రేవంత్‌రెడ్డితో వైఎస్సార్ బ్యాచ్‌!.. కాంగ్రెస్‌లో మ‌రో మ‌హానేత‌..!

రేవంత్‌రెడ్డికి పీసీసీ పీఠం వ‌రించ‌గానే.. కాంగ్రెస్‌లో ఫుల్ జోష్. ద‌మ్మున్ననాయ‌కుడు వ‌చ్చాడంటూ కేడ‌ర్‌లో క‌ద‌నోత్సాహం. కేసీఆర్‌కు క‌రెక్ట్ మొగుడంటూ.. ఇక హ‌స్తం పార్టీదే అధికారమంటూ అప్పుడే ఊహాగానాలు. కాంగ్రెస్‌లో ఇలాంటి ఉత్తేజం ఇంత‌కు ముందెప్పుడూ లేదు. అప్ప‌ట్లో వైఎస్సార్ ఉన్న‌ప్పుడు పార్టీ ఇలానే కొత్త‌పుంత‌లు తొక్కింది. మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌ర్వాత కాంగ్రెస్ త‌న హ‌స్త‌రేఖ‌లు మార్చుకుంటోంది. రేవంత్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణుల ఆశాకిర‌ణం.. రేవంత్‌రెడ్డితోనే పార్టీకి పున‌ర్‌వైభ‌వం సాధ్యం., అని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. బ‌హుషా అందుకే కాబోలు.. కాంగ్రెస్‌లోని పాత కాపులంతా మ‌ళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఏడేళ్లుగా మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్న లీడ‌ర్లంతా మ‌ళ్లీ ఖ‌ద్ద‌ర్ బ‌ట్ట‌లు బ‌య‌ట‌కు తీస్తున్నారు. రేవంత్‌రెడ్డిని క‌లిసి.. త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేందుకు ఆయ‌న క్యాంప్ ఆఫీసులు వ‌ల‌స క‌డుతున్నారు. ఒక‌రా.. ఇద్ద‌రా.. రేవంత్ ఇంటి దగ్గ‌ర జాత‌ర‌. బ‌డాబ‌డా నేత‌ల నుంచి బ‌క్కప‌ల‌చ కార్య‌క‌ర్త వ‌ర‌కూ.. రేవంత్‌ను క‌లిసి శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ఇక అభిమానుల హంగామా అంతాఇంతా కాదు. ఇటు ఇంటి ముందు.. అటు సోష‌ల్ మీడియాలో.. రేవంత‌న్న నినాదాలు మారుమోగుతున్నాయి. 

చాలాకాలం త‌ర్వాత వైఎస్సార్ మ‌నుషులుగా ముద్ర‌ప‌డిన ప‌లువురు నేత‌లు తాజాగా రేవంత్‌రెడ్డిని క‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సురీడు తెలుసుగా.. ఒక‌ప్ప‌టి వైఎస్సార్ అనుచ‌రుడు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణంతో అర్థాంత‌ర‌మైన ఆయ‌న‌.. ఇప్పుడు మ‌ళ్లీ రేవంత్‌రెడ్డి వెలుగుల్లో ఉద‌యిస్తున్న సూరీడుగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇటీవ‌ల రైతు భ‌రోసా పాద‌యాత్ర స‌భ‌లోనే రేవంత్ స‌భ‌లో త‌ళుక్కున మెరిసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇప్పుడు రేవంత్‌కు పీసీసీ పీఠం ద‌క్క‌డంతో మ‌రోసారి ఆయ‌న్ను క‌లిసి అభినంద‌న‌లు చెప్పారు. బ‌హుషా.. వైఎస్సార్ త‌ర్వాత రేవంత్‌రెడ్డిపైనే ఆయ‌న‌కు గురి కుదిరిన‌ట్టుంది. కుదిరితే.. రేవంత్‌కూ ప్ర‌ధాన అనుచ‌రుడు అవ్వాల‌ని సురీడు భావిస్తున్నారో ఏమో....

ఇక‌, ఫైర్ బ్రాండ్ లీడ‌ర్ కొండా సురేఖ సైతం రేవంత్‌రెడ్డిని కలిసి శుభాకాంక్ష‌లు తెల‌ప‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ప్ర‌స్తుతం ఆమె కాంగ్రెస్‌లోనే ఉన్నా.. కొన్నాళ్లుగా పార్టీలో స్త‌బ్దుగా ఉన్నారు. రేవంత్‌రెడ్డి రాక‌తో మ‌ళ్లీ యాక్టివ్ అవుతున్నారు. రేవంత్‌లానే కొండా సురేఖ‌కు కేసీఆర్ అంటే బ‌ద్ద విరోధం. అప్ప‌ట్లో జ‌గ‌న‌న్న కోసం కేసీఆర్‌ను ఎదిరించి.. మ‌హ‌బూబాబాద్‌లో రాళ్ల దాడిని ఎదుర్కొన్నారు. అంత‌కుముందు వైఎస్సార్ మ‌నిషిగా కాంగ్రెస్‌లో ఆధిప‌త్యం చెలాయించారు. వైఎస్సార్ మ‌ర‌ణంతో కాంగ్రెస్‌ను వీడి జ‌గ‌న్ వెనుక నిల‌బ‌డ్డారు. అయితే, జ‌గ‌న్ తెలంగాణను వ‌దిలేసి ఏపీకి పారిపోవ‌డంతో.. వేరే గ‌త్యంత‌రం లేక టీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్యే అయ్యారు. అయితే, నియోజ‌క‌వ‌ర్గంలో అరాచ‌కాలు చేస్తున్నార‌నే కార‌ణంతో సెకండ్ ట‌ర్మ్‌లో ఆమెకు క‌నీసం టికెట్ కూడా ఇవ్వ‌కుండా అవ‌మానించారు. దీంతో.. కేసీఆర్‌ను దెబ్బ కొడ‌తానంటూ స‌వాల్ చేసి మ‌రీ కారు దిగి.. మ‌ళ్లీ కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు. పార్టీలో చేరినా రెండేళ్లుగా యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కావ‌డంతో.. కొండా క‌ళ్ల‌ల్లో ఆనందం క‌నిపిస్తోంది. అందుకేనేమో.. హార‌తి ఇచ్చి మ‌రీ రేవంత్‌కు అభినంద‌న‌లు తెలిపారు కొండా సురేఖ‌. రేవంత్‌రెడ్డి అయితేనే కేసీఆర్‌ను గ‌ద్దె దించ‌గ‌ల‌డు.. ఆయ‌న ద్వారా మాత్ర‌మే తాము గులాబీ బాస్‌పై ప‌గ తీర్చుకోగ‌ల‌ము అని కొండా భావిస్తున్నారేమో. అందుకే, ఒక‌ప్ప‌టి వైఎస్సార్ మ‌నిషి.. ఇప్పుడు మ‌ళ్లీ రేవంత్‌రెడ్డి మ‌నిషిగా మారుతున్నారు.  

కొండా దంప‌తుల‌నే కాదు.. ష‌బ్బీర్ అలీ, మ‌ల్లు ర‌వి, పొన్నం ప్ర‌భాక‌ర్‌, గోనె ప్ర‌కాశ్‌రావు లాంటి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అనుచ‌ర‌గ‌ణ‌మంతా ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప‌క్షాన నిలుస్తున్నారు. వైఎస్సార్ లాంటి ఛ‌రిస్మాను వాళ్లు రేవంత్‌లో చూడ‌గ‌లుగుతున్నారు. అవే నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు.. అదే పోరాట ప‌టిమ‌. రేవంత్‌రెడ్డి మ‌రో వైఎస్సార్ అవుతార‌ని వారు బ‌లంగా న‌మ్ముతున్నారు. అందుకే, ఆల‌స్యం చేయ‌కుండా.. రేవంత్‌రెడ్డికి పీసీసీ ప‌గ్గాలు అంద‌గానే.. ఆయ‌న వెనుక నిలిచి.. కాంగ్రెస్‌ను ముందుకు న‌డిపించి.. కేసీఆర్‌పై దండెత్త‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. వైఎస్సార్‌లానే రేవంత్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌లో తిరుగులేని నేత. వైఎస్సార్‌లానే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ను గెలిపించే మ‌హానేత‌. వైఎస్సార్‌లానే పాద‌యాత్రగా ముఖ్య‌మంత్రి పీఠం వైపు అడుగులు వేయ‌బోతున్నారు రేవంత్‌రెడ్డి అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News