ఈ ఎన్నికలలో గెలిచేది ఎవరు!

 

కొంతకాలంగా దేశమంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ తేదీలను ఖరారు చేసింది. ఏప్రిల్‌ 4 నుంచి మే 19 వరకూ సాగే ఈ ప్రక్రియలో మే 19 నాటికి తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. పశ్చిమబెంగాల్, కేరళ, అసోం, తమిళనాడు, పుదుచ్చేరిలలో జరిగే ఈ ఎన్నికల సందర్భంగా ఆయా రాష్ట్రాలలోని వివిధ పార్టీల విజయావకాశాల మీద ఒక విహంగ వీక్షణం!

పశ్చిమబెంగాల్‌

ఎన్నికల సంఘం తన కార్యాచరణను ఇలా విడుదల చేసిందో లేదో, మమత అలా తన అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసేశారు. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకు గాను ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా సొంతంగానే ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అభ్యర్థులను ముందుగానే ఖరారు చేయడం నిజంగానే మమతకు కలిసొచ్చే విషయం. కానీ ఈ జాబితాలో శారదా స్కాంలో పీకల్లోతు మునిగిపోయి ప్రస్తుతం జైల్లో ఉన్న మదన్‌ మిత్రాకు చోటు కల్పించడంతో, ప్రతిపక్షాలు విమర్శించేందుకు తగిన అవకాశం దక్కినట్లైంది. అయితే మమతను విమర్శించేందుకు శారదాస్కాం తప్ప మరేమీ పెద్దగా అంశాలు లేకపోవడం వారి దురదృష్టం! పశ్చిమ బెంగాల్లో మమత అద్భుతమైన పురోగతిని సాధించనప్పటికీ, 30 ఏళ్లకు పైగా ఆ రాష్ట్రాన్ని పాలించిన సీపీఐ(ఎం)తో పోల్చుకుంటే పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయన్నది జనాభిప్రాయమే! ఆ అభిప్రాయమే మమతను ఈసారి కూడా గెలిపించనున్నదన్నది విశ్లేషకుల అంచనా!

తమిళనాడు

ఒకసారి డిఎంకేకీ మరోసారి అన్నాడిఎంకేకి దఫాలవారీగా అధికారాన్ని కట్టబెట్టే తమిళతంబిలు, ఈసారి తమ సంప్రదాయాన్ని సడలించి పురుచ్చితలైవికి పట్టం కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. జయ విరోధి కరుణానిధి కురువృద్ధునిగా మారిపోవడం, స్టాలిన్‌ తప్ప మరో జనాకర్షణ ఉన్న నేత వారసునిగా లేకపోవడం డీఎంకేకు లోటుగానే ఉంది. పైగా అన్నాడీఎంకే  పార్లమెంటులో 2G స్కాంను తిరిగి లేవనెత్తడంతో ఈసారి కూడా అదే ఆయుధంతో ఇటు డీఎంకేనీ, అటు కాంగ్రెస్‌నీ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయ వ్యూహాత్మకంగా తిరిగి రాజీవ్‌ హంతకుల క్షమాభిక్ష అంశాన్ని లేవనెత్తడంతో, అతివాద తమిళుర మనసు కూడా ముందస్తుగా గెల్చుకున్నట్లైంది. గత ఎన్నికలలో మిక్సీల మొదలుకొని ల్యాప్‌టాప్‌ల వరకూ ఉచితంగా ప్రకటించిన వరాలన్నీ జయ అందించడంతో, ఈసారి కూడా ఆమె అందించే వరాల కోసం కొందరు ఓటర్లు ఎలాగూ సిద్ధంగా ఉంటారు. మరి ‘జయ’కేతనం ఎగరక ఏమవుతుంది.

కేరళ

ప్రస్తుత కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు ఊమెన్ చాందీ, సోలార్‌ స్కాంలో పీకల్లోతు మునిగిపోయి ఉన్నారు. ఈ కేసులో నిందితురాలైన సరిత, సోలార్ స్కాంకి సంబంధించి రోజుకో చెంబుడు బురదను చాందీ మీద కుమ్మరిస్తున్నారు. విదేశీయానాలు, వివాహేతర సంబంధాలు, అక్రమ సంపాదనలు, హత్యలు.... ఇలా సోలార్‌ స్కాం చుట్టూ అల్లుకుంటున్న కథలు సురేష్‌గోపీ నటించే అపరాధ పరిశోధక చిత్రాలకంటే చిత్రంగా సాగుతున్నాయి. దీంతో పోయిన ఎన్నికలలో అధికారాన్ని తృటిలో కోల్పోయిన వామపక్ష కూటమి, ఈసారి విజయతీరాలను చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తోస్తోంది.

అసోం

చిన్న రాష్ట్రమైనా కూడా ఈశాన్య భారతంలో రాజకీయంగానూ, భౌగోళికంగానూ కీలకమైన రాష్ట్రం అసోం. ULFA, NDFB వంటి అతివాదుల ప్రాబల్యం ఎక్కువైనప్పటికీ, కాంగ్రెస్‌ నేత తరుణ్‌గొగోయ్‌ 15 సంవత్సరాలుగా ఎలాగొలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నెగ్గుకొచ్చారు. అయితే బీజేపీ కూడా నిదానంగా అసోంలో బలం పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌నుంచి వస్తున్న అక్రమశరణార్థుల సమస్య, హిందుత్వ ఎజెండాతో బీజేపీ క్రమంగా బలపడుతోంది. ఆ పార్టీ తరఫున సర్బానంద సోనోవాల్‌కు కాస్తో కూస్తో జనాకర్షణ కూడా ఉండటంతో ఈసారి బీజేపీ అక్కడ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలలో మిగతా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా కాంగ్రెస్‌, బీజేపీలు నేరుగా తలపడే రాష్ట్రం మాత్రం అసోమే! ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం రెండు పార్టీలకీ ప్రతిష్టాత్మకంగా మారనుంది. అందుకే పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే రాహుల్‌ నేరుగా అసోంకి ప్రయాణమయ్యారు. ఎన్నికలు ముగిసే దాకా దిల్లీ పెద్దలు ఒకరి తరువాత ఒకరు రాహుల్‌ బాట పడతారనడంలో సందేహం లేదు!

పుదుచ్చేరి

పుదుచ్చేరికి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్‌.రంగస్వామికి అక్కడ ఉన్న జనాదరణ అసామాన్యం. అందుకే తన పేరులోని పొడి అక్షరాలతోనే All India N R Congress అంటూ 2011లో ఒక పార్టీని పెట్టినా, పార్టీ పెట్టిన మూడు నెలల్లోనే ఎన్నికలలో జయభేరి మోగించారు. అప్పట్లో అన్నాడీఎంకే స్నేహహస్తం కూడా రంగస్వామికి కలిసివచ్చింది. కానీ ఈసారి పొత్తులు మారేట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీకి దగ్గరగా ఉన్నా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా... డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి ఈ కలను భగ్నం చేసేందుకు శతథా ప్రయత్నిస్తున్నాయి. మరి ఈసారి అన్నాడీఎంకే రంగస్వామితో కలిసి పనిచేస్తుందా, లేక ఒంటరిగానే బరిలోకి దిగుతుందా చూడాల్సిందే!

దేశంలోని అయిదు ప్రాంతాల్లో జరగనున్న ఎన్నికలకి సంబంధించి ఇది ఒక ముఖచిత్రం మాత్రమే! మే 19నాటికి తుది ఫలితాలు వెల్లడయ్యే నాటికి ఈ ఘట్టం మరిన్ని మలుపులు తిరగడం ఖాయం. అనుకున్నదే జరుగుతుందో, అనుకోనిది ఎదురుపడుతుందో... వేచి చూడాల్సిందే!

 ⁠