సెకండ్ల వ్యవధిలో గుండె ఘోష కనిపెట్టేసే యాప్!.. 14 ఏళ్ల బుడతడి అద్భుత సృష్టి

గుండె ఘోష తెలియాలంటే..ఒక చిన్న స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఆ స్మర్ట్ ఫోన్ లో  తాను ఆవిష్కరించిన యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే సెకండ్ల వ్యవధిలో గుండెకు సంబంధించిన అన్ని రుగ్మతలనూ ఇట్టే తెలుసుకోవచ్చునంటున్నాడు ఈ 14 ఏళ్ల బుడతడు. అనడమే కాదు.. స్వయంగా స్మార్ట్ ఫోన్ ద్వారా గుండె పరీక్షలు నిర్వహించి ఔరా అనిపించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 14 ఏళ్ల సిద్ధార్థ్ నంద్యాల గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో గత మూడు రోజులుగా దాదాపు వెయ్యి మందికి హార్ట్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఆ స్క్రీనింగ్ టెస్ట్ లో గుండె సంబంధిత రుగ్మతలు ఉన్నాయని తేలిన వారందరికీ ఈసీసీ, 2డి ఎకో వంటి పరీక్షలు నిర్వహించి గుండె జబ్బు ఉందని వైద్యలు నిర్ధారించారు. దీంతో  సిద్ధార్థ్ నంద్యాల ఆవిష్కరించిన యాప్ పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.   

ఈ తరుణంలో సిద్ధార్థ నంద్యాల ఆవిష్కరించిన యాప్ వైద్య సేవల విషయంలో ఒక విప్లవానికి నాంది పలికినట్లేనని అంటున్నారు  వైద్య నిపుణులు.  పిట్ట కొంచెం కూత ఘనం అన్న మాట ఈ 14 సంవత్సరాల బుడతడికి అతికినట్లు సరిపోతుంది. సందేహం లేదు.. ఈ బుడతడి మేధస్సు, సాధించిన విజయాలు, ఆవిష్కరించిన అద్భుతం ప్రపంచానికే దిక్సూచిగా మారబోతున్నది. ఆధునిక సాంకేతికతను గుప్పిట పట్టిన ఈ చిన్నారి తాజాగా సాధించిన అద్భుతం వైద్య సేవలలో అత్యంత కీలకంగా మాపోనున్నది. ఇంతకీ ఈ చిచ్చరపిడుగు ఏం చేశాడనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం..

  సాంకేతిక పరిజ్ణానాన్ని అందిపుచ్చుకుని గుండె చప్పుడు వినడానికి ఒక అత్యధునిక అప్లికేషన్ తయారు చేశాడు  ఈ అపర మేధావి పేరు సిద్ధార్థ్.. భారత సంతతికి చెందిన సిద్ధార్థ పుట్టింది అనంతపురంలో అక్కడ నుంచి అతగాడి కుటుంబం హైదరాబాద్ కు అటు నంచి అమెరికాకు వెళ్లి స్థిరపడింది.  సిద్ధార్థ నంద్యాల తండ్రి మహేష్ అమెరికాలో వ్యాపార వేత్త. ఈయన కుటుంబం 2010లోనే అమెరికాలో స్థిరపడింది. ఇక సిద్ధార్థ  యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో ఏఐ బేస్డ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే సిద్ధార్థ ఒక యాప్ ను ఆవిష్కరించాడు. సిర్కాడియావి అనే ఈ యాప్ 93 శాతం యాక్యురెసీతో గుండె చప్పుడును బట్టి గుండె జబ్బులను నిర్ధారిస్తుంది. అమెరికాలో దాదాపు 15 వేల  మందికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించగా వారిలో 3500 మందికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు తేలింది. ఈ యాప్ సాయంతో ఇప్పుడు గుంటూరులోని జీజీహెచ్ ఆస్పత్రిలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రెండు రోజుల పాటు 500 మందికి  సిద్ధార్ధ్ ఆవిష్కరించిన యాప్ సాయంతో  స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, వారిలో పది మందికి గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు తేలింది. ఆ పది మందినీ వార్డుకు తరలించి ఈసీజీ, 2డి ఎకో పరీక్షలు చేయగా, వారికి గుండె జబ్బు ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఈ స్క్రీనింగ్ టెస్టులను తాను ఆవిష్కరించిన యాప్ ద్వారా స్మర్ట్ ఫోన్ తో సిద్ధార్ధ స్వయంగా చేయడం విశేషం. 

ఇటీవల డల్లాస్ లో సిద్ధార్థ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను కలిశారు. ఆయనకు తన సృజనను వివరించి తాను ఆవిష్కరించిన యాప్ ద్వారా గుండె జబ్బులను గుర్తించవచ్చనీ, అది కూడా స్మార్ట్ ఫోన్ ద్వారా ఏడు సెకన్లలో నిర్ధారించవచ్చని డిమాన్ స్ట్రేట్ చేసి వివరించారు. దీంతో ఇంప్రెస్ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ సిద్ధార్థ్ ను భారత్ కు ఆహ్వానించారు. దీంతో సిద్ధార్థ్ గుంటూరులోని జీజీహెచ్ లో తాను ఆవిష్కరించిన యాప్ ద్వారా స్క్రీనింగ్ పరిక్షలు నిర్వహించారు. ఆ యాప్ కచ్చిత్వానికి వైద్యులు సైతం అబ్బురపడ్డారు. 

ఇంతకీ ఈ యాప్ ఎలా పని చేస్తుందంటే... స్మార్ట్ ఫోన్ లో సిద్ధార్థ ఆవిష్కరించిన సిర్కాడియావీ యాప్ ను ఇన్ స్టాల్ చేస్తే చాలు. ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేసే ఈ యాప్ ను ఛాతిపై ఉంచితే  హార్ట్ బీట్ ను రికార్డ్ చేస్తుంది. సదరు వ్యక్తిగా గుండె సంబంధిత రుగ్మత ఏదైనా ఉంటే బీప్ సౌండ్ వస్తుంది. రెడ్ లైట్ వెలిగి.. అబ్ నార్మల్ హార్ట్ బీట్ అనే అక్షరాలు ఫోన్ స్క్రీన్ పై కనిపిస్తాయి. సిద్ధార్థ తన యాప్ ద్వారా గుంటూరు జీజీహెచ్ లో చేసిన స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు యాక్యురేట్ గా ఉన్నాయి. 

ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కుడైన సర్టిఫైడ్ ఏఐటెకీగా రికార్డు సృష్టించిన సిద్ధార్థ్ తన ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు  కలిసి వివరించి ఆయన అభినందనలు అందుకున్నారు.