దీటుగా... ఘాటుగా..... మోదీ చాయ్‌!

 

బహిరంగ వేదికల మీద మాట్లాడేందుకు ఆవేశం మాత్రమే ఉంటే సరిపోదు. దానికి తగిన వాక్పటిమ కూడా ఉండాలి. అది సుదీర్ఘకాలం అనుభవం ద్వారా మాత్రమే వస్తుంది. ఆ అనుభవంతో మాట్లాడటం మొదలుపెడితే, అవతలివారికి వాగ్బాణాలు గుచ్చుకోక తప్పవు. నిన్న ప్రార్లెమెంటులో మోదీ ప్రసంగాన్ని చూసినవారు ఎవరికైనే వచ్చే అభిప్రాయం ఇదే! గత కొద్ది రోజులుగా ప్రార్లమెంటులో తనమీదా, ప్రభుత్వం మీదా వస్తున్న ఆరోపణలకు మోదీ ఘాటుగానే జవాబు ఇవ్వనున్నారని అందరూ ఊహిస్తూనే ఉన్నారు. అదే జరిగింది....

 

ఒక పక్క నేరుగా తన మీద విమర్శలు చేసిన రాహుల్‌గాంధిని నేర్పుగా దుయ్యపడుతూనే ప్రతిపక్షాలకి స్నేహహస్తాన్ని చాచారు మోదీ. ఒకవైపు పథకాల అమలుతీరులో లోపాలున్నాయని అంగీకరిస్తూనే ఇన్నాళ్లూ మీరేం చేశారని జవాబులేని ప్రశ్నని వేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆత్మన్యూనతతో కొట్టుకుపోతోందనీ, అందుకే ఆ పార్టీ పదేపదే విమర్శలు చేస్తోందని అన్నారు. రాహుల్‌ గాంధిని ప్రోత్సహించేందుకు... కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతిభావంతులని, వాగ్ధాటి కలిగినవారినీ అణగదొక్కేస్తున్నారని విమర్శించారు. బుద్ధి పెరిగేందుకు బాదం పప్పుని తింటారనీ, కానీ కొంతమంది ఎన్ని బాదంపప్పులు తిన్నా బుద్ధిలో మాత్రం మార్పు ఉండదని దుయ్యబట్టారు. మోదీ ప్రసంగంలో పదేపదే తన మీద వస్తున్న ఛలోక్తులను తట్టుకోలేకనేమో, ఒకానొక సందర్భంలో రాహుల్‌ గాంధి సభను విడిచి వెళ్లేందుకు సైతం సిద్ధపడ్డారు. కానీ తన చర్య మరిన్ని విమర్శలకు దారి తీస్తుందనుకున్నారో ఏమో, తిరిగి వెనక్కి వచ్చి మరన్ని చెణుకులు వినక తప్పలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఓ ప్రభుత్వ ఆర్డినెన్సుని చించేసి హడావుడి చేసిన రాహుల్‌ దుండుకుతనం మీద సైతం మోదీ అస్త్రం సంధించారు. ‘అమెరికా అధ్యక్షుడు ఒబామాను కలుసుకునేందుకు మన దేశ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సిద్ధపడుతున్న సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్సుని చించి ముక్కలు చేశారు. దయచేసి పెద్దలను గౌరవించండి’ అంటూ నేరుగానే హితవు పలికారు.

 

పార్లమెంటులో కార్యకలాపాలను ప్రతిపక్షాలు పదేపదే అడ్డుకోవడం వల్ల కీలకమైన బిల్లులు చాలా నిలిచిపోతున్నాయని మోదీ ఆవేదన చెందారు. ఈ సందర్భంగా పార్లమెంటు సజావుగా సాగాలన్న రాజీవ్ ఆకాంక్షను ఉట్టంకించారు. పేదరికాన్ని తన ప్రభుత్వం నిర్మూలించలేకపోతోందని పదే పదే కాంగ్రెస్‌ చేస్తున్న విమర్శలకు కూడా మోదీ బదులిచ్చారు. కాంగ్రెస్‌ కనుక తన 60 ఏళ్ల అధికారంలో సజావుగా పాలించి ఉంటే, అసలు పేదరికం ఎందుకు ఉండేదని ఎదురు ప్రశ్నించారు. అన్నాళ్లు పెంచిపోషించిన పేదరికాన్ని నిర్మూలించడం తనకి చాలా కష్టమవుతోందని వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ పథకం మీద కాంగ్రెస్‌ చేసిన అవినీతి ఆరోపణలకి కూడా మోదీ ప్రత్యుత్తరం ఇచ్చారు. ఆ పథకంలో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని తాను వెయ్యి శాతం అంగీకరిస్తున్నాననీ, అయితే ఆ అవినీతి ఎవరి హయాలో సాగిందో ఓసారి కాగ్‌ నివేదిక చూస్తే అర్థమవుతుందన్నారు.ఒకపక్క ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఒక్కొక్కటిగా తిప్పికొడుతూనే తనకు విమర్శలు కొత్తేమీ కాదని చెప్పుకొచ్చారు.

 

14 సంవత్సరాలుగా తాను విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నాననీ, కానీ మరికొందరు ఉన్నారంటే వారిని ప్రశ్నించేందుకు ఎవరూ సాహసించలేరంటూ పరోక్షంగా కాంగ్రెస్‌ అధినాయకత్వాన్ని దెప్పిపొడిచారు. పదే పదే ఆత్మన్యూనతతో ప్రభుత్వాన్ని విమర్శించేకన్నా, ఆచరణాత్మక సూచనలు ఇవ్వాలంటూ ప్రతిపక్షానికి సూచించారు. ప్రపంచం ముంగిట మన పరువు మనమే తీసుకోకూడదంటూ, ఇందిరాగాంధి వ్యాఖ్యలనూ ఉట్టంకించారు. మరి మోదీ సూచనను ప్రతిపక్షాలు ఏమేరకు వింటాయో వేచి చూడాల్సిందే!