వైసీపీ సర్కార్ మొట్టమొదటి బడ్జెట్....రెండు లక్షల కోట్ల పైమాటే !
posted on Jul 12, 2019 9:23AM
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటి బడ్జెట్ ఈరోజు ఏపీ ప్రజల ముందుకు రానుంది. దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించనుందని అంచనా. ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి శాసనసభలో..పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసనమండలిలో బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. ఈ సారి బడ్జెట్‌లో ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్నాలకు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
అదే సమయంల రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర బడ్జెట్‌లో పన్నుల వాటాను పరిగణలోకి తీసుకొని ఏపీ బడ్జెట్ కు తుది రూపం ఇచ్చారు. .ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో తొలిసారిగా రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు బుగ్గన రాజేంద్రనాథ్. ఇదే సమయంలో శాసన మండలిలో రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ సమర్పిస్తారు. ఇక ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ మంత్రి కన్నబాబు సభ రాలేని పరిస్థితుల్లో ఉన్న కారణంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో, మంత్రి మోపిదేవి వెంకటరమణ శాసన మండలిలో ప్రవేపెట్టబోతున్నారు.
ఇక కేంద్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ ఏపీ ప్రభుత్వానికి మొండి చేయి చూపించింది. ఏపీకి పన్నుల ఆదాయం తప్పితే, కేంద్ర బడ్జెట్ లో అంటూ ప్రత్యేకించి ఏమీ కేటాయించలేదు. దానికి తోడు ఏపీ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో సింహభాగం సంపాదించి పెడుతున్న కీలకమైన మద్యం అమ్మకాల మీద కూడా ప్రభుత్వం ఆంక్షలతో విరుచుకుపడుతున్న నేపధ్యంలో ఆ ఆదాయం కూడా తగ్గే పరిస్థితి.
ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వ తొలి బడ్జెట్ ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. నిధుల కొరత తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం మేనిఫెస్టోలో నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా తొలి బడ్జెట్‌ను రూపొందించిందని అంటున్నారు. బడ్జెట్ రూ.2.31 లక్షల కోట్ల నుంచి రూ.2.32 లక్షల కోట్ల మధ్య ఉంటుందని, వ్యవసాయ బడ్జెట్ రూ.28 వేల కోట్లతో ఉంటుందని అంచనా.
ఖర్చులు తగ్గించాలని మంత్రులు, ఎమ్మెల్యే, అధికారులకు చెబుతున్న సీఎం జగన్ పొదుపు వలన మిగిలే నిధులను ప్రజా సంక్షేమానికి సమర్థంగా వినియోగించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ అంచనాలే కావడంతో అసలైన బడ్జెట్ కోసం పదకొండు గంటల దాకా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.