టీ సర్కార్ ఒంటెద్దుపోకడ ఆపాలి
posted on Jul 31, 2015 11:28AM
ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల బదిలీపై వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం స్ధానికత ఆధారంగా ఆంధ్రా మూలాలున్న ఉద్యోగులను బదిలీ చేస్తానంటుంటే.. మరో వైపు ఏపీ ప్రభుత్వం మాత్రం దీనికి అంగీకరించట్లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం విద్యుత్ ఉద్యోగుల విభజనపై తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని.. నిబంధనల ప్రకారమే జన్మస్థలం ఆధారంగా స్థానికతను నిర్ధారించి, ఏపీ మూలాలున్న విద్యుత్ ఉద్యోగులను గుర్తించి అక్కడికి బదిలీ చేశామని తెలిపింది కేంద్రానికి స్పష్టం చేసింది. ఉద్యోగుల బదిలీ విషయంపై కమలనాథన్ కమిటీ ఏర్పాటు చేశామని ఏపీ ప్రభుత్వం చెప్పినా తెలంగాణ ప్రభుత్వం అవేమి పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కార్పొరేషన్లకు కమలనాథన్ కమిటీ నిబంధనలు వర్తించవని చెపుతుంది.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఏపీ స్ధానికత ఆధారంగా ఆరుగురు జూనియర్ ప్లాంట్ అటెండెంట్లను ఏపీ విద్యుదుత్పత్తి సంస్థకు తాజాగా బదిలీ చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేసిన పనికి ఏపీ ప్రభుత్వం మండి పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని.. ఉద్యోగుల బదిలీలపై కోర్టులో కేసులున్నప్పటికీ ఇలా వ్యవహరిచండం సబబుకాదని అభ్యంతరం వ్యక్తం చేసింది. కమల్ ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ విభజన చట్టాన్ని ఉల్లంఘించిందని కేంద్ర హోంశాఖ దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకువెళ్లనున్నది. తెలంగాణ ప్రభుత్వం ఒంటెద్దుపోకడ మానితే చాలా బాగుంటుందని అంటున్నారు.
ఇదిలా ఉండగా విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఈ నెల 24న హోంకార్యదర్శి ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాసి అభిప్రాయాలను తెలపాలని కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో హోం కార్యదర్శి నేతృత్వంలో ఇరు రాష్ర్టాల సీఎస్‌లు, ఇంధన శాఖల కార్యదర్శులు, ఇరు రాష్ర్టాల విద్యుత్ సంస్థల సీఎండిలతో సమావేశం జరగనుంది. అయితే రాష్ట్రవిభజన జరిగిన తరువాత తొలగించిన ఉద్యోగులందరిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. అయినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ ఆదేశాలను ఖాతరు చేయకుండా తమకు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడంపై మండిపడుతున్నారు. ఇప్పటికే చాలా విషయాల్లో మొట్టికాయలు తిన్న తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో కూడా మొట్టికాయలు తింటే కాని వూరుకునేలాలేదు.