ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదుల చేతిలో నలుగురు భారతీయులు?
posted on Jul 31, 2015 12:00PM
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు లిబియాలో పనిచేస్తున్న నలుగురు భారతీయులను కిడ్నాప్ చేసినట్లు తాజా సమాచారం. వారిలో ఒకరు తెలంగాణా రాష్ట్రానికి చెందిన గోపీకృష్ణ అని సమాచారం. మిగిలిన ముగ్గురూ కర్ణాటక రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదుల చెర నుండి చాలా అరుదుగా ఎవరో ప్రాణాలతో బయటపడగలరు. కనుక ఇది చాలా ఆందోళన కలిగించే విషయమే. ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు చెలరేగిపోతున్న లిబియా తదితర ప్రాంతాలలో పనిచేస్తున్న భారతీయులలో నర్సులు, కార్మికులు ముఖ్యంగా నిరుపేద కూలీలు ఎక్కువగా పనిచేస్తున్నారు. కేంద్రప్రభుత్వం ఇప్పుడు ఉగ్రవాదుల చేతిలో బందీలుగా చిక్కినవారిని ఏదోవిధంగా విడిపించుకొనే ప్రయత్నాలు చేయవచ్చును. కానీ మళ్ళీ వాళ్ళు వేరేవాళ్ళని కిడ్నాప్ చేయరనే నమ్మకం ఏమీ లేదు. కనుక ఇప్పటికయినా కేంద్రప్రభుత్వం మేల్కొని వారందరినీ వెనక్కి రప్పించకపోతే మున్ముందు ఇంకా అనేకమంది అమాయకులయిన భారతీయులు ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది.