ఏపీ ప్రజల కోసమే కూల్ గా ఉన్నా! జల వివాదంపై జగన్ సంచలనం...
posted on Jun 30, 2021 3:59PM
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు మౌనం వీడారు. ఏపీ ప్రభుత్వంతో పాటు ఏపీ జనాలను కించపరుస్తూ తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులుగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా సైలెంటుగానే ఉన్నారు జగన్. దీంతో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రికి భయపడే మాట్లాడటం లేదనే ఆరోపణలు వచ్చాయి. అయితే బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో జల వివాదంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్.
తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారనిే సంయమనం పాటిస్తున్నట్లు జగన్ కామెంట్ చేశారు. మన రాష్ట్రం వాళ్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ అంశంపై ఎక్కువగా మాట్లాడటం లేదని అన్నారు. టీఆర్ఎస్ నేతలు దూకుడుగా మాట్లాడుతున్నారన్న జగన్.. తెలంగాణలోని ఏపీ ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలి? అని ప్రశ్నించిన ఏపీ సీఎం .. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని కామెంట్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్.. నీటి అంశంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తిని ఆపేయాలని కోరుతూ కేఆర్ఎంబీకి మరోసారి లేఖ రాయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీకి కూడా లేఖ రాయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.