అమరావతి భూముల విషయంలో ఏపీ సర్కార్ కు ఎదురు దెబ్బ.. సిట్ విచారణ పై హైకోర్టు స్టే 

అమ‌రావ‌తి రాజ‌ధాని భూముల వ్య‌వ‌హారంలో ఏపీలోని జగన్ ప్ర‌భుత్వానికి ఈరోజు మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. అమ‌రావ‌తి భూముల అంశంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ ఆరోప‌ణ‌లు, అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తూ సిట్ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం భావించిన సంగతి తెలిసిందే. దీనికోసం సిట్ తో విచారణ చేయించేందుకు ఏపీ ప్ర‌భుత్వం సిద్దమౌతుండగా సిట్ ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది. అంతేకాకుండా సిట్ ఏర్పాటు, మంత్రివర్గ ఉపసంఘం తదుపరి చర్యలు తీసుకోకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

 

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి భూముల విషయంలో గత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మంత్రివర్గ ఉపసంఘం సుమారుగా 4 వేల ఎకరాల్లో టీడీపీకి చెందిన నేతలు అక్రమంగా భూములు కొన్నట్టుగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపించింది. 

 

ఇది ఇలా ఉండగా అమరావతి రాజధాని భూముల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని నిన్న ఏసీబీ ఒక కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై కూడా ఎసిబి కేసులు నమోదు చేసింది. 

 

అయితే సిట్ ఏర్పాటును సవాల్ చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ ప్రభుత్వం దురుద్దేశంతో, పక్కా ప్రణాళిక ప్రకారం ఇదంతా చేస్తోందని తమ పిటిషన్ లో వారు ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సిట్ ఏర్పాటు పై స్టే విధిస్తూ తీర్పు వెలువ‌రించింది.