నైపుణ్యంతో నయా జీవితం!

ఒక్కో మనిషిలో ఒకో విధమైన ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత కాస్తా మనిషిని కూడా ప్రత్యేకంగా ఉంచుతుంది. అయితే దాన్ని మనిషి తన జీవితం కోసం ఎలా ఉపయోగించుకుంటాడు అనేదాని మీద మనిషి జీవితం ఎంత బాగా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎన్నో రంగాలు. అన్ని రంగాలలో కూడా ఇంత ప్రతిభ ఉన్న వాళ్ళకే అవకాశాలు.

ఇందులో వింత ఏముంది?? ప్రతిభ ఉన్నవాళ్లకే కదా అవకాశాలు అని అందరికీ అనిపిస్తుంది కానీ ప్రతిభ ఉన్నా అందులో నైపుణ్యం లేకపోతే అందరి మధ్యన నిలబడి గెలవడం కష్టమే. 

తేడా ఏంటి?

ప్రతిభకు, నైపుణ్యతకు తేడా ఏంటి?? అని ప్రశ్నించుకున్నప్పుడు రెండూ ఒకటే అనిపిస్తాయి చాలామందికి. అయితే రెండింటికీ మధ్య ఒక సన్నని గీతను చూస్తాయి అవకాశాలు ఇచ్చే అధికార పీఠాలు. అంటే ప్రతిభలో కూడా తక్కువ ఎక్కువలను ప్రమాణికాలు ఉంటాయనమాట.

మరైతే అవేంటి?? ఈ ఎక్కువ తక్కువల వృత్తం నుండి బయటకొచ్చి అవకాశాలు పొందటం ఎలా అంటే ప్రతిభకు పదునుపెట్టడమే. అలా పదును తెలినప్పుడే నైపుణ్యాలు మరొకరిని ఆకర్షిస్తాయి.

నిజాయితీ!

చేసే పనిని ఎంత నిజాయితీగా చేస్తున్నామన్నది మొదటి సూత్రం. ప్రతి చోట ఈ నిజాయితీని చూస్తారు. అంతేకానీ నిర్లక్ష్యపు ఆలోచనలతో చేసేపనిని అంత సీరియస్ గా తీసుకోకపోతే ఎంత ప్రతిభ ఉన్నవాడిని అయినా మూడురోజుల ముచ్చటగా పరికించి చూసి నాలుగవ రోజున బయటకు వెళ్లమంటూ తలుపులు తెరిచేస్తారు. కాబట్టి ప్రతిభ ఉన్నవాడు నిజాయితీ అనే గుణాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వేగం!

నీకు ఎంత బాగా పని చేయడం వచ్చు అనేది మంచి విషయమే, అయితే ఆ బాగా రావడంతో బాగా చేయడంలో వేగం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ కాలంలో టైమ్ సేవ్ చేయగలిగే నేర్పు ఉంటే వేతనం ఎక్కువ ఇచ్చి అయినా అవకాశం ఇస్తారు. తరువాత తమ నుండి ఎప్పటికీ దూరం చేసుకోరు. 

అందుకే మహాభారతంలో కూడా "సాధనాత్ సాధ్యతే సర్వం" అని ఉంది. అంటే సాధన చేస్తూ ఉంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. వచ్చిన పనిని పదే పదే చేస్తూ ఉంటే అందులో వేగం అందుకోవడం కష్టమైన పని ఏమీ కాదు.

క్రమశిక్షణ!

క్రమశిక్షణ పాటించే వాళ్ళు అన్నివిధాలుగా మిగిలిన వారికంటే మెరుగ్గా ఉంటారు అనేది ఒప్పుకోవలసిన నిజం. సమయానికి తగు సేవలు అందించే వాళ్లంటే అధికారులకు ప్రత్యేక ఆసక్తి కూడా. పని చేసే చోటుకు చేరుకోవడం నుండి, అప్పగించిన పనిని పూర్తి చేసే వరకు సమర్థవంతంగా ఉండాలి కోరుకుంటారు.  ఇంటి సమస్యలు, మానసిక ఒత్తిడులు, వ్యక్తిగత సమస్యలను పనిలోకి జొప్పించి, అసహనంతో, అసంబద్ధంగా నిర్లక్ష్యంగా ఉండేవాళ్లంటే డబ్బులిచ్చి పనిచేయించుకునే ఎవరు మాత్రం ఆసక్తి చూపిస్తారు??

అప్ డేట్ అవ్వాలి!

నిజంగా ఇది చాలా ముఖ్యమైనది. ప్రతిభ ఉంటే సరిపోదు. ప్రస్తుత వేగవంతమైన ప్రపంచంలో ఆ ప్రతిభ తాలూకూ రంగంలో కలుగుతున్న మార్పులను తెలుసుకోవాలి. ఆ మార్పులకు తగ్గట్టు ప్రతిభను అందులో వేగాన్ని, విభిన్నత్వాన్ని పెంపోందించుకోవాలి. ప్రస్తుతం విభిన్నత్వం కూడా ఒక పరిగణించాల్సిన అంశమే. ఎప్పుడైతే చేసేపనిలో కొత్తదనం, ఆకర్షణ కనబడతాయో అప్పుడు అందరూ ఆసక్తి చూపుతారు.

అవకాశాలు బోలెడు!

భారతదేశంలో నిరుద్యోగులు ఎక్కువ. అయితే వాళ్ళందరూ ఎందుకు నిరుద్యోగులుగా ఉన్నారు అంటే, చదువుకుని ప్రభుత్వ రంగాలలోనే ఉద్యోగం సాధించాలని ఎంతో విలువైన వయసు కాలాన్ని కేవలం ప్రయత్నాలలోనే గడిపేస్తుండటం వల్ల. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించకూడదు అనేది ఇక్కడి మాటల్లోని అర్థం కాదు. అది తప్ప వేరే ఇంకేమీ లేవని అనుకోవడం తప్పు అని చెప్పడం ఇక్కడి ఉద్దేశ్యం. 

అవకాశాల కోసం వెతుకులాడటం, పాకులాడటం కంటే అవకాశాలను సృష్టించడం తెలిస్తే ఇక జీవితంలో గొప్ప దశ ప్రారంభమైనట్టే. 

ముఖ్యంగా మనిషి తనలో ఉన్న ప్రత్యేకతను ఎంత మెరుగుపెట్టుకుంటూ వెళ్తే అంత నైపుణ్యం ఆ వ్యక్తిలో చేరుతుంది. ఆ నైపుణ్యాల ఫలితమే కొత్త జీవితానికి నాంది.

◆ వెంకటేష్ పువ్వాడ.