జగన్ విదేశీ పర్యటన.. గట్టిగా అభ్యంతరం చెప్పిన సీబీఐ

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దంటూ సీబీఐ గట్టిగా అభ్యంతరం చెప్పింది.  ఎన్నికలు పూర్తి కాగానే కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు అనుమతించాలంటూ జగన్ సీబీఐ కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరుగుతుంది. ఆ తరువాత మే 17న కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు వెళ్లాలని భావించిన జగన్ అభ్యర్థనను అంగీకరించవద్దని సీబీఐ గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసింది.

జగన్ పై 11 కేసులు విచారణలో ఉన్నాయనీ ఈ సమయంలో ఆయన విదేశీ పర్యటనకు అనుమతించవద్దనీ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన అఫిడివిట్ దాఖలు చేసింది. సీబీఐ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో నేరుగా చెప్పకపోయినా.. ఆయన విదేశాలకు వెడితే తిరిగి వస్తారన్న నమ్మకం లేదని అర్ధం వచ్చేలాగే పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..జగన్ విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించగానే  తెలుగుదేశం కూటమి నేతలు జగన్ పలాయనానికి రెడీ అయిపోయారని వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా సీబీఐ కూడా నేరుగా కాకపోయినా పరోక్షంగా కోర్టుకు తన అఫిడవిట్ లో అదే చెప్పింది.

మే 15వ తేదీన జగన్ ప్రధాన కేసు విచారణ ఉందనీ, ఆ విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉందని సీబీఐ పేర్కొంది. అయితే జగన్ తరఫు న్యాయవాదులు యథాప్రకారం వితండ వాదనే చేశారు. విదేశాలకు వెళ్లే హక్కు రాజ్యాంగం కల్పించిందనీ, దానిని కాలరాయడమేంటని వాదించారు. వాస్తవానికి జగన్ ప్రస్తుతం కండీషనల్ బెయిలుపై ఉన్నారు.  బెయిలు షరతుల్లో అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదన్నది ఒకటి. అలాంటి సమయంలో విదేశీయానాన్ని అడ్డుకోవడం హక్కును కాలరాయడం అవుతుందని వాదించడం విచిత్రమేనని న్యాయనిపుణులు అంటున్నారు. ఇరువైపు వాదనలూ విన్న మీదట కోర్టు తదుపరి విచారణను మే 14కు అంటే పోలింగ్ తరువాతి రోజుకు వాయిదా వేసింది. గతంలో జగన్ విదేశీయానానికి అనుమతి అడిగిన ఏ సందర్భంలోకూ కోర్టు వాయిదా వేయకుండా వెంటనే అనుమతి ఇచ్చింది. ఈ సారి మాత్రం వాయిదా వేయడంతో జగన్ అభ్యర్థనను కోర్టు అంగీకరించే అవకాశాలున్నాయా? లేవా అన్న చర్చ జోరందుకుంది.