ఏపీ మహిళా కమిషనా?.. వైసీపీ అనుబంధ విభాగమా?
posted on Apr 28, 2022 4:00PM
వైసీపీ పాలనలో రాజ్యాంగ వ్యవస్థలకు ఆవు కథ చెప్పడం పరిపాటిగా మారిపోయింది. బాధితులకు న్యాయం జరగకపోయినా, బాధితులు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయినా...విపక్షం కుట్రే నంటూ ఒకే కథ గత మూడేళ్లుగా చెపుతూ వస్తున్నాయి. సంఘటన ఏదైనా కథ మాత్రం అదే. అత్యాచారం జరిగినా, అధికారులపై దాడి జరిగినా వైసీపీ పాలనలో రాజకీయమే. విపక్షం పనే అన్నట్లుగా తయారైంది.
సర్వ వ్యవస్థలూ అధికార పార్టీ అనుబంధ సంస్థలుగా మారిపోయిన విచిత్ర పరిస్థతి నేడు ఆంధ్రప్రదేశ్ లో గోచరిస్తున్నది. ప్రజాస్వమ్యంలో సామాన్యుడికి న్యాయం సత్వరమే అందేందుకు వీలుగా ఏర్పాటైన వ్యవస్థలకు కూడా రాజకీయ చెదపట్టేసింది. దీంతో సామాన్యుడికి న్యాయం గగనంగా మారిపోయింది.
తాజాగా ఏపీ మహిళా కమిషన్ చేసిన రచ్చను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మహిళల భద్రత, రక్షణ, న్యాయం వంటి ఉదాత్త ఆశయాలతో ఏర్పడిన ఈ కమిషన్ వైసీపీ పాలనలో ఆ పార్టీ అనుబంధ సంస్థ స్థాయికి దిగజారపోయిందని పరిశీలకులు అంటున్నారు.
విజయవాడలో ఓ మానసిక వికలాంగురాలిపై జరిగిన అత్యాచార సంఘటన కేంద్రంగా మహిళా కమిషన్ విపక్ష నేతపైనా, పార్టీపైనా విషం కక్కడం చూస్తుంటే.. ఏపీలో మహిళా కమిషన్ ఉన్నది..బాధిత మహిళలకు న్యాయం చేయడానికా, రాజకీయ స్కోర్ సెటిల్ చేసుకోవడానికా తెలియని పరిస్థితి ఉంది.
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగితే ఫిర్యాదుపై స్పందించాల్సిన పోలీసులు మీన మేషాలు లెక్కపెట్టారు. బాధిత మహిళను కనీసం పరామర్శించడానికి కూడా సంఘటన జరిగిన మూడు రోజుల వరకూ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు తీరిక దొరక లేదు.. కానీ విపక్ష నేత బాధిత మహిళను పరామర్శించేందుకు వస్తున్నారని తెలియగానే ఆఘమేఘాల మీద అక్కడ వాలిపోయారు. పోనీ అప్పుడైనా మహిళకు స్వాంతన కలిగే చర్యలు ఏమైనా చేపట్టారా అంటే.. అదీ లేదు. బాధితురాలి బంధువులతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో బాధితురాలి పరామర్శకు వచ్చిన విపక్ష నేతకు బాధితులు పరుగుపరుగున వెళ్లి తమ కష్టం చెప్పుకోవడం విపక్ష నేత తనను అవమానించడమేనని ఆక్రోశం వెళ్లగక్కారు. అంతటితో ఊరుకోకుండా విపక్ష నేతతో వాగ్వాదానికి దిగి... తనను అవమానించారంటూ నోటీసులు జారీ చూసి విచారణకు రావాలని హుకుం జారీ చేశారు. ఇంత చేశారు కానీ బాధితురాలికి కమిషన్ పరంగా న్యాయం చేయడానికి ఏ చర్యా తీసుకోలేదు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టం తన పని తాను చేసుకు పోతుంది వంటి మాటలతో సరిపెట్టాశారు.
మహిళా కమిషన్ చైర్ పర్సన్ తీరుతో ఏపీలో మహిళా కమిషన్ ప్రతిష్ట మసకబారింది. రాష్ట్రంలో మహిళల భద్రత ప్రశ్నార్ధకమైంది. రాజకీయాలతో సంబంధం లేకుండా సర్వత్రా మహిళా కమిషన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.