా?
posted on Mar 1, 2025 9:34AM

సరసమైన ధరలకు విమానాశ్రయాలలొ ఆహారం అందించేందుకు ఉద్దేశించిన ఉడాన్ యాత్రి కేఫ్ ను చెన్నై విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం (ఫిబ్రవరి 27) ప్రారంభించారు. రెండు నెలల కిందట ఉడాన్ యాత్రి కేఫ్ ను కోలకత్తాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రారంభమైంది, ఇది ప్రయాణికులకు బడ్జెట్-స్నేహపూర్వక ఎంపికలను అందిస్తుంది. త్వరలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ప్రారంభం కానుంది.
విమానాశ్రయంలో తినుబండారాలు, కాఫీ, టీ వంటి వాటి ధరలు ఆకాశాన్నంటుతుంటాయి. ఆఖరికి వాటర్ బాటిల్ కూడా ప్రియమే. దీంతో విమానప్రయాణీకులకు సరసమైన ధరలకే ఆహారం, పానీ యాలు అందించాలన్న ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటి ఉడాన్ యాత్రి కేఫ్ కోల్ కతాలోని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత ఏడాది డిసెంబర్ 19న ప్రారంభమైంది. ఈ కేఫ్ విమాన ప్రయాణీకుల అభిమానాన్ని చూరగొంది. నాణ్యత, రుచి ధరలపై సర్వత్రా సంతృప్తి వ్యక్తమౌంది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రాయాలలోనూ వీటిని ప్రారంభించాలన్న డిమాండ్ వెల్లువెత్తింది. దీంతో విమాన ప్రయాణీకుల డిమాండ్ మేరకు వీటిని దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలకూ విస్తరించాలని భావిస్తున్నారు.
ఉడాన్ యాత్రి కేఫ్ లో వాటర్ బాటిల్ పది రూపాయలకు, టీ పది రూపాయలకు లభిస్తాయి. ఇక కాఫీ ధర అయితే 20 రూపాయలు మాత్రమే. ఇప్పటి వరకూ అధిక ధరలకు వీటిని కొనుగోలు చేసిన విమాన ప్రయాణీకులు ఉడాన్ యాత్రి కేఫ్ అందుబాటులోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సమోసా, స్వీట్ కూడా 20 రూపాయలకే లభిస్తుంది. విమానయానాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా విమానాశ్రయాలలో ప్రయాణీకులకు అందుబాటు ధరలో ఆహారం, టీ, కాఫీ అందించే ఉద్దేశంతో ఉడాన్ యాత్రి కేఫ్ ల ఏర్పాటుకు కేంద్రం సమయాత్తమౌతోంది. అందులో భాగంగానే తొలుత కోల్ కతా, ఆ తరువాత చెన్నై ఎయిర్ పోర్టులలో వీటిని ఏర్పాటు చేసింది. త్వరలో ఢిల్లీ విమానాశ్రయంలో కూడా ఉడాన్ కేఫ్ అందుబాటులోకి రానుంది. దేశ వ్యాప్తంగా విమానయానాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం ప్రవేశ పెట్టిన ఉడాన్ పథకంలో భాగమే ఉడాన్ యాత్రీ కేఫ్ లను కేంద్రం ప్రారంభిస్తున్నది.