నిబంధనలు మంచివేనా??


మనిషికి జీవితంలో కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటి వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. ముఖ్యంగా కుటుంబాలలో, సమాజంలో నిబంధనలు తప్పనిసరి. కొందరికి కొన్ని నియమాలు చాలా కటినంగా అనిపిస్తూ ఉంటాయి, మరికొందరికి అవే మంచి చేస్తుంటాయి. మన చుట్టూ ఉన్న చాలామందితో మాట్లాడేటప్పుడు అలా కనుక లేకపోతే ఇంకేదో అయిపోయి ఉండేవాన్ని/ఉండేదాన్ని అంటూ ఉంటారు. ఇంకేదో అంటే ఇక్కడ ఉన్న స్థాయి కంటే మరోలా ఉండేవాళ్ళమని వాళ్ళ అభిప్రాయం. అంటే ఇక్కడ ఇంకా ఉన్నతంగా వెళ్ళడానికి సరైన దారులు కొరవడ్డాయని(లభ్యం కాలేకపోవడం లేదా అందుబాటులో లేకపోవడం) వాళ్ళ అభిప్రాయం.


చిన్నప్పటి నుండి కొన్ని నిబంధనల చుట్టూ పెరిగి, కాస్త ఊహ వచ్చాక, ఆ తరువాత మరికొంత ఎదిగాక ఒకానొక స్వేచ్ఛను కోరుకోవడం మొదలుపెట్టినప్పుడు నిబంధనలు అన్నీ పెద్ద గుదిబండలులా అనిపిస్తాయి అందరికీ. అయితే అవన్నీ మనిషిని ఒక గీత దాటకుండా నియంత్రిస్తూ ఉంటాయి.


పెద్దల అజమాయిషీ కాదు అతిజాగ్రత్త!!


ప్రతి ఇంట్లో ఇంకా కొన్ని చోట్ల పిల్లల మీద పెద్దలు ఎప్పుడూ నిఘా వేసి ఉంచుతూ ఉంటారు. వాళ్ళు కొన్ని నిబంధనలు విధిస్తారు. ఆ నిబంధనలు దాటి పిల్లలు ఎక్కడ తప్పటడుగులు వేస్తారోననే భయం వాళ్లలో ఉంటుంది. ఆ భయం నుండే పెద్దలకు తమ పిల్లలు తమ కనుసన్నల్లో మెలగాలని అలాగే వాళ్ళను డిమాండ్ చేయాలని ప్రేరేపిస్తూ ఉంటాయి. అయితే ఇదంతా స్వేచ్ఛను ఎక్కువగా కోరుకునే వయసు వాళ్లకు చాలా విసుగు తెప్పిస్తుంది. ఆ విసుగు నుండే ఒత్తిడి ఎక్కువై ఒకానొక వ్యతిరేక భావం ఏర్పడుతుంది.  ఆ వ్యతిరేక భావంలో నుండే పెద్దలు అది చేయద్దు అంటే అదేపనిగా దాన్ని చేసే బుద్ధి పుడుతుంది. 


కాబట్టి పెద్దలు పిల్లలకు విధిస్తున్న నిబంధనలు ఏవి ఎందుకోసం అనే విషయాన్ని పక్కన కూర్చోబెట్టుకుని వివరంగా చెబుతుంటే వాళ్ళు కూడా ఆ నిబంధనలను గౌరవిస్తారు. వాటిని పాటిస్తారు. వాటితో పాటు పెద్దలను కూడా ప్రేమిస్తారు.


మనకు మనం విధించుకోవాల్సినవి!!


చెప్పుకుంటే ఆశ్చర్యం వేస్తుంది కానీ మనకు మనం కొన్ని నిబంధనలు విధించుకోవడం వల్ల  మనకంటూ ఓ ప్రత్యేక జీవితాన్ని సృష్టించుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకత అనేది అందరికీ విభిన్నంగా ఉండాలనే ఆలోచనతో అనుకుంటే పొరపాటు. మనకున్న ఇష్టాలు, అభిరుచులు అనేవి మనలో ఉన్న ప్రత్యేకతలు, మనకున్న ఆసక్తులు ఇతరుల కంటే బిన్నంగానే ఉంటాయి. ఒకే ఇంట్లో ఉండే వాళ్లకు కూడా వేరు వేరు అభిప్రాయాలు, ఆసక్తులు ఉండేటప్పుడు ఎవరికి వారు కొన్ని నిబంధనలు విధించుకోవడం వల్ల తమకు నచ్చినట్టు ఉండే అవకాశం చేకూరుతుంది. అంతే కాదు ఆ నిబంధనలు ఎదుటి వారు మన జీవితాన్ని ప్రభావితం చెయ్యకుండా ఉండేలా చేస్తాయి కూడా.


ఆలోచనా విస్తరణ, ఆత్మవిశ్వాసపు వీక్షణ!!


పెట్టుకునే నిబంధనలు ఎప్పుడూ ఆలోచనా పరిధిని పెంచుకునేలా ఉండాలి. ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని ఒక చిన్న స్పూన్ లో పట్టుకున్నట్టు ఫీలైపోవడం మానుకుని అన్నిటినీ తెలుసుకునేలా ఉండాలి. దీని ఉద్దేశ్యం ఏమిటంటే ఎంతో పరిధి ఉన్న ఈ ప్రపంచంతో పాటు ఆలోచనా పరిధి కూడా పెరుగుతూ పోతుంది. నిబంధన అంటారు విస్తరణ అంటారు ఎలా సాధ్యం అని అందరికీ అనిపించవచ్చు. అయితే ఇక్కడే ఒక విషయం అర్ధం చేసుకోవాలి. భోజనం చేసేటప్పుడు బిపి పేషెంట్ ఉప్పు తక్కువే తినాలి. అలా తినాలని డాక్టర్ చెప్పినా సమస్య ఉన్న వ్యక్తి తనకు తాను నియంత్రించుకుంటూ నిబంధనలు పెట్టుకోకపోతే అతనికి నష్టం కాబట్టి. ఆలోచనా పరిధి పెంచుకునే దారిలో కూడా కొన్ని అనవసర విషయాలను పట్టించుకోకుండా ఉండేలా నిబంధనలు పెట్టుకోవాలన్నది దీని ఉద్దేశ్యం. 

ఆరోగ్యవంతమైన జీవితం!!


తినే పదార్థాలు కావచ్చు, రోజువారీ అలవాట్లు కావచ్చు, సంపాదించే మార్గాలు కావచ్చు, చదివే విషయం కావచ్చు, ఇతరుల జీవితాలు కావచ్చు. జీవితానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు కావచ్చు. ఇలా ప్రతి దాంట్లో కూడా మనిషి కొన్ని నిబంధనలు పెట్టుకుంటే గనుక అనవసర విషయాలు జీవితాల్లో నుండి వాటికవే తొలగిపోతాయి.  లేకపోతే అవి అప్రయత్నంగా వచ్చి చేరడం, వాటిని తొలగించుకోవడానికి సమయాన్ని వృధా చేసుకోవాల్సి వస్తుంది.


                                    ◆వెంకటేష్ పువ్వాడ