జీవితం మీద యాసిడ్

 

అదో సినిమా! అందులో అల్లరి చిల్లరిగా తిరిగే కథానాయకుడు. ఆయనగారు పొద్దున లేస్తూనే బూతులు, రాత్రవగానే మందు... ఈ రెండింటి మధ్య అల్లరి చిల్లరి తిరుగుళ్లతో జీవితాన్ని మగమహారాజులా గడిపేస్తూ ఉంటాడు. అలాంటి అద్భుతమైన జీవికి ఓ ఆడతోడు కావాల్సి వస్తుంది. తను అప్పుడప్పుడూ వెళ్లే కాలేజీలో, తనకి ప్రియురాలు కాగలిగిన ఉత్తమురాలు ఎవరా అని వెతుకుతుండగా, ఓ చదువుల తల్లి కనిపిస్తుంది. ఇక ఆమె వెంటపడటం మొదలుపెడతాడు మన హీరో! ఆ అమ్మాయి హీరో వంక చూడదు. అయినా ఇతగాడు వదలడు. వెంటపడుతూనే ఉంటాడు. తను ఛీ పొమ్మన్నా ద్వంద్వార్థాలతో వేధిస్తూనే ఉంటాడు. అదేం చిత్రమో కానీ ఆ అమ్మాయి ఇతగాడి ప్రేమలో పడిపోతుంది. ఎందుకంటే అది సినిమా కదా! కానీ నిజజీవితం ఇలా ఉండకపోవచ్చు. ఇలాంటి పోకిరీ కుర్రాడిని చూసిన అమ్మాయికి అతగాడితో ప్రేమన్నా, పెళ్లన్నా వెగటు పుట్టి ఉండవచ్చు. మరీ చిరాకేస్తే పోలీస్‌ కంప్లైంట్ కూడా ఇవ్వవచ్చు. దానికి నిజజీవితంలో కుర్రవాళ్లు ప్రవర్తించే తీరు కూడా భిన్నంగా ఉంటోంది. తన మనసుకి నచ్చిన అమ్మాయి నచ్చలేదన్న అక్కసుతో కొందరు తీసుకునే నిర్ణయం అవతలి మనిషి జీవితాన్నే చీకటిగా మార్చేస్తోంది. ఈ ఉపోద్ఘాతమంతా యాసిడ్‌ దాడుల గురించి అని వేరే చెప్పాలా!

2015లో మనదేశంలో 300కి పైగా యాసిడ్‌ దాడులు నమోదయ్యాయి. ఇక నమోదు కాని కేసులు వీటికి రెట్టింపు ఉండవచ్చని ఒక అంచనా! వీటిలో అధికశాతం దాడులు ఆడవారి మీదే జరిగాయి. అది కూడా 20 ఏళ్ల లోపువారి మీదే. వీటిలో అధికశాతం దాడులు జరగడానికి కారణం, సదరు అమ్మాయి తనకు లొంగలేదన్న అక్కసే కారణం. సామాన్యంగా ఏదన్నా ప్రమాదం సంభవిస్తే దాని మొదలు నుంచి తుది వరకూ ఏం చేస్తే బాగుంటుంది అన్న ఒక అవగాహన మన పెద్దలకు ఉంటుంది. కానీ యాసిడ్‌ దాడి తీరు వేరు! యాసిడ్‌ మీద పడటం అనేది ఒక హఠాత్పరిణామం! అది మన మీద పడిన వెంటనే ఎలాంటి ప్రథమచికిత్స తీసుకోవాలి. ఏ వైద్యుడిని సంప్రదించాలి అన్న అయోమయం ఒక పక్కన ఉంటే, శారీరిక నరకం కూడా యాసిడ్‌ చుక్క ఒంటి మీద పడిన క్షణం నుంచే మొదలవుతుంది.

పువ్వు రెక్కల మీద పడిన నిప్పు దాన్ని కాల్చివేసినట్లు, యాసిడ్‌ శరీరాన్ని కరిగించివేసే ఒక నిప్పు కణిక. అది మన శరీరంలోపలికి చొచ్చుకుపోతుంది. యాసిడ్‌ పడ్డాక చూపు పోవచ్చు; కనురెప్పలు కరిగిపోవచ్చు; గొంతు మీద పడితే శ్వాసనాళం దెబ్బతినిపోవచ్చు; జుత్తు శాశ్వతంగా మండిపోవచ్చు; పెదాలు, నాలిక, ముక్కు... ఇలా యాసిడ్ చుక్క పడిన ప్రతి అవయవం తన జీవాన్ని కోల్పోతుంది. అవతలి మనిషి తనకు దక్కలేదన్న అక్కసు, ఒక బతుకుని చీకటిగా, బతికే చీకటిగా మార్చివేస్తుంది. ఇలాంటి సందర్భాలలో ఒకపక్క శాశ్వతంగా ముఖకవళికలు దెబ్బతినిపోగా, అంతకంత మానసికమైన వేదనని కూడా అనుభవించాల్సి వస్తుంది. యాసిడ్‌ దాడికి గురైన వ్యక్తిని బాధితురాలిగా చూసి ఆదరించాల్సిన సమాజం, వెలివేసే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ కుటుంబసభ్యులు ఆదరించి వెన్నంటి ఉన్నా, బయట అడుగుపెడితే ప్రతి ఒక్కరి చూపూ ఆమె గాయాలని వెంబడిస్తూనే ఉంటాయి. అలాంటివారిని ఉద్యోగంలోకి చేర్చుకునేందుకు కానీ, తమలో కలుపుకునేందుకు కానీ ప్రతిఒక్కరూ వెనుకడుగు వేస్తూనే ఉంటారు.

ఒక పక్క శారీరికంగా, మానసికంగా వేదన పడుతూనే యాసిడ్‌ బాధితులు న్యాయం కోసం పోరాడవలసి ఉంటుంది. ‘ఇప్పటికే ఇలా చేశాడు. కేసు పెడితే ఇంకే చేస్తాడో!’ అన్న సలహాలు వీరిని వెంబడిస్తూనే ఉంటాయి. అసలే సమాజంలో మొహం చూపించుకోవాల్సిన పరిస్థితిలో లేని తాను, నిరంతరం కోర్టు గుమ్మాల చుట్టూ తిరిగే ధైర్యం చేయలేక చేయలేక, చాలామంది పోలీసు కేసు పెట్టేందుకు కూడా వెనుకంజ వేస్తుంటారు. పైగా నిరుద్యోగం, స్త్రీ పురుష వివక్ష ఎక్కువగా ఉన్న సమాజాలలోనే యాసిడ్‌ దాడులు ఎక్కువగా నమోదవుతున్నాయి. బంగ్లాదేశ్‌, ఇండియా, పాకిస్తాన్‌ వంటి దేశాలలో గత దశాబ్దంలో వేల కొద్దీ యాసిడ్‌ దాడులు జరగడమే దీనికి సాక్ష్యం. అలాంటి సమాజాలలో బాధితురాలికి ఎలాంటి అండ లభిస్తుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.

ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త మారుతూ ఉండటం కాస్త సంతోషించదగ్గ పరిణామం. ‘acid survivors trust international’, ‘acid survivors foundation’ వంటి సంస్థలు యాసిడ్‌ బాధితులకు అండగా నిలుస్తున్నాయి. యాసిడ్‌దాడిలో బాధితులైనవారు కూడా సమాజానికి ఎదురొడ్డి జీవించేందుకు సాహసిస్తున్నారు. తాము ఓడిపోలేదని రుజువు చేసుకుంటూనే, తమలాంటి బాధితులకి సైతం చేయందించేందుకు సిద్ధంగా ఉన్నారు. తాజ్‌మహల్‌ సమీపంలో ఇలాంటి యాసిడ్‌ బాధితులు కొందరు కలిసి ఏకంగా ఒక కాఫీషాప్‌నే (Sheroes Hangout) పెట్టడం ఇందుకు ఓ మంచి ఉదాహరణ.

యాసిడ్‌ దాడులలోని తీవ్రతను గ్రహించిన పార్లమెంటులు పదునైన చట్టాలను ప్రవేశపెట్టేందుకు శతథా ప్రయత్నిస్తున్నాయి. మన దేశంలో 2013లో మార్పుచేసిన 326A అధికరణాన్నే తీసుకుంటే, యాసిడ్ దాడికి పాల్పడేవారికి కనీసం పదేళ్ల కఠినకారాగారశిక్షను విధించాలని నిర్ణయించారు. నగల షాపుల్లోనో, వాహనాలను రిపేరు చేసే చోట్ల అతి సులువుగా దొరికే సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌, నైట్రిక్‌ యాసిడ్లను ఇక మీదట ఏదన్నా గుర్తింపు పత్రం ఉంటే తప్ప అమ్మరాదని న్యాయమూర్తులు 2013లో ఇచ్చిన ఒక తీర్పు సందర్భంగా పేర్కొన్నారు. ఇక బంగ్లాదేశ్‌లో అయితే, యాసిడ్‌ దాడులతో విసిగిపోయిన ప్రభుత్వం, ఈ దాడులకు పాల్పడే నేరస్తులకు ఏకంగా మరణశిక్షను విధించేలా చట్టానికి తగు సవరణలు చేసింది.

కానీ ఎవరెన్ని చట్టాలు చేసినా, ఆ చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా.... అవన్నీ క్షణికావేశంలో ఉన్న యువతను తప్పు చేయకుండా ఆపగలవని ఆశించలేం! మగపిల్లవాడు పుట్టిన దగ్గర్నుంచీ అతని తల్లిదండ్రులు, చదువు, సమాజం, సినిమాలు.... ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆడపిల్ల మగవాడికంటే తక్కువనీ; గొడవ వచ్చినప్పుడు ఆడది, మగవాడి మాట వినాలనీ; మగమహారాజులు ఏం చేసినా చెల్లిపోతుందనీ నూరిపోసినంత కాలం పిల్లవాడు అంతకంటే గొప్పగా ఆలోచిస్తాడని భావించలేం. కాబట్టి యాసిడ్‌ దాడిలో బాధితురాలు ఎవరో ఒక యువతి మాత్రమే కాదు! అది స్త్రీ జాతి మీద జరిగే దాడి. నేరస్తుడు కేవలం ఒక మగవాడు మాత్రమే కాదు! అతను అక్కసుతో, అహంకారంతో కళ్లు మూసుకుపోయిన ఆధిపత్య ధోరణికి ప్రతిబింబం. ఈ పరిస్థితులో మార్పు రానంతవరకూ.... యాసిడ్‌ దాడులు జరుగుతూనే ఉంటాయి.