పాత తుపాకులు... 15 కోట్లు!

యూరప్‌ చరిత్ర మీద బలమైన ముద్ర వేసిన ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్ట్.కి చెందిన అరుదైన వస్తువులను వేలం వేశారు. వీటిలో రెండు తుపాకులు వున్నాయి. వీటిల్లో ఒకదానితో ఒకసారి నెపోలియన్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఆ తర్వాత విరమించుకున్నాడు. ఇప్పుడు ఆ తుపాకితోపాటు నెపోలియన్ ఉపయోగించిన మరో తుపాకిని కూడా వేలం వేశారు. ఇది 1.69 మిలియన్ యూరోలకు అమ్ముడయ్యాయి. అంటే మన కరెన్సీలో 15 కోట్ల రూపాయలు.

1814లో ఏప్రిల్ 12న నెపోలియన్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఈ రెండు తుపాకుల్లో ఒక తుపాకిని చేతిలోకి కూడా తీసుకున్నాడు. కానీ, ఆ తర్వాత ఎందుకో విరమించుకున్నాడు. ఈ విషయాన్ని అప్పట్లో నెపోలియనే స్వయంగా వెల్లడించాడు. నెపోలియన్ వాడిన ఈ తుపాకులను మెరైన్ గోస్సెట్ అనే సంస్థ తయారు చేసింది. ఇప్పుడు వేలంలో ఈ తుపాకులకు రికార్డు స్థాయి ధర లభించడం ఆ కంపెనీ వాళ్ళని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్రాన్స్ ప్రభుత్వం నెపోలియన్ వాడిన తుపాకులను జాతీయ సంపదగా ఇటీవలే ప్రకటించింది. అయినప్పటికీ, వీటిని బహిరంగ వేలంలో ఫ్రాన్స్ పౌరుడు ఒకరు కొనుగోలు చేశారు. వీటిని దేశం దాటించడానికి అవకాశం లేదు. ఈ తుపాకులను త్వరలో ప్రభుత్వమే కొనుగోలు చేసే అవకాశం వుంది. ఈ రెండు తుపాకుల తయారీలో బంగారం, వెండిని ఉపయోగించారు. ఇవి నెపోలియన్‌కి వారసత్వంగా లభించాయి.