షేమ్ షేమ్.. 90 ఏళ్ల పద్మశ్రీ గ్రహీతను రోడ్డున పడేసిన కేంద్రం!
posted on Apr 28, 2022 3:39PM
అతను 90 ఏళ్ల వృద్ధుడు. ప్రముఖ ఒడిస్సీ నృత్యకారుడు. పద్మశ్రీ గ్రహీత. ఢిల్లీలో ప్రభుత్వ గెస్ట్ హౌజ్‌లో ఉంటున్నారు. అక్కడ ఉండేందుకు పర్మిషన్ లేదంటూ.. గడువు ముగిసిందంటూ.. ఎండాకాలం.. మిట్ట మధ్యాహ్నం.. ఆయన్ను నడిరోడ్డుకు లాగేశారు. సామాన్లు అన్నీ ఇంటి నుంచి బయట పడేశారు. ఆయన వయసుకు, పద్మశ్రీ అవార్డుకూ గౌరవం ఇవ్వకుండా నిర్థాక్షిణంగా వ్యవహరించారంటూ విమర్శలు వస్తున్నాయి. మోదీకి కళాకారులంటే గౌరవం లేదని నృత్యకారుడి కుమార్తె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒడిస్సీ డ్యాన్సర్ గురు మయధర్ రౌత్ కొన్నేళ్లుగా ఢిల్లీలోని ఏషియన్ గేమ్స్ విలేజ్‌లో.. ప్రభుత్వం కేటాయించిన గెస్ట్ హౌజ్‌లో ఉంటున్నారు. పలువురు ప్రముఖ కళాకారులకు కేటాయించిన వసతిని 2014లో కేంద్రం రద్దు చేసింది. కళాకారులు కోర్టును ఆశ్రయించినప్పటికీ తీర్పు వారికి విరుద్ధంగా వచ్చింది. చాలా మంది ఇప్పటికే ఖాళీ చేసి వెళ్లిపోగా.. మిగిలిన వారు ఏప్రిల్ 25లోగా ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే, మయధర్ రౌత్ మాత్రం ఖాళీ చేసేందుకు మొండికేసి.. ఇంట్లోంచి వెళ్లకపోవడంతో.. అధికారులు బలవంతంగా ఆయన్ను, సామాన్లను రోడ్డున పడేశారు. ఆయనకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కార పత్రం కూడా రోడ్డుపై విసిరేశారు. ఆ దృశ్యాలు వైరల్ కావడంతో.. కేంద్రం తీరుపై విమర్శలు వస్తున్నాయి. కనీసం ఆయన వయస్సు దృష్టిలో ఉంచుకునైనా కాస్త మర్యాదగా ఖాళీ చేయించి ఉంటే బాగుండేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
ఘటనపై మయధర్ కుమార్తె మధుమితా రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇల్లు ఖాళీ చేయించడం చట్టపరంగా సరైందే అయినప్పటికీ అధికారులు ప్రవర్తించిన తీరుపై ఫైర్ అయ్యారు. కళాకారుల పట్ల మోదీ ప్రభుత్వానికి ఎటువంటి గౌరవం లేదని మండిపడ్డారు.
"ఖాళీ చేయించడాన్ని నేను వ్యతిరేకించట్లేదు. కానీ, ఇందుకు వారు ప్రవర్తించిన తీరు అమానవీయం. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మా ఇంటిబెల్ మోగింది. అప్పుడు నేను మా నాన్నకు భోజనం పెడుతున్నాను. అధికారులు వచ్చి మమ్మల్ని బయటకు వెళ్లిపొమ్మన్నారు. రెండు నిమిషాల సమయం కూడా ఇవ్వలేదు. ఆ వెంటనే పోలీసులు, కూలీలు వచ్చారు. చూస్తుండగానే మా సామాన్లన్నీ వీధిలో పెట్టారు. ఇదంతా చూసి మా నాన్న షాక్‌కు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. లేదంటే మా నాన్న మరణించేవారే. తన నాట్యంతో ఎన్నో సేవలందించిన ఆయనకు ఇలాంటి అవమానం జరగడం బాధాకరం. ఆయనకు ఎలాంటి ఆస్తులు లేవు. ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలి. ఇలాంటి ఘటన ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా?" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇళ్లు ఖాళీ చేయని మరో 8 మంది కళాకారులకు మే 2 వరకు గడువు ఇచ్చినట్లు కేంద్ర అధికారి చెప్పారు. వారందరికీ పలుమార్లు నోటీసులు జారీ చేశామని.. తాము బంగళాలను ఖాళీచేసే పనిలోనే ఉన్నామని, అయితే వారంతా మరికొంత సమయం కావాలని కోరుతున్నట్టు చెప్పారు. మయధర్ రౌత్ ఘటనపై స్పందించేందుకు నిరాకరించారు.