సమరమా? సరెండరా? జగన్ మాటలకు అర్థాలే వేరులే..!
posted on Jun 30, 2021 4:37PM
తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని ఊరుకుంటున్నా.. వాళ్లని ఇబ్బంది పెడతారనే ఎక్కువగా మాట్లాడటం లేదు.. లేదంటేనా...? అన్నట్టు మాట్లాడారు ఏపీ సీఎం జగన్. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై సంచలన కామెంట్లు చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఆయనేదైనా కామెంట్లు చేస్తే.. హైదరాబాద్‌లోని ఏపీ ప్రజలపై అక్కడి వారు దాడులు చేస్తారనే అర్థం వచ్చేలా.. జగన్ వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు. బహుషా జగన్ అలా అనడానికి.. ఇటీవల తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేసిన హెచ్చరికే కారణం కావొచ్చని కూడా చెబుతున్నారు. కొడాలి నాని.. నీకు హైదరాబాద్‌లో రెండు ఇళ్లు ఉన్నాయి జాగ్రత్త అంటూ ఆ మంత్రి వార్నింగ్ ఇవ్వడంతోనే సీఎం జగన్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసుంటారని అంటున్నారు.
ఏపీ ప్రభుత్వాన్ని, ఏపీ ప్రాజెక్టులను, సీఎం జగన్‌ను, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ను.. నోటికొచ్చినట్టు తిట్టింది తెలంగాణ మంత్రులు మాత్రమే. అక్కడి ప్రజలు కాదు. టీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీపై మళ్లీ విమర్శలు చేస్తున్నారు. తననూ, తన తండ్రిని గజదొంగ, నీళ్లదొంగ అంటూ నోటికొచ్చినట్టు తిడుతున్నా.. ఏదో కారణంతో ఇన్నాళ్లూ నోరుమూసుకుని మౌనంగా ఉన్న జగన్.. తాజాగా ఏపీ కేబినెట్‌లో తన మౌనానికి కారణాన్ని వివరించి చెప్పారు. తానేమైనా తిరిగి మాట్లాడితే.. తెలంగాణలోని ఏపీ ప్రజలను వాళ్లు ఇబ్బంది పెడతారనే ఉద్దేశ్యంతోనే అన్నీ మూసుకొని భరించానంటూ స్పష్టం చేస్తూ.. రెండు ప్రభుత్వాల జల జగడంలోకి ప్రజలనూ ఇన్వాల్స్ చేసే ప్రయత్నం జగన్ చేశారంటున్నారు.
ఇటీవల జరిగిన తెలంగాణ కేబినెట్‌లో కృష్ణా నదిపై కడుతున్న పలు ఏపీ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాబోర్డుకు, కేంద్రానికి, గ్రీన్ ట్రైబ్యునల్‌కు తెలంగాణ సర్కారు ఫిర్యాదు చేసింది. అందుకు కౌంటర్‌గా.. తాజా ఏపీ కేబినెట్ భేటీలోనూ సీఎం జగన్ తెలంగాణ తీరుపై మండిపడ్డారు. ఏపీ రైతులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. నీటి వివాదంపై తెలంగాణ మంత్రులు పరిధి దాటి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అయితే.. తనను గజదొంగ, వైఎస్సార్‌ను నీళ్లదొంగ అన్నందుకు జగన్ తరఫు నుంచి ఎలాంటి స్ట్రాంగ్ రియాక్షన్ మాత్రం రాలేదు. తెలంగాణలోని ఏపీ ప్రజల రక్షణ కోసమే తానేమీ అనట్లేదన్నట్టు కవరింగ్ ఇస్తున్నారని అంటున్నారు. ఏడేళ్లుగా ఒక్కదాడి కూడా జరక్కున్నా.. సడెన్‌గా హైదరాబాద్‌లో ఏపీ వాసులను ఏమైనా చేస్తారేమోననే అనుమానం ఎందుకొచ్చిందో ఎవరికీ అర్థం కావట్లేదు. తెలంగాణలో తనకున్న ఆస్తుల రక్షణ కోసమో.. రాజకీయ ప్రయోజనాల కోసమో.. కారణమేంటో తెలీదు కానీ.. కేసీఆర్-జగన్‌లు మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగానే మళ్లీ జల వివాదాలను రెచ్చగొడుతున్నారనే వాదనా వినిపిస్తోంది.
అయితే, వారి ప్రయోజనాల మాటేమో కానీ.. ఇదే అదనుగా తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి కోసమంటూ కృష్ణా వాటర్‌ను ఇష్టం వచ్చినట్టి వాడేసుకుంటోంది. ఈ విషయంలో మరోసారి కృష్ణా యాజమాన్య బోర్డుకు లేఖ రాయాలని.. అలాగే జలవివాదాలపై ప్రధానికి కూడా లేఖ రాయాలని మంత్రులను సీఎం జగన్ ఆదేశించారు. నీటి విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో అలోచించి ముందుకు వెళ్లాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారు. అయితే, ఏ నిర్ణయమైనా జగన్ సొంతంగానే తీసుకుంటారు. అర్థరాత్రి వైఎస్సార్‌తో చర్చించి ముందుకెళతారని అంటారు. అలాంటిది, అతి సంక్లిష్టమైన జల జగడంపై మాత్రం మంత్రులే నిర్ణయం తీసుకోవాలంటూ తాను సైడ్ అయిపోవాలని చూడటం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు.. రాయలసీమ ప్రాజెక్టు పనులను బుధవారం పరిశీలించాల్సిన కేఆర్ఎంబీ టూర్ వాయిదా పడింది. తమకు ఏపీ నుంచి సహకారం అందడం లేదని ఆరోపించింది. జూలై 3న భద్రతా బలగాల సాయంతో ప్రాజెక్టును పరిశీలిస్తామని కేఆర్ఎంబీ కేంద్ర జలవనరుల శాఖకు తెలిపింది. కేఆర్ఎంబీ ఆదేశాలను రెండు రాష్ట్రాలు పట్టించుకోకపోవడంతో జల వివాదం ఎటువైపు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలోనూ ఓసారి నాగార్జున సాగర్ డ్యాం దగ్గర ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా బలగాలను మోహరించడం.. రెండు రాష్ట్రాల పోలీసులు బాహాబాహీకి దిగడం కలకలం రేపింది. ఈసారి కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడుతాయోమోనన్న చర్చ జరుగుతోంది. ఇంతటి ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణలో ఏపీ ప్రజలను అక్కడి వాళ్లు ఇబ్బంది పెడతారనే ఊరుకుంటున్నా.. అంటూ వివాదాస్పద కామెంట్లు చేసి జల వివాదాన్ని మరింత రాజేశారు సీఎం జగన్. ఈ పరిణామాలు ఏ తీరానికో....