గంజాయి స్మగ్లింగ్ కు కేంద్రంగా మారిన ఆంధ్రా అటవీప్రాంతం
posted on Apr 20, 2012 11:10AM
ఆంధ్రా అతవీప్రాంతాల్లోని విశాఖ, తూర్పుగోదావరి, ఖమ్మం ప్రాంతాల్లోని కారడవుల మీదుగా పెద్దఎత్తున గంజాయి అక్రమంగా రవాణా అవుతోంది. ఒరిస్సాలోని కొరాపుట్, ఆ చుట్టుపక్కల అటవీప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతోంది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన ఈ జిల్లాలో చుట్టుపక్కల ప్రదేశాలకు ప్రవేశించే సాహసం ఒరిస్సా పోలీసులు చేయటం లేదు. దీంతో ఇక్కడ కోట్లాది రూపాయల విలువైన గంజాయిని సేద్యం చేస్తున్నారు.
ఈ గంజాయిని వివిధ మార్గాలద్వారా మన రాష్ట్రంలోకి, ఇక్కడి నుండి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు తరలిస్తున్నారు. స్మగ్లర్లు ఈ గంజాయిని తరలించేందుకు రాష్ట్రంలోని గిరిజనుల సహకారం తీసుకుంటున్నారు. కేవలం దట్టమైన అటవీమార్గం ద్వారానే దీన్ని తరలిస్తున్నారు. ఒక్కొక్క గిరిజనుడికి ఒక్కొక్క గంజాయిబస్తాను అప్పగించి నాలుగురోజుల ప్రయాణానికి మూడువేల రూపాయలు కిరాయి ఇస్తున్నారు. గిరిజనులు ఒక్కొక్కబస్తాను నెత్తిన పెట్టుకుని కాలినడకన నాలుగురోజుల పాటు ప్రయాణించి గమ్యస్థానానికి చేరుస్తున్నారు. అక్కడ నుంచి దీనిని కార్లలో లోడు చేసి గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. గిరిజనులు ఎంచుకుంటున్న మార్గాలు రాష్ట్రంలోని పోలీసులకు గానీ, ఎక్సయిజ్ సిబ్బందికిగానీ అంతుబట్టడం లేదు. స్మగ్లర్లు వాహనాల ద్వారా సరుకును రవాణా చేస్తున్నప్పుడు మాత్రమే అప్పుడప్పుడు వాటిని గుర్తించగలుగుతున్నారు. అంతేగాని దట్టమైన అటవీమార్గం ద్వారా జరుగుతున్న గంజాయి రవాణాను మాత్రం అరికట్టలేకపోతున్నారు.