రేవంత్ రెడ్డి పేరు ఎందుకు గుర్తుండటం లేదు?
posted on Mar 1, 2025 8:55AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును వేదికలపై యాంకర్లు, నాయకులు మరచిపోవడం అన్నది ఒక సర్వసాధారణ విషయంగా మారిపోయింది. తాజాగా శుక్రవారం (ఫిబ్రవరి 28) గచ్చిబౌలిలోని విజ్ణాన్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో యాంకర్ రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి అని ప్రస్తావిస్తూ పేరు మరచిపోయి కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయారు. ఆ తరువాత రేవంత్ పేరు చెప్పకుండానే తన ప్రసంగం కొనసాగించారు.
ఇదే వేదిక మీద కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఉన్నారు. ఆయన కూడా తన ప్రసంగంలో రేవంత్ రెడ్డి పేరు పలకడంలో తడబడ్డారు రేవంత్ జీ రెడ్డి అని పేర్కొన్నారు. అయినా ఇలా రేవంత్ రెడ్డి పేరును వేదిక పై మరిచిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో అంటే దాదాపు రెండు నెలల కిందట ప్రపంచ తెలుగు ఫెడరేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడానికి బదులు కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మరో సందర్భంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడానికి బదులుగా కేసీఆర్ అన్నారు. ఒకరు, ఒకసారి అంటే అర్ధం చేసుకోవచ్చు కానీ, తరచుగా ముఖ్యమంత్రి అయిన తన పేరును యాంకర్లు, నాయకులు మరిచి పోతుండటం రేవంత్ రెడ్డికి కచ్చితంగా ఒకింత ఇబ్బందికరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.